Nandamuri Tarakaratna health update : నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వైద్య సేవలు కొనసాగుతున్నాయి. గత నెల 27న గుండెపోటుకు గురైన తారకరత్నను బెంగళూరుకు తరలించి ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స అందిస్తున్నారు. గుండెపోటుకు గురైన సమయంలో 40 నిమిషాల వరకు మెదడుకు రక్తం సరఫరా కాకపోవడంతో మెదడులో వాపు ఏర్పడింది. మెదడుకు సంబంధించిన నిమ్హాన్స్ వైద్యులతో పాటు.. విదేశాల నుంచి వచ్చిన వైద్య నిపుణులు చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని.. గుండె, కాలేయంతో పాటూ ఇతర అవయవాలన్నీ బాగున్నాయని.. మెదడుకు సంబంధించిన చికిత్సలు చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
అకస్మాత్తుగా సొమ్మసిల్లి...టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర తొలిరోజు జనవరి 27న కొద్ది దూరం నడిచిన తారకరత్న.. అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు, యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది.. కుప్పంలోని కేసీ ఆస్పత్రికి కారులో తరలించారు. స్థానికంగా అత్యవసర చికిత్స చేశాక పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రికి పంపించారు.
బాలకృష్ణ నిరంతర పర్యవేక్షణ...తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న చంద్రబాబునాయుడు, బాలకృష్ణ హుటాహుటిన ఆస్పత్రికి తరలి వచ్చారు. టీడీపీకి చెందిన మంత్రులు సైతం ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులను సంప్రదించారు. అప్పటికప్పుడు ఎయిర్ అంబులెన్స్‌లో తరలించాలనే నిర్ణయం మేరకు.. ఏర్పాట్ల విషయమై కర్నాటక ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడారు. కాగా, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు అక్కడి వైద్యులు అత్యాధునిక వైద్య పరికరాలతో కుప్పం చేరుకున్నారు. చివరికి బెంగళూరు తరలించాలనే నిర్ణయానికి రాగా, తారకరత్న సతీమణి నిర్ణయం అనంతరం ఏర్పాట్లు చేశారు.