ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్కూళ్ల విలీనంపై ఆగని ఆందోళనలు.. నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్​

By

Published : Jul 11, 2022, 5:31 PM IST

Updated : Jul 11, 2022, 6:11 PM IST

Parents Protest Against Schools Merge: పాఠశాలల విలీనంపై రాష్ట్రవ్యాప్తంగా.. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం.. తమ పిల్లల చదువుని దూరం చేసేలా ఉందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే ఊళ్లలోని పాఠశాలలకు.. ప్రతి రోజూ తమ పిల్లలని ఎలా పంపించాలని ప్రశ్నిస్తున్నారు.

schools
schools


Protest at Schools: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని.. పెద్ద పేట ప్రాథమిక పాఠశాల విలీనంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 46 మంది పిల్లలు.. 3,4,5 తరగతులు పెద్దపేట పాఠశాలలో చదువుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పుడు నరసన్నపేటలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తే.. వారి చదువు దెబ్బతింటుందని వాపోయారు. అంత దూరం చిన్న పిల్లలు ఎలా వెళ్లి వస్తారంటూ.. ప్రశ్నించారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.

స్కూళ్ల విలీనంపై ఆగని ఆందోళనలు

పాఠశాల విలీనాన్ని నిరసిస్తూ.. తిరుపతి కొర్రమీనుగుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కొర్రమీనుగుంట ప్రభుత్వ పాఠశాలోని.. 6,7,8 తరగతులను.. పద్మావతీపురం పాఠశాలలో విలీనం చేయొద్దని వేడుకున్నారు. అంత దూరం పాఠశాలకు వెళ్లాలంటే.. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో.. కలెక్టర్ కు వినతిపత్రం అందజేసి, సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు.

అనకాపల్లి జిల్లా రావికమతం మండలం మట్టావానిపాలెం యు.పి స్కూల్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన తెలిపారు. 6,7,8 తరగతులను రావికమతం జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు దూర భారం అవుతుందని తల్లిదండ్రులు వాపోయారు. పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి గ్రామ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళన దిగారు. కొనకంచి ఎంపీపీ పాఠశాలను.. జిల్లా పరిషత్ హైస్కూల్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకించారు. విలీన ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. సుమారు రూ.30 లక్షల నాడు-నేడు నిధులతో సుందరీకరించిన పాఠశాలను తీసివేయొద్దని.. నినాదాలు చేశారు. ఊరికి దూరంగా ఉన్న పాఠశాలకు చిన్నారులైన తమ పిల్లలను ఎలా పంపాలని తల్లిదండ్రులు వాపోయారు.

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదారులపల్లిలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాల ప్రధాన ద్వారానికి ముళ్లకంచెలు, తాళాలు వేసి పాఠశాల ముందు బైఠాయించారు. తమ పాఠశాలను బసాపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేయొద్దని నినాదాలు చేశారు. అధికారులు వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు తమ ఆందోళనను విరమించమని భీష్మించారు. 4 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలకు తమ పిల్లలను ఎలా పంపాలని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:


Last Updated :Jul 11, 2022, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details