ఆంధ్రప్రదేశ్

andhra pradesh

‘స్మార్ట్‌’గా భూ దందా.. నేతల భూములే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లకు..!

By

Published : May 19, 2022, 6:59 AM IST

Jagan Township: అధికార పార్టీ నేతలు మరో భూ దందాకు తెరతీశారు. నగరాలు, పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాలు సమకూర్చే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ (ఎంఐజీ లే అవుట్ల)కు తమ భూములే తీసుకునేలా పావులు కదుపుతున్నారు. తమ భూముల ధరను భారీగా పెంచి, వాటినే స్మార్ట్‌ టౌన్‌షిప్‌కు తీసుకునేలా చక్రం తిప్పుతున్నారు. గతంలో జగనన్న కాలనీకి భూసేకరణలో ఎకరాకు రూ.12 లక్షల ధర ఇస్తే.. ఇప్పుడు దానికి సమీపంలోనే ఎకరా ధర పది రెట్లు పెంచి, ఏకంగా రూ.1.20 కోట్ల చొప్పున ప్రభుత్వం నుంచి పరిహారం పొందేందుకు ప్రణాళికలు వేస్తుండటం గమనార్హం.

Jagan Township
ఇటీవల భూముల పరిశీలనకు వచ్చిన జేసీ మౌర్య

Jagan Township: అధికార పార్టీ నేతలు మరో భూ దందాకు తెరతీశారు. నగరాలు, పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాలు సమకూర్చే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ (ఎంఐజీ లే అవుట్ల)కు తమ భూములే తీసుకునేలా పావులు కదుపుతున్నారు. అక్కడున్న ధరకు నాలుగైదు రెట్లు రేటు పెంచి ప్రతిపాదనలు పంపారు. లేఅవుట్లకు భూసేకరణ, ప్లాట్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక ఇలా ప్రతిదశలో పారదర్శకతతో వ్యవహరిస్తామన్న ప్రభుత్వ ప్రకటనను అపహాస్యం చేస్తూ.. నంద్యాల జిల్లా నందికొట్కూరులో నేతలే స్థిరాస్తి వ్యాపారుల అవతారమెత్తారు. తమ భూముల ధరను భారీగా పెంచి, వాటినే స్మార్ట్‌ టౌన్‌షిప్‌కు తీసుకునేలా చక్రం తిప్పుతున్నారు. గతంలో జగనన్న కాలనీకి భూసేకరణలో ఎకరాకు రూ.12 లక్షల ధర ఇస్తే.. ఇప్పుడు దానికి సమీపంలోనే ఎకరా ధర పది రెట్లు పెంచి, ఏకంగా రూ.1.20 కోట్ల చొప్పున ప్రభుత్వం నుంచి పరిహారం పొందేందుకు ప్రణాళికలు వేస్తుండటం గమనార్హం.

నందికొట్కూరు పరిధిలో శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ సుధాకర్‌రెడ్డిలకు 45 ఎకరాల స్థలం ఉన్నట్లు సమాచారం. ఇందులో 137-ఏ సర్వే నంబరులో ఈ ఏడాది మార్చిలో 5.60 ఎకరాలు బైరెడ్డి తన తండ్రి మల్లికార్జునరెడ్డి పేరుతో కొనుగోలు చేశారు. సర్వే నంబరు 130 నుంచి 139 మధ్య మిగిలిన భూమిని 8 మంది రైతుల నుంచి కొని, అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఈ భూముల్లోని 13 ఎకరాలు అప్పటికే లేఅవుట్‌గా మార్చగా, ఎకరా రూ.33 లక్షల చొప్పున కొన్నట్లు సమాచారం. ఇలా తాము కొన్న 45 ఎకరాల్లో 40 ఎకరాలు ఒక్కోటి రూ.1.20 కోట్ల చొప్పున జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌కు ఇచ్చేందుకు అధికార పార్టీ నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. రూ.12 కోట్లు పెట్టుబడి పెట్టి ఏకంగా రూ.48 కోట్లు సంపాదించే ప్రణాళిక వేశారు.

నంద్యాలలోనూ ఇంత ధరలు లేవే!

45 ఎకరాల భూములు కొన్న నేతలు అక్కడ మున్సిపల్‌ కార్యాలయం వస్తే తమ భూమికి రేటు పెరుగుతుందని లెక్కలేశారు. తమ భూమిలో రెండెకరాలను నందికొట్కూరు మున్సిపల్‌ కార్యాలయ భవనానికి ఇస్తామని ఒప్పించారు. దీనికి దాతలు స్థలాలు ఇస్తామని ముందుకొచ్చినా అడ్డుకున్నారు. ఆ వెంటనే జగనన్న టౌన్‌షిప్‌ తెరపైకి రావడం, అందుకు 40 ఎకరాలు అవసరమవడంతో తమ భూములను ప్రతిపాదించారు. వీటిని నంద్యాల జేసీ, కుడా వైస్‌ఛైర్మన్‌ విడివిడిగా పరిశీలించారు. భూమి ధరలపై విస్మయం వ్యక్తం చేసిన ఉన్నతాధికారి.. నంద్యాలలోనే ఇంత ధరల్లేవే అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే నందికొట్కూరులో ఎకరా రూ.3 కోట్లు పలుకుతోందని, ప్రస్తుతం ప్రతిపాదించిన భూముల ధర తక్కువంటూ రెవెన్యూ, కుడా అధికారులు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలికారని.. మున్సిపల్‌ కార్యాలయమూ అక్కడే నిర్మించబోతున్నట్లు కమిషనర్‌ సైతం ఉన్నతాధికారులకు నచ్చజెప్పినట్లు సమాచారం.

కొనుగోలుదారులకు భారమే

నందికొట్కూరు మున్సిపాల్టీ పరిధిలో స్మార్ట్‌ టౌన్‌షిప్‌లో 3, 4, 5 సెంట్ల చొప్పున 500 ప్లాట్లు వేయాలన్నది ప్రణాళిక. ఇక్కడ ప్లాట్లు కొనడానికి 573 మంది ఆసక్తి చూపిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఎకరా రూ.1.20 కోట్లు పెట్టి కొంటే.. రోడ్లు, విద్యుత్‌, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలకు మరో రూ.30 లక్షలు ఖర్చవుతుంది. ఒక ఎకరాలో 4 సెంట్ల ప్లాట్లు 12 వరకు వేస్తారు. అంటే ఒక్కో ప్లాటు రూ.12 లక్షల పైగా పలుకుతుంది. నేతల జేబులు నింపుకోవడానికి పెంచిన ధర.. సొంతింటి కోసం కలగనే మధ్యతరగతి కొనుగోలుదారులపై మరింత భారం మోపుతోంది. దీనిపై మున్సిపల్‌ ఛైర్మన్‌ సుధాకర్‌రెడ్డిని వివరణ కోరగా.. మూడుచోట్ల స్థలాలు పరిశీలించామని, అందులో తక్కువ ధరలో ఎక్కువ విస్తీర్ణం ఉన్న డంపింగ్‌ యార్డు సమీప పొలాలను అధికారులకు చూపించామన్నారు. రైతులు ఎకరా రూ.1.20 కోట్లు అడిగారన్నారు. అదే ప్రతిపాదనలు పంపిస్తే, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

"ఎంపిక చేసిన భూముల్లో ప్లాట్లు వేస్తే అమ్మకాలు జరుగుతాయా? లేదా? అనే అవకాశాలను ‘కుడా’ అధికారులు పరిశీలించి అనుమతి ఇవ్వాలి. ప్రతిపాదిత భూములకు కిలోమీటరు పరిధిలో చదరపు అడుగు ఎంతకు అమ్మారో చూసి, దానిని బట్టి ధర నిర్ణయిస్తారు"

- నారపురెడ్డి మౌర్య, నంద్యాల జేసీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details