ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దివికేగిన నవరస నటనా సార్వభౌముడు.. సంతాపం తెలిపిన రాజకీయ ప్రముఖులు

By

Published : Dec 23, 2022, 8:56 PM IST

Updated : Dec 23, 2022, 9:30 PM IST

Politicians Condolence to Kaikala: నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణకు రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు. ప్రధాని, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు సహా.. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు దివంగత నటుడి మృతికి సంతాపం తెలిపి, కుటుంబసభ్యులను ఓదార్చారు. అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Kaikala Satyanarayana
సత్యనారాయణ

సత్యనారాయణకు రాజకీయ ప్రముఖులు నివాళి

తెలుగు సినీపరిశ్రమ మరో దిగ్గజ నటుడ్ని కోల్పోయింది. నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న 87 ఏళ్ల కైకాల.. ఈ తెల్లవారుజామున.. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గంభీరమైన ఆహార్యం, హాస్య చతురత కలగలిసిన నటనతో... కైకాల సత్యనారాయణ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. తెలుగుదేశం పార్టీ తరపున మచిలీపట్నం ఎంపీగానూ పని చేసి ప్రజలకు సేవ చేశారు.

కైకాల సత్యనారాయణ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. కైకాల సత్యనారాయణ మృతి పట్ల.. ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. విభిన్న పాత్రలతో సినీ ప్రేక్షకులను అలరించారని పేర్కొన్నారు. కైకాల సత్యనారాయణ భౌతికకాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు నివాళులు అర్పించారు. కైకాల సత్యనారాయణ అంతిమ సంస్కారాలను హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో రేపు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. తెలుగు చలనచిత్రరంగం గొప్ప నటుడిని కోల్పోయిందని ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ విచారం వెలిబుచ్చారు. కైకాల కుటుంబ సభ్యులకు సీఎం జగన్ సానుభూతి తెలిపారు. తెలుగు చిత్రపరిశ్రమలో కైకాలది ప్రత్యేక స్థానమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలుగుదేశం మాజీ ఎంపీ సత్యనారాయణ మరణం విచారకరమని.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు, లోకేశ్ సంతాపం తెలిపారు. విలక్షణ నటనతో విభిన్న పాత్రలకు జీవం పోసిన కైకాల మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. కైకాల.. ఆహార్యం, అభినయం, ఆంగికాల కలబోత అని నందమూరి బాలకృష్ణ అన్నారు. కైకాల మృతిసినీ రంగానికి తీరని విషాదమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. విజయవాడ వేదికగా జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభ కైకాల మృతిపట్ల సంతాపం తెలిపింది. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడుతోపాటు.. సభికులంతా లేచి నిలుచుని సంతాపం ప్రకటించారు.

కైకాల సత్యనారాయణ మృతితో... ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి ఆయన చేసిన సేవలను స్థానికులు గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ నిధులతోపాటు సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేశారన్నారు. కైకాల ఆరోగ్యం కుదుటపడి అంత బాగుందనుకున్న సమయంలో ఇలా జగడం తమను కలచివేసిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. కైకాల మరణ సమాచారం అందుకున్న బంధువులు హుటాహుటిన హైదరాబాద్ తరలి వెళ్లారు. చిన్ననాటి మిత్రులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని, అనుభూతుల్ని గుర్తు చేసుకుంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 23, 2022, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details