ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Water Problem In Palakonda నీటి సమస్యతో అల్లాడుతున్న పాలకొండ ప్రజలు

By

Published : May 14, 2023, 4:16 PM IST

Etv Bharat
Etv Bharat

Water Problem: పాలకొండను నాన్‌ అమృత్‌ పథకం ఊసురుమనిపిస్తోంది. నాలుగేళ్ల క్రితమే పనులు మంజూరైనా ...అదిగో ఇదిగో అంటూ జాప్యం చేస్తున్నారే తప్ప అడుగులు ముందుకు పడడం లేదు. ఏటా వేసవిలో ప్రజలు తాగునీటికి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం నాలుగు ప్రధాన రక్షిత పథకాల ద్వారా చాలీచాలని విధంగా తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. పైపులైన్లు మరమ్మతులకు గురై..... శివారు ప్రాంతాలకు తాగునీటి సరఫరా గగనంగా మారింది.

Water Problem: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ ప్రజలకు తాగునీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో నాన్-అమృత్ పథకాన్ని మంజూరు చేసింది. నగరపంచాయతీ పరిధిలోని నాలుగు పథకాల విస్తరణతో పాటు.., ప్రధాన పైపులైన్ల నిర్మాణానికి రెండు ప్యాకేజీల్లో 57కోట్ల నిధులు మంజూరయ్యాయి. పనులు నత్తనడకను సాగుతున్నా...ఎవరూ పట్టించుకోవడం లేదు. దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే భారీ ప్రాజెక్ట్ పై నీలి నీడలు అలముకున్నాయి. అన్ని వార్డులను కలుపుతూ 60కిలోమీటర్ల మేరకు విస్తరణ పైపులైన్లు వేయాల్సి ఉంది. ఈ పనులను గుత్తేదారు గతేడాది నవంబరులో ప్రారంభించారు. 5.6కిలోమీటర్ల మేర మాత్రమే పైపులు వేశారంటే...., పనులు సాగుతున్న తీరును అర్ధం చేసుకోవచ్చు. నాగావళి నది నుంచి 5 కిలోమీటర్ల మేరకు ప్రధాన పైపులు వేయాల్సి ఉండగా.... ఆ పనులూ ప్రారంభంలోనే నిలిచిపోయాయి.

పాలకొండ ప్రజలకు తాగునీటి కోసం తిప్పలు తప్పటం లేదు. నాలుగు రక్షిత పథకాలున్నా ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందటం లేదు. ప్రస్తుత వేసవీలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు పథకాలు పురాతమైనవి. మరో రెండు తక్కువ పరిధికే పరిమితమైనందున అవస్థలు తప్పటం లేదు. కొత్తగా వేసిన పైపులైన్లు కాలువల్లో మురుగునీటిలోనే ఉన్నాయి. లీకుల వల్ల మురుగునీరు పైపులైన్లలోకి ప్రవేశించి తాగునీటి జలాలు కలుషితమవుతున్నాయి. ఆ నీటినే తాగి ప్రజలు తరుచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. తాగునీటి పైపులైన్ల విస్తరణ కోసం ప్రస్తుతం 4 వార్డుల్లో 20వీధుల్లో పైపులను, సిమెంట్ రహదారులను ఇష్టానుసారంగా తవ్వేశారు. దీంతో కాలనీల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


కేంద్ర ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన మంజూరు చేసిన తాగునీటి పైపులైన్ల విస్తరణ పనులు సకాలంలో పూర్తయ్యేలా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని పాలకొండ ప్రజలు కోరుతున్నారు.

పాలకొండలో నీటి కొరత చాలా సమస్యగా ఉంది. పైపులైన్లు వేస్తామని రోడ్లు తవ్వారు కానీ ఇంతవకరకు కనెక్షన్లు ఇవ్వలేదు. పైపులు వేశారు కానీ వాటికి నీటి కనెక్షన్లు ఇవ్వలేదు. దాని వల్ల ఈ వేసవి కాలంలో ప్రజలు ఇబ్బింది పడుతున్నారు. వాటర్ ట్యాంకు ఉన్నా కనెక్షన్లు ఇవ్వకపోవడంతో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. -గ్రామస్తుడు.

ఇక్కడ 200 ఇళ్లకి ఒకటే కుళాయి ఉంది. ఒక రోజు నీరు వస్తే మళ్లీ రెండు రోజులు రావు దీంతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఇక్కడ ఎవరూ పట్టించుకునే వారు లేరు. మేము ఎన్ని సార్లు పై అధికారులకు మా సమస్య పరిష్కరించాలని వినతులు ఇచ్చినా పరిష్కారం చేయటం లేదు.- గ్రామస్తులు

నీటి సమస్యతో అల్లాడుతున్న పాలకొండ ప్రజలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details