ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Problems of sorghum farmers : నల్లగా మారిన తెల్లజొన్న... గన్నవరం రైతుల గుండెల్లో గుబులు..!

By

Published : May 10, 2023, 12:37 PM IST

Problems of sorghum farmers : ఆరుగాలం పండించిన పంటను కొనేవారు కరవయ్యారని తెల్ల జొన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారంలో కురిసిన అకాల వర్షానికి ఉత్పత్తులు నల్లగా మారడంతో వాటిని ఆరబెట్టేందుకు కర్షకులు అష్టకష్టాలు పడుతున్నారు. గన్నవరం పరిసర ప్రాంతాల్లో జొన్న సాగుదారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు.

తెల్లజొన్న రైతులు
తెల్లజొన్న రైతులు

Problems of sorghum farmers : తెల్ల జొన్న రైతుల ఆశలు ఆవిరయ్యాయి. గన్నవరం మండలంలోని సావరగూడెం, పురుషోత్తపట్నం, ముస్తాబాద్, సూరంపల్లి గ్రామాల్లో సుమారు 400 ఎకరాల్లో దాళ్వాగా జొన్న పంట సాగు చేశారు. అకాల వర్షానికి పంట తడిసి పోవడంతో పాటు కంకులు నల్లగా మారాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దాళ్వాలకు ఆయా గ్రామ ఊరు చెరువులో నీటిని పంటలకు అందించేందుకు మోటార్ల అయ్యే ఖర్చు, పురుగు మందులు, ఇతర వ్యయాలతో కలిపి ఎకరాకు సుమారు రూ.20 నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి అయిందని రైతులు తెలిపారు.

దక్కని గిట్టుబాటు ధర.. అసలే పెట్టుబడి భారంతో ఆవేదన చెందుతున్న రైతులకు ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం మరింత కలవరానికి గురిచేస్తోంది. రెండేళ్ల క్రితం క్వింటా జొన్న రూ.2200 ఉండగా గతేడాది రూ.1700 మధ్య వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ ధర కూడా దక్కేటట్లు కనిపించడం లేదు. ఓ వైపు పెట్టుబడి భారం.. మరో వైపు చెరువుల నుంచి నీటి తడులకు అదనపు ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. కౌలు, పెట్టుబడితో కలిసి రూ.20 వేలతో జొన్న పంటను సాగుచేస్తే చివరకు అప్పే మిగులుతోందంటూ కర్షకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మార్కెట్‌ యార్డుల ద్వారా జొన్నలను క్వింటా రూ.2500 చొప్పున కొనుగోలు చేసి రైతులకు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

నేను 8 ఎకరాల్లో తెల్ల జొన్న సాగు చేశాను అకాల వర్షాల వల్ల పంట బాగా పాడైపోయింది. పంటను కొనేందుకు దళారులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ముందుకు వచ్చి పంటను కొనాలని కోరుతున్నాను. - జవహర్‌లాల్, జొన్న రైతు

నేను 10 ఎకరాల్లో జొన్న సాగు చేశాను. ఎకరానికి 25వేల పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు పంటను కొనేవాళ్లు లేరు. పంట నల్ల బడింది. పంటను అమ్ముకునే మార్గం కనిపించడం లేదు. ప్రభుత్వమే పంటను కొని సాయం చేయాలి - రాచమళ్ల సాంబశివరావు, సావరగూడెం

తెల్ల జొన్న 5 ఎకరాల్లో వేశాను. వర్షాలు పడడం వల్ల పంట నష్టం జరిగింది. ప్రభుత్వం మద్దతు ధర కల్పించి ఆదుకోవాలి. - కరేటి శివరామకృష్ణ, రైతు

ఆందోళనలో జొన్న రైతులు...గన్నవరం పరిసర ప్రాంతాల్లో సుమారు 500 ఎకరాల్లో దాల్వాగా జొన్నను స్థానిక రైతులు సాగు చేస్తుంటారు. గత వారంలో కురిసిన అకాల వర్షానికి పంటను కొని నాథుడే కరువయ్యారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తడిసిన పంటను ఆరబెట్టేందుకు కర్షకులు పడుతున్న అవస్థలు అన్నీ కావు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details