ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nara Bhuvaneshwari Birthday: నారా భువనేశ్వరి అందిస్తున్న సేవలు అనన్యం: మాజీ మంత్రి ప్రత్తిపాటి

By

Published : Jun 20, 2023, 2:16 PM IST

Nara Bhuvaneshwari Birthday Celebrations: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు వేడుకలను పల్నాడు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో కేకు కట్​చేసి సంబరాలు జరిపారు.

Nara Bhuvaneshwari Birthday Celebrations
Nara Bhuvaneshwari Birthday Celebrations

నారా భువనేశ్వరి అందిస్తున్న సేవలు అనన్యం

Nara Bhuvaneshwari Birthday Celebrations: సమాజానికి నారా భువనేశ్వరి అందిస్తున్న సేవలు అనన్యమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. భువనేశ్వరి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ప్రత్తిపాటి ఫౌండేషన్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించింది.

తొలుత పండరీపురంలోని తన నివాసం నందు టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ప్రత్తిపాటి భారీ కేకును కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం గడియార స్తంభం సెంటర్‌లోని ప్రత్తిపాటి ఫౌండేషన్ అన్న క్యాంటీన్‌లో ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిరుపేదలకు, వలస కార్మికులకు భోజన వసతి కల్పించారు. భువనేశ్వరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రత్తిపాటి శుభాకాంక్షలు తెలిపారు.

భువనేశ్వరి నేటి తరానికి మార్గదర్శి అని ప్రత్తిపాటి కొనియాడారు. పేద ప్రజల కోసం నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు, హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహిస్తూ ప్రజా సేవే పరమవధిగా సేవలు చేస్తూ మన్ననలు పొందుతున్నారని వివరించారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఎన్టీఆర్ ట్రస్టు ఉంటుందనే భరోసా కల్పించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్టీఆర్ హైస్కూల్‌లో ఎంతోమందికి ఉచిత విద్య అందిస్తూ భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని ప్రత్తిపాటి అన్నారు.

ఇన్ని దారుణాలు జరుగుతున్న ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు: విశాఖలో బాలికపై స్వామీజీ రెండు సంవత్సరాల నుంచి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. బాలికపై స్వామీజీ లైంగిక వేధింపులను ఖండించినట్లు తెలిపారు. మచిలీపట్నంలో జరిగిన ఘటన మరువకముందే.. విశాఖలో మరో ఘటన వెలుగుచూడటం దారుణమన్నారు. ఇంత జరిగినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఊరికో కాలకేయుడు తయారయ్యారని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మహిళలపై అఘాయిత్యాలు, దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారాలు, హత్యలకు నిలయంగా ఏపీని మార్చారని ధ్వజమెత్తారు. ఏపీ అంటే అరాచక, పైశాచిక పాలనకు చిరునామాగా మారిపోయిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదంలో ఉన్నాయని.. ధ్వజమెత్తారు. దోషులకు భయం లేకపోవడం వల్లే అరాచకాలకు పాల్పడుతున్నారని.. దోషులను కాపాడేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ప్రత్తిపాటి ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details