ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కరోనాతో మానసికంగా కుంగుబాటుకు గురికావొద్దు'

By

Published : Aug 1, 2020, 9:16 PM IST

ప్రజల్లో కరోనా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మానసికంగా కుంగుబాటుకు గురిచేస్తోంది. చాలా మంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మానసిక జబ్బులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు దృఢంగా ఉండాలని... ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ నాగిరెడ్డి తెలిపారు. సమాజంలో అవగాహన సైతం పెరగాలని చెబుతున్న నాగిరెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి..

psychiatrist doctor nagireddy about depression during corona time
psychiatrist doctor nagireddy about depression during corona time

కరోనాతో మానసికంగా కుంగుబాటుకు గురికావొద్దు

ప్రశ్న : కరోనా అంటేనే ప్రజలు ఎందుకు భయపడుతున్నారు ?

జవాబు:కరోనా కంటే సీరియస్ వ్యాధులు ఇంతకు ముందూ వచ్చాయి. కరోనాకు వ్యాప్తి ఎక్కువగా ఉంది. కరోనాకు ఒకరి నుంచి ఒకరికి సక్రమించే లక్షణం ఉంది. అతి భయంకరమైన జబ్బు కాదు. ప్రపంచం అంతా ఒక్కసారిగా రావడం.. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండటం వల్ల ప్రజలకు కూడా సమస్య ఏంటనేది ఆర్ధం కావడం లేదు. మన భవిష్యత్‌ ఏమవుతుందనే ఆలోచనతో కరోనా పెద్ద సమస్యగా మారింది.

ప్రశ్న: కరోనా వచ్చిన తరువాత మానసిక రోగులు పెరిగారా? తగ్గారా?

జవాబు:కరోనా వచ్చాక రోగులు పెరిగారని కాదు. ఇంతకుముందు మానసిక సమస్యలతో వచ్చే వారు కూడా లాక్‌ డౌన్‌తో సరైన వైద్యం, మందులు అందక ఇబ్బందులు పడ్డారు. కరోనాతో వృద్ధులకు సీరియస్ అనే సమాచారంతో పెద్ద వయస్సు వారు భయంతో వస్తున్నారు. యువకులు మనకు ఇన్‌ఫెక్షన్‌ వస్తే ఇంట్లో వారికి వ్యాపిస్తామా అనే భయం ఉంది. కరోనా వ్యాధి వస్తుందనే భయం కంటే.. ఆర్థిక సమస్యలతోపాటు ఆందోళనతో డిప్రెషన్‌కు గురైనవారు ఎక్కువగా వస్తున్నారు.

ప్రశ్న : మీ దగ్గరకు వచ్చే రోగులు ఆర్థిక సమస్యలతో పాటే ఇంకా ఏమైనా సమస్యలు చెబుతున్నారు?

జవాబు: వ్యాధి వస్తుందనే భయం ఒకటి, వ్యాధి వస్తే ఆసుపత్రిలో చేర్చుకుంటారో లేదో, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స భరించగలనా? లేదా? అని కొంత మంది... వ్యాధి వస్తే వెలి వేస్తారేమోనని మానసికంగా ప్రజల్లో భయం ఎక్కువైంది. ప్రజల్లో స్టిగ్మా ఎక్కువైంది.

ప్రశ్న : ఏఏ వయస్సు వారు ఎక్కువగా వస్తున్నారు ?

జవాబు: చిన్న పిల్లలు ఏవ్వరు రావటం లేదు. ఎక్కువ మధ్య వయస్సు వారు, కొంత మంది పెద్ద వయస్సు వారు ఎక్కువగా వస్తున్నారు. యువతే ఎక్కువగా చికిత్స కోసం వస్తున్నారు.

ప్రశ్న : జబ్బు వచ్చి కోలుకున్న వారు, జబ్బు రాని వారు ఉంటారు. ఎలాంటి వారిని మీరు పరిశీలించారు?

జవాబు:వ్యాధి వచ్చి తగ్గినవారు ఇంతవరకు నలుగురు వచ్చారు. వ్యాధి వచ్చి వెళ్లిపోయిన వారు ధైర్యంగానే ఉన్నారు.. సమాజంలో వీరిని దూరం పెడుతుండటంతో కొంత బాధపడుతున్నారు. కరోనా రాని వారు మాత్రం వస్తే ప్రాణభయం, సాంఘిక బహిష్కరణ, ఆర్థిక భయం లాంటి మానసిక సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు.

ప్రశ్న : కరోనా అంటే మానసికంగా కుంగిపోయే వారికి ఏం చెబుతారు ?

జవాబు: కరోనా అంత భయంకరమైన వ్యాధి కాదు. కేవలం కొంత శాతం మాత్రమే తీవ్రంగా, ప్రాణంతకంగా మారుతుంది. ఎక్కువ మందికి వ్యాధి వచ్చి పోయేది కూడా తెలియదు. చాలామందికి చిన్నచిన్న లక్షణాలే వస్తున్నాయి. ఈ వ్యాధి గురించి అంత తీవ్రంగా భయపడాల్సిన అవసరం లేదు. కొద్ది జాగ్రత్తలు తీసుకుని ఎవరి పనులు వారు చేసుకోవచ్చు. కరోనాతో అంతమైపోయింది అనే మానసిక స్థితి నుంచి అందరూ బయటికి రావాలి.

ప్రశ్న : మానసిక స్థితి నుంచి బయటికి రావడానికి ఎలాంటి టిప్స్‌ చెబుతారు?

జవాబు:ఈ వ్యాధి గురించి తెలుసుకోవాలి. అందరికి సీరియస్ కాదు అనే విషయం, ఎటువంటి వారిని ఆసుపత్రుల్లో చేర్చాలి అనే విషయం కూడా తెలిసింది. మరణాల రేటు కూడా తగ్గింది. కొన్ని రోజులు పోతే వ్యాక్సిన్ కూడా రావచ్చు. ఇది జీవితాంతం ఉండేది కాదు.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నాం.

ప్రశ్న : ప్రధానంగా డిప్రెషన్‌కు గురి కావద్దంటున్నారు. రోగుల పట్ల పాటించాల్సిన విషయాలపై సమాజానికి ఎలాంటి విషయం చెబుతారు ?

జవాబు:ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ మెసేజ్‌లు ఇస్తున్నారు. ప్రజలు ముందుగా భయపడ్డారు. ప్యానిక్ క్రియేట్ అయింది. అటువంటి భయం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. వ్యాధి గురించి ఇంకా అవగాహన కల్పించాలి. ఇది ప్రాణాంతకమైంది కాదు, వ్యాధి పూర్తిగా వెళ్లిపోతుంది లాంటి మెసేజ్‌లు ఇవ్వాలి. మరణాల గురించి ప్రచారం తగ్గిస్తే బాగుంటుంది.

ఇదీ చదవండి:కరోనాతో మాజీ మంత్రి పి.మాణిక్యాలరావు కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details