ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి త్వరగా భూమి సేకరించాలి'

By

Published : Jan 21, 2021, 7:17 PM IST

మచిలీపట్నం పోర్టు వ్యవహారంపై మంత్రి పేర్ని నాని సమీక్ష నిర్వహించారు. పోర్టు నిర్మాణానికి వేగంగా భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోర్టు మాస్టర్‌ప్లాన్‌ త్వరగా వచ్చేలా చూడాలని సూచించారు. మారిటైం బోర్డు ఆదేశాల మేరకు 3,400 ఎకరాలు అవసరమని.. తొలిదశలో 1,428 ఎకరాల భూసేకరణ పూర్తి చేసినట్లు తెలిపారు.

minister perni nani review on machilipatnam port building
minister perni nani review on machilipatnam port building

కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులను రవాణశాఖ మంత్రి పేర్ని నాని ఆదేశించారు. విజయవాడలోని కలెక్టర్​ క్యాంపు కార్యాలయంలో ముడా పనితీరుపై మంత్రి సమీక్షించారు. జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్‌, సంయుక్త కలెక్టరు మాధవీలత, ముడా వైస్‌ ఛైర్మన్‌ నారాయణరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ మారిటైం బోర్డు ఆదేశాల మేరకు మూడు దశల్లో పోర్టు నిర్మాణానికి కావాల్సిన 3,400 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని మంత్రి తెలిపారు. తొలిదశలో 2,350 ఎకరాల భూసేకరణ లక్ష్యం కాగా... 1,428 ఎకరాల భూమిని సేకరించారని చెప్పారు.

అలాగే 922 ఎకరాల భూమిని ఇంకా ముడాకి అప్పజెప్పాల్సి ఉందని మంత్రి అన్నారు. అందులో 533 ఎకరాల భూమి సేకరణ కోసం రూ.133 కోట్ల అవసరం అవుతాయని అధికారులు మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి పేర్ని నాని.. మంగినపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రజలకు నచ్చజెప్పాలని కోరారు. ఇదివరకే సేకరించి పోర్టుకు ఇచ్చిన 1,730 ఎకరాల ప్రభుత్వ భూమిలో అనుభవదారుని పేరు పొందుపరచలేదని మంత్రి పేర్కొన్నారు.

పోర్టుకు సంబంధించి రాయల్‌ కన్సల్టెన్సీ ద్వారా త్వరగా మాస్టర్‌ప్లాన్‌ వచ్చేలా చూడాలని మంత్రి.. అధికారులను ఆదేశించారు. వెబ్‌ల్యాండ్‌లో పట్టాదారుల వివరాలు సరిచేసుకోవాలని అన్నారు. ముడా కార్యాలయ నిర్వహణపై కఠినంగా వ్యవహరించాలని వీసీకి స్పష్టం చేశారు. అవసరం లేని సిబ్బందిని తిరిగి వారి కార్యాలయాలకు పంపాలని.. అవసరం మేరకు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని వినియోగించుకోవాలని చెప్పారు.

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌

TAGGED:

ABOUT THE AUTHOR

...view details