రైతు భరోసా కేంద్రాలను.. రైతు దగా కేంద్రాలుగా మార్చారు: ప్రత్తిపాటి పుల్లారావు TDP Leader Prathipati Pullarao Inspected the Damaged Crop: వర్షాలకు పంటలు దెబ్బతిని అన్నదాతలు అల్లాడుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రాంతంలో అమీనాహెబ్ పాలెం, గంగన్నపాలెం తదితర గ్రామాలలో దెబ్బతిన్న మిర్చి పంటను బుధవారం సాయంత్రం పరిశీలించి రైతులతో మాట్లాడారు.
అనంతరం చిలకలూరిపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంతవరకు ప్రభుత్వం పంట నష్టం అంచనాలను తయారు చేయకపోవడం బాధాకరమన్నారు. జిల్లా వ్యాప్తంగా 4 రోజులుగా కురిసిన వర్షాలకు మిర్చి, అరటి, మొక్కజొన్న, జామ, తమలపాకు తదితర పంటలు తీవ్రం దెబ్బతిన్నాయన్నారు. పంట నష్టం అంచనాలు తయారుచేయమని చెప్పిన సీఎం ఎకరాకు ఎంత నష్టపరిహారం ఇస్తారనేది ప్రకటించలేదన్నారు.
గతంలో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు అంచనాలు తయారుచేసి పరిహారం అందించ లేదన్నారు. జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో పంట వేస్తే 4 నెలల క్రితం పడిన అకాల వర్గాలకు లక్షా యాభై వేల ఎకరాల్లో పంట దెబ్బతిని పీకివేశారన్నారు. మిగిలిన మూడు లక్ష ఎకరాల్లో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నారు.
మిర్చి పంటకు ఎకరాకు రూ.2 లక్షలుకు పైగా పెట్టుబడి పెట్టి పంట చేతికి అందే సమయంలో అకాల వర్షాలతో పంట దెబ్బతిని రంగు మారి తాలుకాయలు ఏర్పడే.. పరిస్థితి నెలకొందన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వ వైఖరితో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో ఆగ్రస్థానంలో ఉందన్నారు. రైతు భరోసా కేంద్రాలు, రైతు దగా కేంద్రాలుగా తయారు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వాటి వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు.
సీఎం జగన్.. రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు తప్ప, కార్యాచరణలో ఎలాంటి పురోగతి కనిపించడంలేదన్నారు. తమ జేబులు నింపుకోవడానికి సమయం కేటాయిస్తున్న జగన్.. రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రస్తుతం పంట నష్టపోయిన 3 లక్షల ఎకరాల్లో.. ఎకరాకు రూ.50వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
దాంతోపాటు రాయితీపై విత్తనాలు కూడా అందజేయాలన్నారు. రైతులు విపత్కర పరిస్థితిల్లో ఉంటే ఆదుకుని అండగా నిలవాల్సిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోయారని విమర్శించారు. ఇప్పటికైనా రైతులకు పరిహారం చెల్లించి. ఆదుకోవాలని కోరారు.
"ముఖ్యమంత్రి పంట నష్టం అంచనాలను తయారుచేయమని చెప్పారు కానీ.. ఎకరాకు ఎంత ఇస్తారు అనేది ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కుబడిగా అంచనాలను తయారుచేసి వదిలేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే గతంలో కూడా మంత్రులు హడావుడిగా పర్యటించారు. ఎక్కడా నష్ట పరిహారం ఇవ్వలేదు. పంట నష్టం అంచనాలను కూడా తయారుచేయలేదు. చేతికి వచ్చిన పంట ఈ రోజు నీటిపాలు అవుతుంది. రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆత్మహత్యలే శరణ్యం అనే ఆవేదనలో ఉన్నారు. గత ప్రభుత్వంలో టార్ఫాలిన్ను ఇచ్చే వాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత.. ఏం ఇవ్వలేదు. అకాల వర్షాలకు పంట బూజు పట్టి పోతుంది. రైతులు పెద్ద ఎత్తున నష్ట పోయారు. ప్రభుత్వం స్పందించడం లేదు. దేశంలో ఆత్మహత్యలలో అగ్రస్థానంలో ఉన్నాం. ముఖ్యమంత్రి.. రైతు భరోసా కేంద్రాలు పెట్టి.. వాటిని దగా కేంద్రాలుగా తయారుచేశాడు. రైతులకి ప్రభుత్వం మీద నమ్మకం, విశ్వాసం పోయింది". - ప్రత్తిపాటి పుల్లారావు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఇవీ చదవండి: