ఆంధ్రప్రదేశ్

andhra pradesh

rains : రాష్ట్రంలో వర్షాలు.. రాకపోకలకు అంతరాయం

By

Published : Jul 15, 2021, 10:35 AM IST

రాష్ట్రంలో కొన్నిప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు(rains) కురిశాయి. పలు చోట్ల రోడ్లమీదకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కొన్ని కాలనీలోకి నీరు చేరింది. ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

rains in ap
రాష్ట్రంలో వర్షాలు

రాష్ట్రంలో వర్షాలు

రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. కొన్ని కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది. ఎగువున కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ముంపు ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో

‍తిరుమలలో 4 గంటల పాటు ఏకధాటిగా వాన పడింది. రహదారులు జలమయమయ్యాయి. ఆలయానికి వెళ్లేందుకు భక్తులు, అర్చకులు ఇబ్బందులు పడ్డారు. కొండపై చలి తీవ్రత పెరిగింది. తాజా వర్షాలతో జలాశయాల్లోకి భారీగా వరద చేరిందని అధికారులు తెలిపారు.

కడప జిల్లాలో

అల్పపీడన ప్రభావం వల్ల కడపలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఆకాశమంత నల్లటి మేఘాలు కమ్ముకుని ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో నగరం మొత్తం తడిసి ముద్దయింది. కడపలోనూ ఎడతెరిపి లేని వర్షానికి రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచాయి. డ్రెయినేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. బస్టాండ్ రోడ్డు, అంబేద్కర్ కూడలి, అప్సర రోడ్డు, ఎన్జీవో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. మురికి కాలువలు పొంగి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై నీళ్లు చేరడంతో..వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నెల్లూరు జిల్లాలో

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. స్వల్ప గాలులు వీచాయి. నెల్లూరు నగరంలో రాత్రి 8 గంటల నుంచి వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. గాంధీబొమ్మ, వహాబ్‌పేట, మూలాపేట, సంతపేట, నీలగిరి సంఘం తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. కాలువలు పూడికతో నిండిపోవడంతో మురుగు రోడ్లపై ప్రవహించి.. వాహనదారులు, ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు.


విజయనగరం జిల్లాలో

విజయనగరం జిల్లా మండలంలోని పెద్దగెడ్డ జలాశయం జలకళను సంతరించుకుంది. ఏజెన్సీ ప్రాంతంలో ఇటీవల కురుస్తున్న వర్షాలతో నీరు చేరి నిండుకుండలా దర్శినమిస్తోంది. గరిష్ఠ నీటిమట్టం 213.8 మీ.లు కాగా ప్రస్తుతం 211.06 మీ. మేర నీళ్లు చేరాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో

అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో పశ్చిమగోదావరి జిల్లాలో డెల్టా ప్రాంతంలో మైనర్‌, మీడియం డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి. ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు తదితర మండలాల్లోని పల్లపు ప్రాంతాల్లో మురుగు బయటకు వెళ్లే పరిస్థితులు కన్పించడం లేదు. ప్రధానంగా రుద్రాయకోడు, బొండాడ, మొగదిండి, చినకాపవరం, యండగండి, జల్లి కాకికాడ, చిలుకూరు, పొలిమేర కోడు తదితర డ్రెయిన్లలో ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. ఉండి మండలంలో ఉప్పులూరు, కోలమూరు, ఆరేడు, పాందువ్వ, పాందువ్వ కండ్రిక, యండగండి, ఉప్పులూరు, పాములపర్రు, పెదపుల్లేరు తదితర గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లో లేత నారుమళ్లు ముంపులో చిక్కాయి. 15-20 రోజుల వయసున్న నారుమళ్లలో నీటిని బయటకు తోడిన వెంటనే ఆకు వాలిపోతోందని రైతులు వాపోతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో

గోదావరి నదిపై పోలవరం ఎగువ కాఫర్‌ డ్యాం కారణంగా వెనుక భాగంలో వరద ముంపు గ్రామాలను ఆందోళనకు గురిచేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం వద్ద పోశమ్మగండి వద్ద అమ్మవారి ఆలయంతో పాటు 40 ఇళ్లలోకి వరద చేరింది. కె.వీరవరం గ్రామాన్ని వరద నీరు క్రమంగా చుట్టుముట్టడంతో గిరిజనులు కొండలపైకి వెళ్తున్నారు.

ఇదీ చూడండి.తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. హైదరాబాదులో జనజీవనం అస్తవ్యస్తం

ABOUT THE AUTHOR

...view details