ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'స్టాలిన్​ను చూసైనా రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను తెరవండి'

By

Published : May 10, 2021, 8:00 PM IST

అన్న క్యాంటీన్లు పునరుద్ధరించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

anna canteens
సోమిరెడ్డి

తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్​ను చూసైనా.. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు పునరుద్ధరించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు ప్రారంభించారని గుర్తు చేశారు. తాజాగా డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పార్టీ కార్యకర్తలు కొన్ని చోట్ల అమ్మక్యాంటీన్లు ధ్వంసం చేశారని అన్నారు.

దాడులకు పాల్పడిన సొంత పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టించి అమ్మ క్యాంటీన్లు కొనసాగుతాయని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారని తెలిపారు. రాష్ట్రంలో రూ.5కే మూడు పూటలా పేదలకు భోజనం పెట్టేందుకు 386 అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రారంభిస్తే.. వైకాపా అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి నిలుపుదల చేయించారని మండిపడ్డారు. ఎన్టీఆర్, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించిన పథకాలను తర్వాతి ముఖ్యమంత్రులు కొనసాగించారని గుర్తు చేశారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమన్వయంతో వ్యవహరించాలి

జగన్ కూడా కక్షసాధింపులు మాని… పేరు మార్చుకోనైనా సరే అన్న క్యాంటీన్లు తెరవాలని డిమాండ్ చేశారు. చంద్రన్న బీమా పథకం నిలిపివేయటం వల్ల గత రెండేళ్లలో వివిధ కారణాలతో చనిపోయిన వారి కుటుంబాలకు ఎలాంటి బీమా అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ మరణాలను దృష్టిలో పెట్టుకుని చంద్రన్న బీమా లబ్ధి రూ.2 లక్షలు ఏదో రూపేణా మృతుల కుటుంబాలకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని… రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరాపైనా దృష్టి సారించాలని కోరారు. తెలుగువారెవరైనా హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు ఆంక్షలు లేకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.

ఇదీ చూడండి:

కొవిడ్ రోగులను తెలంగాణా పోలీసులు అడ్డుకోవడం సరికాదు: భాజపా

ABOUT THE AUTHOR

...view details