Minister Appalaraju on Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీపై పట్టు సాధించేందుకే నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని, దానివల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని మంత్రి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మాట్లాడిన ఆయన.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అప్పట్లో జగన్ పాదయాత్ర చేశారని.. లోకేశ్ మాత్రం అధికార కాంక్షతోనే పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు.
అనుమతివ్వకుండా నాన్చుడు ధోరణి : వాస్తవానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన మహాపాదయాత్ర అనుమతుల విషయంలో ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబించింది. పాదయాత్రలో ఎంత మంది పాల్గొంటారో.. ఎన్ని వాహనాలు ఉంటాయో వివరాలు కోరుతూ డీజీపీ లేఖ రాయగా.. సమాధానాల్లేని ప్రశ్నలంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. పోలీసులు రాజకీయం చేయడం తగదని ఆ పార్టీ నాయకులు యనమల, వర్ల సహా ప్రతి ఒక్కరు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఖరిపై అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో పాదయాత్రకు ముందుగా అధికార వైసీపీ నాయకులు నోటికి పని చెప్తున్నారు.
PERMISSION TO LOKESH PADAYATRA: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ "యువగళం" పాదయాత్రపై ఉత్కంఠ వీడింది. గత కొన్ని రోజుల నుంచి పాదయాత్రపై సందిగ్ధత నెలకొన్న సమయంలో.. దానికి తెరదించుతూ నేడు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు లోకేశ్ కుప్పం నుంచి ప్రారంభించనున్న పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పాదయాత్రలో ప్రజలు, వాహనదారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగించొద్దని ఎస్పీ సూచించారు. ‘‘పాదయాత్ర, కుప్పంలో బహిరంగ సభకు అనుమతి కోరుతూ పలమనేరు ఎస్డీపీవో సుధాకర్‌రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు పీఏ మనోహర్ వినతిపత్రం అందించారు. దీనిపై అన్ని అంశాలను పరిశీలించి పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశాం. అనుమతి ఇవ్వకముందే కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో కక్ష సాధింపు అంటూ ప్రభుత్వంపై నిందలు మోపి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అన్ని రకాలుగా పరిశీలించి అనుమతి ఇచ్చాం.
బహిరంగ సభల సమయాలకు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించకూడదు. రోడ్లపై ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులను నిర్వహించేందుకు సమావేశ స్థలంలో ప్రథమ చికిత్స, వైద్య పరికరాలతో అంబులెన్స్‌లను ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంచాలి.