ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నిరూపించమంటే చేతులు ముడుచుకున్నారు..! ఆడపిల్ల మీదికి కాలు దువ్వే స్థాయికి దిగజారలేదు..!

By

Published : Feb 5, 2023, 7:41 AM IST

Nandyal political war : ఎన్నికలకు ఏడాది ముందే నంద్యాల వేడెక్కింది. తాము చేశామంటున్న దౌర్జన్యాలు, ఆరాచకాలను వైసీపీ ఎమ్మెల్యే ఆధారాలతో చూపాలంటూ మాజీమంత్రి భూమా అఖిల ప్రియ సవాల్ విసిరారు. ఏదేదో ఊహించుకుని ఛాలెంజ్ అంటే ఎలా.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం రా..! అని ఎమ్మెల్యే ప్రకటనతో నంద్యాల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరువురి నేతల ప్రకటనతో అప్రమత్తమైన పోలీసులు.. ఆళ్లగడ్డలో అఖిలను హౌస్ అరెస్ట్ చేసి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

political war
వేడెక్కిన నంద్యాల రాజకీయాలు

Nandyal political war : ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉండగానే సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ నేతలు వాతావరణం వేడెక్కిస్తున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాటల యుద్ధానికి దిగుతున్నారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి వ్యాఖ్యలకు మాజీమంత్రి భూమా అఖిలప్రియ జవాబివ్వడంతో పాటు ఆయన చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ ప్రతి సవాల్‌ విసరడం.. పోలీసులు ఆమెను గృహనిర్బంధించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, మాజీమంత్రి భూమా అఖిలప్రియ మధ్య సవాళ్లతో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. నాలుగు రోజుల క్రితం నంద్యాల మార్కెట్‌యార్డు పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో భూమా కుటుంబంపై ఎమ్మెల్యే రవిచంద్రకిషోర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. భూకబ్జాలు, ఆక్రమణలకు పాల్పడుతున్నారని.. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని అన్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన మాజీమంత్రి భూమా అఖిలప్రియ.. శిల్పా కుటుంబం మళ్లీ తెలుగుదేశం వైపు చూస్తోందని అందులో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నంద్యాలలో బైపాస్ రహదారి వెళ్లే మార్గాన్ని ముందుగానే నిర్ణయించి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిపి కేవలం రూ.5 లక్షలు చెల్లించి 50 ఎకరాలు రవిచంద్రకిషోర్‌రెడ్డి చేజిక్కించుకున్నారని అఖిలప్రియ ఆరోపించారు. అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైద్య కళాశాల పేరిట ఆర్ఏఆర్ఎస్ భూములను కేటాయించి తమ భూముల విలువను రూ.10 కోట్లకు పెంచుకున్నారన్నారు. తమ భూములను మాత్రం కమర్షియల్ జోన్‌లో ఉంచి... మిగిలినవి రెసిడెన్సియల్, రిక్రియేషన్‌ జోన్లలో ఉంచారని తెలిపారు. చాబోలుకుంట తవ్వి.. చెరువు చేస్తామంటూ బైపాస్‌ వద్ద ఎస్సీలకు చెందిన 7ఎకరాలు ఎపీ బ్రహ్మానందరెడ్డి పేరిట రాయించిన ఘనత శిల్పా కుటుంబానికే దక్కుతుందన్నారు. వీటిపై చర్చించేందుకు నంద్యాల గాంధీచౌక్‌ వద్ద బహిరంగ చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.

జగన్మోహన్ రెడ్డి.. జగన్మోహన్ రెడ్డి అని కొట్టుకుంటున్నారు.. అంత ప్రేమ మీ మీద ఉంటే మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు మీకు.. ఈ రోజు అళ్లగడ్డ ఎమ్మెల్యే, నంద్యాల ఎమ్మెల్యేకు మంచి అవకాశం ఇచ్చాం.. ఏదైనా ఉంటే నిరూపించమని.. ఇద్దరూ చేతులు ముడుచుకుని కూర్చున్నరు. మావి కమిట్మెంట్ రాజకీయాలు.. మీవి కమర్షియల్ రాజకీయాలు. - భూమా అఖిల ప్రియ, టీడీపీ నేత, మాజీ మంత్రి

ఆడపిల్ల మీదికి కాలు దువ్వే స్థాయికి ఇంకా నేను దిగజారలేదు. దిగజారను. దిగజారబోను. వాళ్లేదో పెద్ద, పెద్ద మాటలు మాట్లాడుకుని, ఏదేదో ఊహించుకుని ఛాలెంజ్ అంటే.. సంవత్సరన్నరలో ఎన్నికలు రాబోతున్నయి.. ఆరోజు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. ఎవరొస్తారో పోటీకి రండి. - శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే

భూమా అఖిలప్రియ వ్యాఖ్యలతో నంద్యాలలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రంగంలోకి దిగిన పోలీసులు శనివారం తెల్లవారుజామునే ఆళ్లగడ్డలోని అఖిలప్రియ ఇంటికి చేరుకున్నారు. ఆమెను బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధించారు. పోలీసులతో భూమా కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలు తరలిరావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అఖిలప్రియ హెచ్చరించారు. పోలీసులు గృహ నిర్బంధం చేయడంపై అఖిలప్రియ హైకోర్టును ఆశ్రయించారు.

వేడెక్కిన నంద్యాల రాజకీయాలు

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details