ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP BJP: చవితి పోరు.. నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు భాజపా పిలుపు

By

Published : Sep 7, 2021, 8:37 PM IST

Updated : Sep 8, 2021, 5:23 AM IST

bjp call for statewide protest
bjp call for statewide protest

20:33 September 07

bjp call for statewide protest

నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలకు భాజపా పిలుపునిచ్చింది. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతించాలనే డిమాండ్​తో  అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని తెలిపింది. తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వాలని మండల, జిల్లా నేతలకు సూచించింది. ఈ మేరకు నేతలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దిశానిర్దేశం చేశారు.  

చవితి వేడుకలపై వివాదమేంటి..?

రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలపై దుమారం రేగుతోంది. మిగతా పండగలకు అడ్డురాని కరోనా నిబంధనలు.. హిందువుల పండగైనా వినాయక చవితికే ఎందుకు వర్తిస్తుందో చెప్పాలని భాజపా డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై ఆదివారం కర్నూలులో భాజపా చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతక దారి తీసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. చవితి వేడుకలపై ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది. 

కొవిడ్​పై సీఎం సమీక్ష.. కీలక నిర్ణయం!

రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ గురువారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా వినాయక చవితి వేడుకలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో వినాయక మండపాలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాత్రిపూట అమలవుతున్న కర్ఫ్యూను మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించారు. చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ జాగ్రత్తలు తప్పవని స్పష్టం చేశారు. నిమజ్జన ఊరేగింపులూ వద్దు’ అని వైద్యాధికారులు చేసిన సిఫారసులపై సమీక్షించిన సీఎం..ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేయాలని అధికారులకు సూచించారు.

'రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించాలి. కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా పండగల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వినాయక విగ్రహాలను ఇళ్లలో పెట్టుకునేందుకే అనుమతులివ్వాలి. బహిరంగ స్థలాల్లో విగ్రహాలు వద్దు' - కొవిడ్ సమీక్షలో సీఎం జగన్మోహన్ రెడ్డి

ప్రభుత్వ నిర్ణయంపై భాజపా ఫైర్..

వినాయక చవితి ఉత్సవాలకు మాత్రమే కరోనా నిబంధనలు అమలు చేయటంపై భాజపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చవితికి పందిళ్లు వేసుకొని ఉత్సవాలు నిర్వహించుకునేందుకు అనుమతించాలన్న డిమాండ్​ ఆందోళనలకు దిగింది. ఆదివారం కర్నూలులోని రాజ్ విహార్ కూడలిలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో పోలీసులు, భాజపా కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. పార్టీ నేతలు సోము వీర్రాజు, సత్యకుమార్, విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టింది.

'హిందువుల పండుగలపైనే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు..?కొవిడ్‌ నిబంధనలతో వినాయకచవితి జరుపుకొనేందుకు అనుమతించాలి. బయటకొస్తే అరెస్ట్‌ చేస్తామని ఎలా అంటారు..?ఒక వర్గానికి సంబంధించే మీ ప్రభుత్వం ఉంటుందా? రాష్ట్రంలో సంక్షేమం పేరుతో అభివృద్ధిని పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నారు' - సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇందులో భాగంగానే ప్రభుత్వ తీరును ఖండిస్తూ రేపటి ధర్నా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది భాజపా రాష్ట్ర నాయకత్వం. ఎట్టిపరిస్థితుల్లో చవితి వేడుకలపై ఆంక్షలు విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. వెనక్కి తగ్గకపోతే ఆందోళనలను పెద్ద ఎత్తున చేపడుతామని హెచ్చరిస్తోంది.

ఇదీ చదవండి

Last Updated :Sep 8, 2021, 5:23 AM IST

ABOUT THE AUTHOR

...view details