ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తవ్వకాలను అడ్డుకున్నందుకు.. పోలీస్​ సిబ్బందిపై వైకాపా నాయకుల దాడి

By

Published : Jun 10, 2022, 9:40 AM IST

YSRCP leaders attack

YSRCP leaders attack: పమిడిముక్కలలోని చెరువులో మట్టి తవ్వకాలను అడ్డుకున్నందుకు రెవెన్యూ సిబ్బంది, పోలీసులపై వైకాపా నాయకులు దాడి చేశారు. దాడికి పాల్పడివారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా పామర్రు నియోజకవర్గ బాధ్యుడు వర్ల కుమారరాజా డిమాండ్‌ చేశారు.

YSRCP leaders attack: చెరువులో మట్టి తవ్వకాలను నిలిపేసేందుకు వెళ్లిన రెవెన్యూ ఇన్‌స్పెక్టరు, పోలీసు కానిస్టేబుళ్లపై వైకాపా నాయకులు దాడి చేసిన సంఘటన కృష్ణా జిల్లా పమిడిముక్కలలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఆర్‌ఐ శ్రీనివాస్‌ పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు.. మేడూరు శివారు జువ్వలపాలెం చెరువులో మేడూరు సర్పంచి భర్త గొర్కిపూడి బుజ్జి ఆధ్వర్యంలో మట్టిని అనధికారికంగా తవ్వి తరలిస్తున్నారు.

సమాచారం అందుకున్న ఆర్‌ఐ శ్రీనివాస్‌, వీఆర్వోలు.. ఇద్దరు కానిస్టేబుళ్ల భద్రతతో చెరువు వద్దకు వెళ్లారు. వారిని బుజ్జి, పమిడిముక్కలవాసి మారపాక మహేష్‌ మరికొందరు చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. దీన్ని వీడియో తీస్తున్న కానిస్టేబుల్‌ బాలకృష్ణను మారపాక మహేష్‌ నెట్టాడు. ఆయన కిందపడిపోగా మహేష్‌ కర్రతో తలపై కొట్టాడు. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాస్‌ సిబ్బందితో అక్కడికి చేరుకొని బాధితుడిని ఉయ్యూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడున్న జేసీబీ, మరో ట్రాక్టరును సీజ్‌ చేసినట్లు ఆర్‌ఐ తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు. బుజ్జి పరారీలో ఉన్నాడని, మిగిలిన నలుగురికి కోర్టు రిమాండు విధించిందని తెలిపారు.

నిందితులను గుర్తించాలి:పోలీసు, రెవెన్యూ సిబ్బందిపై వైకాపా దాడి విచారకరమని, అసలు దోషులను గుర్తించాల్సిన అవసరం ఉందని తెదేపా పామర్రు నియోజకవర్గ బాధ్యుడు వర్ల కుమారరాజా డిమాండ్‌ చేశారు. పమిడిముక్కల తహశీల్దారు కార్యాలయంలో బాధితుడు, ఆర్‌ఐ శ్రీనివాస్‌ను ఆయన పరామర్శించారు. అనంతరం ఇసుక, మట్టి దోపిడీకి అలవాటుపడిన ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌, ఆయన సోదరుడు జగదీష్‌ తమ అనుచరులకు చెరువుల్లో మట్టి తవ్వుకోమని, ఎవరన్నా అడ్డువస్తే తామున్నామని చెబుతున్నారని అన్నారు. అనిల్‌కుమార్‌, జగదీష్‌లపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details