ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Chandrababu: "ఎవరి హయాంలో ప్రజలకు న్యాయం జరిగిందో తేల్చుకుందాం".. వైసీపీ నేతలకు చంద్రబాబు సవాల్​

By

Published : Apr 26, 2023, 8:57 AM IST

Chandrababu Fires on YSRCP: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎవరి హయాంలో న్యాయం జరిగిందో, సంక్షేమం అమలైందో చర్చకు సిద్దమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పల్నాడు జిల్లా అమరావతిలో పర్యటించిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వివేకా హత్య, కోడికత్తితో దాడి వ్యవహారాల్ని ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ది పొందారని, ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తుంటే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అమరావతి సహా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని.. తెలుగుదేశం వస్తేనే మళ్లీ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు.

Chandrababu Fires on YSRCP
Chandrababu Fires on YSRCP

Chandrababu Fires on YSRCP:తెలుగుదేశం అధినేత చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన ఆరంభం అదిరింది. అమరావతిలో చంద్రబాబు పర్యటించగా.. జనం బ్రహ్మరధం పట్టారు. అమరావతి మండలంలోని వైకుంఠపురం వద్ద చంద్రబాబుకు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి వందలాది వాహనాలతో ర్యాలీగా అమరావతి చేరుకున్నారు. అమరావతి శివారులోని గోపాలపురం వద్ద బాబు రోడ్‌ షో ప్రారంభమైంది.

అప్పటికే అమరావతి పట్టణంలో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. మ్యూజియం రోడ్డు, అమరేశ్వరస్వామి ఆలయం, క్రోసూరు రోడ్డు, పోలీసు స్టేషన్ కూడలి మీదుగా చంద్రబాబు రోడ్‌ షో సాగింది. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అమరావతిని అంతం చేయడానికి ఓ రాక్షసుడు వచ్చాడన్న చంద్రబాబు.. రాజధానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు. ఎస్సీలకు ఎవరు న్యాయం చేశారో చర్చకు సిద్ధమని చంద్రబాబు సవాల్‌ విసిరారు.

"వాళ్లంటరూ.. నేను ఎస్సీలకు అన్యాయం చేశానని. ఖబడ్దార్​ జాగ్రత్తగా ఉండండి. ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. మొట్టమొదటిసారి ఒక ఎస్సీ మహేంద్రనాథ్​ని ఆర్థిక మంత్రిగా చేసిన పార్టీ టీడీపీ. ఒక ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్​గా చేసింది తెలుగుదేశం. బాలయోగిని తొలిసారిగా పార్లమెంట్​ స్పీకర్​గా చేసిన ఘనత టీడీపీది. ఐఏఎస్​ మాధవ్​రావును సీఎస్​గా చేసింది తెలుగుదేశం. ఇందులో ఏ ఒక్కటైనా నువ్వు చేశావా జగన్​.. ఇకమీదట చేయగలుగుతావా. నన్ను ఛాలెంజ్​ చేసిన వైసీపీ నాయకులకు నేను కూడా ఛాలెంజ్​ చేస్తున్నా. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి"-చంద్రబాబు, టీడీపీ అధినేత

రాష్ట్రంలో పేదలకు వైసీపీ ఏం ఒరగబెట్టిందని ఇంటింటికి స్టిక్కర్లు అంటిస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. నిత్యవసరాలు, పెట్రో ధరలు దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయన్నారు. చెత్త పన్ను, ఆస్తి పన్ను పెంచి జనం నడ్డివిరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి అలాంటి జగన్ ఫొటోను ఇంటికి ఎలా అంటిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

"ఏం చేశారని మీ ఇంటికి జగన్​ స్టిక్కర్లు వేశారు. మీ ఇంటి మీద ఆయన స్టిక్కర్​ ఏంటి. జగన్​ రెడ్డి ఇంటిపైన మీ స్టిక్కర్లు అతికిస్తే వాళ్లు ఊరుకుంటారా"-చంద్రబాబు, టీడీపీ అధినేత

చంద్రబాబు పర్యటనకు వైసీపీ శ్రేణులు ఆటంకాలు సృష్టించినా.. అధికారులు, పోలీసులు నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టినా.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తొలి రోజు పర్యటన విజయవంతం కావడం తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details