ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టీఎస్ఆర్టీసీలో వెయ్యి విద్యుత్ బస్సులు రయ్‌ రయ్‌

By

Published : Jan 12, 2023, 9:56 AM IST

TSRTC Electric bus : టీఎస్ఆర్టీసీకి 1,000 విద్యుత్​ బస్సులు రానున్నాయి. ఈ మేరకు త్వరలోనే గుత్తేదారులతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకోనుంది. వీటిలో హైదరాబాద్‌కు 500 బస్సులు కాగా .. మిగిలినవి ఇతర నగరాలకు నడపాలని అధికారులు నిర్ణయించారు.

E buses
E buses

TSRTC Electric bus: తెలంగాణ ఆర్టీసీకి వెయ్యి విద్యుత్తు బస్సులు రానున్నాయి. డీజిల్‌ వినియోగం, కాలుష్యాన్ని తగ్గించేందుకు బ్యాటరీ ఆధారిత విద్యుత్తు బస్సులకు కేంద్రప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న విషయం తెలిసిందే. తయారీదారుల మధ్య పోటీని పెంచేందుకు తొలిసారిగా దేశంలోని పలు సంస్థల నుంచి కేంద్రం టెండర్లు ఆహ్వానించింది. ఆయా రాష్ట్రాల అవసరాల మేరకు బస్సుల టెండర్లను ఖరారు చేసింది. తెలంగాణకు వెయ్యి బస్సులను సరఫరా చేసే కాంట్రాక్టు జేబీఎం గ్రూప్‌, అశోక్‌ లేలాండ్‌ సంస్థలకు దక్కింది.

ఆర్టీసీ ఆ రెండు సంస్థలతో త్వరలో ఒప్పందం చేసుకోనుంది. అధికారులు ఇచ్చే ప్రమాణాల మేరకు ఏడాది వ్యవధిలో వెయ్యి బస్సులను అందచేయాల్సిన బాధ్యత గుత్తేదారులదే. కేంద్రం నిర్ణయం మేరకు.. హైదరాబాద్‌లో నడిపే బస్సులకు కిలోమీటరుకు రూ. 55, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 40 చొప్పున గుత్తేదారు సంస్థలకు ఆర్టీసీ చెల్లించాలి. ఆర్టీసీ తరఫున బస్సులో కండక్టర్‌ మాత్రమే ఉంటారు. టికెట్ల విక్రయం, ఛార్జీల వసూళ్లు మినహా ఇతర విషయాలేవీ ఆర్టీసీకి సంబంధం ఉండదు. డ్రైవర్‌ జీతం సహా రోజువారీ నిర్వహణ, మరమ్మతుల వంటి వ్యవహారాలన్నీ గుత్తేదారు చూసుకోవాలి. రాబోయే వెయ్యి బస్సుల్లో 500 హైదరాబాద్‌లో, మిగిలిన 500 నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం తదితర నగరాల్లో నడపాలని అధికారులు నిర్ణయించారు.

ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు:ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో మాత్రమే 40 విద్యుత్తు బస్సులున్నాయి. మరో 300 బస్సులు అయిదారు నెలల కిందటే ఖరారైనప్పటికీ వ్యవహారం వివాదాస్పదం కావడంతో వాటి విషయంలో స్పష్టత లేదు. ఆర్టీసీలో 2019 తరువాత అదనంగా ఒక్క విద్యుత్తు బస్సు కూడా చేరలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మియాపూర్‌, కంటోన్మెంటు డిపోల్లో బ్యాటరీ ఛార్జింగ్‌ కేంద్రాలున్నాయి. హైదరాబాద్‌లో ప్రతి వంద బస్సులకు ఒకటి, మిగిలిన ప్రాంతాల్లో ప్రతి 50 బస్సులకు ఒకటి చొప్పున ఛార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details