ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kishan Reddy: కేంద్ర మంత్రి అయినా సంతోషంగా లేదు.. కిషన్ రెడ్డి భావోద్వేగం!

By

Published : Aug 21, 2021, 7:03 PM IST

తాను కేంద్రమంత్రిగా దిల్లీలో ఎంతటి స్థాయిలో ఉన్నా.. అంబర్​పేటకు తాను బిడ్డనేనని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర హైదరాబాద్​లోని అంబర్​పేటకు చేరుకుంది. అంబర్​పేటకు చేరగానే రోజుల తరువాత బిడ్డ తల్లి దగ్గరికి వచ్చినట్లు ఉందని కిషన్​ రెడ్డి అన్నారు.

Kishan Reddy
Kishan Reddy

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

"అంబర్​పేటకు వస్తే చాలా రోజుల తరువాత బిడ్డ.. తల్లి దగ్గరికి వచ్చినట్లు ఉంది" అని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. తాను దిల్లీలో ఉన్నానంటే కారణం అంబర్​పేట, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలే అని చెప్పారు. భాజపా జన ఆశీర్వాద యాత్రలో భాగంగా.. ఆయన చేస్తున్న పర్యటన.. హైదరాబాద్​లోని అంబర్​పేటకు చేరుకుంది. అంబర్ పేట ప్రజలు తన ప్రాణమని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురై.. కిషన్ రెడ్డి కంటతడి పెట్టారు. కేంద్ర మంత్రి అయినందుకు పూర్తిగా సంతోషంగా లేదని.. అంబర్​పేటకు దూరమయ్యానన్న బాధే ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. అంబర్​పేట బిడ్డగా అందరూ గర్వపడేలా పని చేస్తానని స్పష్టం చేశారు.

రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో ఈ అంబర్​పేట బిడ్డ కృషి కూడా ఉందన్నారు. గోల్కొండ కోటను అభివృద్ధి చేస్తానని తెలిపారు. అంబర్​పేట ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని.. పార్టీ, అంబర్​పేట తనకు రెండు కళ్లతో సమానమని కిషన్​ రెడ్డి చెప్పారు. కేసీఆర్ పరిపాలన పక్కన పెట్టి ఫామ్ హౌస్, ప్రగతి భవన్​లో పడుకుంటున్నారని విమర్శించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. కేసీఆర్ నియంత పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో భాజపాను ఆశీర్వదించాలని కోరారు.

'అంబర్​ పేట ప్రజలు నా ప్రాణం. ఈ రోజు నేను దిల్లీలో ఉన్నానంటే దానికి అంబర్​పేట, సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ ప్రజలే కారణం. మీరు నాకు అందించిన ప్రేమ, అప్యాయత ఎన్నటికీ మరిచిపోలేను. చివరి శ్వాస వరకు అంబర్​పేట ప్రజలను మర్చిపోలేను. ప్రతి రోజు బస్తీల్లో తిరుగుతున్నప్పుడు చిన్నాపెద్ద, అక్కలు, చెల్లెల్లు, మాతృమూర్తులు స్వాగతం పలికే వారు.'

-కిషన్​ రెడ్డి, కేంద్ర మంత్రి

గతంలో అంబర్ పేట నుంచే ఎమ్మెల్యేగా..

కిషన్ రెడ్డి.. గతంలో అంబర్ పేట ఎమ్మెల్యేగా వరుసగా విజయాలు సాధించారు. ఆ నియోజకవర్గంతో.. అక్కడి ప్రజలతో ఆప్యాయమైన సంబంధాలు కొనసాగించారు. అయితే.. 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో అంబర్ పేట నుంచే అనూహ్య ఓటమి పాలైన ఆయన.. ఆ తర్వాత 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం కేంద్రమంత్రి అయ్యారు. తాజాగా.. అంబర్ పేటలో భాజపా జన ఆశీర్వాద యాత్ర చేపట్టిన కిషన్ రెడ్డి.. నియోజకవర్గంతో తనకున్న సంబంధాన్ని గుర్తు చేసుకుని.. భావోద్వేగానికి గురయ్యారు.

ఇదీ చదవండి:

అఫ్గానిస్థాన్‌లో ఆంధ్రుల కోసం.. విజ‌య‌వాడ‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్!

ABOUT THE AUTHOR

...view details