ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Tramadol Tablets: ఔషధ నియంత్రణ మండలి పర్యవేక్షణ లోపం.. యధేచ్ఛగా మాదకద్రవ్యాల తయారీ

By

Published : Apr 29, 2023, 8:06 AM IST

Drugs : ఔషధ నియంత్రణ మండలి పర్యవేక్షణ లోపం..ఎగుమతి నిబంధనల్లో లొసుగులను అనుకూలంగా మార్చుకుని.. అక్రమార్కులు ఏకంగా మాదకద్రవ్యాలనే తయారుచేస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో పట్టుబడిన ట్రెమడాల్ మాత్రలు..ప్రభుత్వ పర్యవేక్షణలోపం, ఔషధ నియంత్రణ మండలి పనితీరును ప్రశ్నిస్తున్నాయి.

Tramadal Tablets
Tramadal Tablets

పల్నాడు జిల్లాలో పట్టుబడిన ట్రెమడాల్ మాత్రలు

Illegal Tramadol Tablets : మందుల తయారీ, విదేశీ ఎగుమతుల అనుమతుల జారీలో లోపాలను అనుకూలంగా మార్చుకున్న అక్రమార్కులు... పేట్రేగిపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలు లోపభూయిష్టంగా ఉన్నందున.. విదేశాల అవసరాలకు మందుల తయారీ అనుమతుల జారీ, తరలింపు ప్రహసనంగా జరుగుతోంది. ముఖ్యంగా మందుల తయారీ పూర్తయి పంపిణీకి సిద్ధమైన అనంతరం దరఖాస్తు చేస్తేనే నమూనాలు పరీక్షించి, విదేశాలకు పంపించేందుకు అనుమతులు ఇస్తామని ….సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌ చెబుతోంది.

మందులు విదేశాలకు పంపించేందుకు సీఎన్‌బీ నుంచి అనుమతి తప్పనిసరి అని అనుమతుల జారీ పత్రాలపై రాయడం తప్ప..అది ఆచరణలో జరుగుతుందా? లేదా? అన్నది తమ పరిధిలోనికి రాదని రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలనా విభాగం పేర్కొంటోంది. ప్రాణధార మందుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు తలోదిక్కుగా వ్యవహరిస్తుండడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

పల్నాడు జిల్లాలో ట్రెమడాల్ అనే మాదకద్రవ్యాన్ని మాత్రల రూపంలో విదేశాలకు ఎగుమతి చేస్తున్న కేసులో సేఫ్‌ ఫార్ములేషన్స్‌ ఔషధ కంపెనీ యజమాని శ్రీధర్‌రెడ్డిని ముంబయి కస్టమ్స్‌ అధికారులు ఇటీవల అరెస్టుచేశారు. మాత్రల తయారీ అనుమతుల జారీ ప్రక్రియ, పంపిణీ సంస్థల తీరును పరిశీలిస్తే అక్రమాలు జరిగిన తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలో ఇప్పవరకు జరిగిన అక్రమాలకు భిన్నంగా సేఫ్‌ బండారం బయటపడింది. ప్రముఖ తయారీ సంస్థల పేర్లతో మందులను నకిలీ సంస్థలు తయారుచేసి, విక్రయించిన సంఘటనలు రాష్ట్రంలో అప్పుడప్పుడు బయటపడుతూనే ఉంటాయి.కానీ విదేశాలకు మందుల ఎగుమతికోసం నార్కోటిక్స్ అధికారుల నుంచి అనుమతి పొందాల్సిన వ్యవహారంలో తొలిసారి అక్రమాలు గుర్తించారు. నార్కోటిక్స్‌ అధికారుల ప్రమేయం ఉందంటేనే..మాత్రల తయారీ, పంపిణీ ఎంతో పకడ్బందీగా జరగాలి. కానీ అక్రమార్కులు అవేమీ పట్టించుకోకుండా మందుల ఎగుమతి చేశారు.

బెంగళూరుకు చెందిన ఫస్ట్‌వేల్త్‌ సొల్యూషన్స్‌ నుంచి వచ్చిన ఆర్డర్‌ను, ఇతర నోటరీ పత్రాలను చూసిన వెంటనే రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి అనుమతినిచ్చింది. అయితే...అనుమతుల జారీ అనంతరం మందుల తయారీ నిర్ణీత ప్రమాణాల ప్రకారం జరుగుతుందా? లేదా? అన్నది తనిఖీ జరగలేదు. ఈ మందుల తయారీకి అవసరమైన ముడిసరుకును ఎక్కడి నుంచి తెస్తున్నారన్న దానిపైనా నిఘా పెట్టలేదు. విదేశాలకు మందుల ఎగుమతికి ఎలాంటి ప్రమాణాలు పాటించారు అన్నదానిపైనా నిశిత పరిశీలన జరగలేదు. ఈ పర్యవేక్షణ లోపం వల్లే సేఫ్‌ ఫార్ములేషన్స్‌ సంస్థ ఇష్టానుసారం వ్యవహరించింది. కాల్షియం పేరుతో ఉన్న బాక్సుల్లో ట్రెమడాల్‌ మాత్రలను ఎందుకు ఉంచారు? సీఎన్‌బీనుంచి అనుమతి కోసం ఎందుకు ప్రయత్నించలేదన్న దానిపై ఇప్పటికీ అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం రావడంలేదు. ఈ ధోరణివల్ల ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం నెలకొంది.

గతంలో ప్రత్యేక మందుల జాబితాలో ఉన్న వాటిని విదేశాలకు సరఫరా చేసేందుకు నార్కోటిక్స్‌ అధికారులు వాటి తయారీకి ముందే అనుమతినిచ్చేవారు. ఆ తరువాత మందుల తయారీ జరిగేది. కాలక్రమంలో ఈ అధికారాలను రాష్ట్రాలకు బదిలీచేశారు. మందుల పరిశ్రమల స్థాపన, తయారీ అనుమతులు రాష్ట్రాల ద్వారానే జరుగుతున్నాయన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నారు. రాష్ట్రాలకు ఈ అధికారాలను బదిలీచేసినప్పటికీ..వీటిని పకడ్బందీగా అమలుచేసే వ్యవస్థ ఏపీలాంటి చోట్ల లేదు. రాష్ట్రంలో 40 వేల మందుల దుకాణాలు ఉంటే.. కేవలం 45 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. వీరిపై పర్యవేక్షణ అధికారులు 14 మంది ఉన్నారు. ఇతర హోదాల్లో పనిచేసే సీనియర్, ఇతర సిబ్బంది కలిపి 150లోపు ఉన్నారు. దీనివల్ల మందుల దుకాణాలపై కానీ, తయారీ సంస్థలపై కానీ రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలన విభాగానికి నియంత్రణ లేకుండా పోయింది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details