ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MGNREGA: ‘ఉపాధి’ చెల్లింపులపై హైకోర్టుకు తప్పుడు సమాచారం'

By

Published : Jul 12, 2021, 10:39 AM IST

ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కేంద్రం, హైకోర్టు ఆదేశించినా..ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ. రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ సిమెంట్‌ రహదారులు, మురుగుకాల్వలు, వీధిలైట్లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణ పనులు చేశారని అన్నారు. వాళ్లకి బకాయిలు చెల్లించాలని కోరారు.ఉపాధి బిల్లులకు సంబంధించి పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ దాఖలు చేసిన కేసులపై ఈ నెల 15వ తేదీన విచారణ జరగనుంది

yvb rajendraprasad  outraged on government
ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ. రాజేంద్రప్రసాద్‌

ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కేంద్రం, హైకోర్టు ఆదేశించినా.. వాటికి తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేస్తూ బకాయిలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ. రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు. కక్ష సాధింపులో భాగంగానే సీఎం జగన్‌, పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత రెండున్నర సంవత్సరాలుగా విజిలెన్స్‌ విచారణ పేరుతో బిల్లులు చెల్లించకుండా పనులు చేసిన ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని 173 నియోజకవర్గాల్లో బిల్లులు ఆపి సీఎం నియోజకవర్గమైన పులివెందుల, మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గమైన పుంగనూరులో మాత్రమే ఎందుకు చెల్లించారో చెప్పాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ‘2018-19 ఏడాదికి సంబంధించి ఉపాధి బిల్లుల బకాయిలు రూ.2,500 కోట్ల మేర ప్రభుత్వం చెల్లించాలి.

గత ప్రభుత్వంలో ఈ పనులు చేసిన ప్రజాప్రతినిధుల్లో 80% మంది బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారే. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ సిమెంట్‌ రహదారులు, మురుగుకాల్వలు, వీధిలైట్లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణ పనులు చేశారు. రెండు సంవత్సరాల క్రితమే ఈ బిల్లులు చెల్లించమని కేంద్రం రూ.1,845 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేసింది. ఈ మొత్తంతో పాటు రాష్ట్రం తన వాటా రూ.655 కోట్లు కలిపి దారి మళ్లించి సొంత పథకాలకు వినియోగించుకుంది. ఇది చట్ట వ్యతిరేకం. రూ.5 లక్షలలోపు పనులు చేసిన 7.27 లక్షల మందికి సుమారు రూ.1300 కోట్లు చెల్లిస్తామని.. గతేడాది హైకోర్టుకు హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఇవ్వకపోవడం కోర్టును సైతం మోసం చేయడమే.

ఉపాధి బిల్లులకు సంబంధించి పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ దాఖలు చేసిన కేసులపై ఈ నెల 15వ తేదీన విచారణ జరగనుంది. వచ్చే తీర్పు ఆధారంగా బిల్లులు చెల్లించకపోతే దీనిపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం. చేసిన పనులకు బిల్లులు రాక, తెచ్చిన అప్పులకు అధిక వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి’ అని కోరారు.


ఇదీ చూడండి.nominated posts: రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవుల భర్తీ...

ABOUT THE AUTHOR

...view details