ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రహదారుల ప్రాజెక్టును గాలికొదిలేసిన సర్కారు - రుణాలు ఆపేస్తామని కేంద్రం, ఎన్డీబీ హెచ్చరిక

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 8:00 AM IST

Updated : Dec 23, 2023, 10:15 AM IST

YSRCP Government Neglects NDB Road Projects: పెట్టుబడుల రాకకు ప్రజల రాకపోకలకు రహదారులు కీలకం వైఎస్సార్​సీపీ గద్దెనెక్కాక రాష్ట్ర రోడ్లపై స్థానికుల నుంచి ప్రముఖల వరకు అందరూ విమర్శలు చేస్తున్నారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్‌ రుణం అందించినా కేంద్రం సహకరించినా ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకోలేకపోతోంది. ఇలాగైతే రుణం ఆపేస్తామని కేంద్రం, ఎన్డీబీ హెచ్చరించినా జగన్‌ సర్కారులో చలనం కలిపించడంలేదు. అధికారులు, గుత్తేదారులు ఎంత గగ్గోలుపెట్టినా పాలకులు నిద్ర నటిస్తుండటం అభివృద్ధికి అవరోధంగా మారింది.

ndb_road_projects.
ndb_road_projects.

రహదారుల ప్రాజెక్టును గాలికొదిలేసిన సర్కారు - రుణాలు ఆపేస్తామని కేంద్రం, ఎన్డీబీ హెచ్చరిక

YSRCP Government Neglects NDB Road Projects:ఒప్పందం ప్రకారం ఏదీ అమలు చేయడం లేదు అడ్వాన్స్‌గా ఇచ్చిన మొత్తంలో ఇంకా కొంత ప్రభుత్వం వద్దే ఉంది! రెండున్నరేళ్లలో ప్రాజెక్టు అమలు తీరు తీవ్ర నిరుత్సాహకరంగా ఉంది. ఈ ప్రాజెక్టు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళిక లేదు ఇలాగైతే ఆర్థిక సాయం కొనసాగించలేం రుణ ఖాతాలు మూసేసేందుకు చర్యలు తీసుకుంటాం ఇదీ రాష్ట్రంలో రహదారుల విస్తరణ ప్రాజెక్టు తీరుపై ఎన్డీబీ, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు జులైలో చేసిన తీవ్ర హెచ్చరిక. ఏ ప్రభుత్వమైనా రహదారుల విస్తరణకు ప్రాధాన్యమిచ్చి మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే ప్రయత్నం చేస్తుంటుంది. అందుకు రుణాలు తీసుకొనే సౌలభ్యాన్ని వినియోగించుకుంటుంది.

కానీ జగన్‌ ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా అసలు రాష్ట్రంలోని రోడ్లను విస్తరించడమే ఇష్టం లేనట్లు వ్యవహరిస్తోంది. బ్యాంకు రుణ అడ్వాన్స్‌గా ఇచ్చిన మొత్తాన్ని కూడా గుత్తేదారులకు పూర్తిగా చెల్లించకపోగా రాష్ట్ర ప్రభుత్వ వాటాలో ఒక్క రూపాయీ విడుదల చేయని ఘనత వైసీపీ సర్కారుకే దక్కుతుంది. గుత్తేదారులతో ఒప్పందం జరిగి ఇప్పటికి 33 నెలలు కాగా రాష్ట్రమంతా కలిపి సగటున 31 శాతం పనులు మాత్రమే జరిగాయంటే ఈ ప్రాజెక్టు పురోగతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని జిల్లాల్లో అయితే కేవలం 10 నుంచి 15 శాతంలోపే పనులు జరగడం విస్మయానికి గురిచేస్తోంది.

వంద అడుగుల కల్వర్టు కట్టలేని సీఎం పోలవరాన్ని ఎలా పూర్తి చేస్తారు : జనసేన

రాష్ట్ర వాటాలో వైఎస్సార్​సీపీ నిర్లక్ష్యం:ఎన్డీబీ రుణంతో మండల కేంద్రాలతో పాటు వాటి నుంచి జిల్లా కేంద్రాలకు అనుసంధానంగా ఉండే సింగిల్‌ రహదారులను రెండు వరసలుగా విస్తరించే ప్రాజెక్టు 2019లో రాష్ట్రానికి మంజూరైంది. ఇందులో భాగంగా 6 వేల 400 కోట్ల రూపాయలతో 2 వేల 514 కిలోమీటర్ల మేర రోడ్లను రెండు దశల్లో విస్తరించడం వంతెనల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. తొలి విడతలో 18 వందల 87 కోట్లతో 12 వందల 44 కిలోమీటర్ల మేర 119 రోడ్లను విస్తరించేలా 2021లో గుత్తేదారులకు పనులు అప్పగించారు. ఒక్కో ఉమ్మడి జిల్లా ఓ ప్యాకేజీగా పనులు మొదలవ్వగా వైసీపీ సర్కారు తీరుతో అడుగు ముందుకు పడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 30 శాతం చెల్లించాల్సి ఉండగా ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది.

రాష్ట్ర ప్రభుత్వ తీరుని మొదట్లోనే గమనించిన ఎన్డీబీ, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ప్రాజెక్టు అమలుకు సంబంధించి అనేక నిబంధనలు విధించింది. ఈ నిధుల కోసం ప్రత్యేకంగా బ్యాంక్‌ ఖాతా తెరవడంతో పాటు బ్యాంక్‌ రుణ వాటా సొమ్ము విడుదల చేశాక వారంలోగా వాటిని ప్రత్యేక ఖాతాకు మళ్లించాలని స్పష్టం చేసింది. రాష్ట్ర వాటా 30 శాతం కూడా అందులో జమ చేసి పనులను వినియోగించాలని ఆదేశించింది. తొలుత వాటన్నింటికీ తలూపిన ప్రభుత్వం నిధులు విడుదలయ్యాక మాత్రం విస్మరించింది. గతేడాది జులైలో బ్యాంకు 230 కోట్ల రూపాయలు విడుదల చేయగా వాటిని ప్రత్యేక ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేయకుండా ప్రభుత్వం వద్దే ఉంచేసుకుంది. అందులోంచి పలు దఫాలుగా ఇప్పటివరకు గుత్తేదారులకు 215 కోట్లు చెల్లించింది. బ్యాంకు రుణ వాటాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 70 కోట్ల రూపాయలు జత చేయాల్సి ఉన్నా రూపాయి కూడా కేటాయించలేదు.

హడావుడి చేశారు, అర్ధాంతరంగా ఆపేశారు - నిత్యం నరకం చూస్తున్నామంటున్న రైతులు

రుణాలు ఆపేస్తామని హెచ్చరిక:కొద్ది నెలల కిందట ఎన్డీబీ రుణంతో అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రాజెక్టులపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ, ఎన్డీబీ అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో ప్రాజెక్టు అమలుపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి ప్రాజెక్టుకు రుణాన్ని ఆపేస్తామని హెచ్చరించారు. అయినా జగన్‌ సర్కారులో ఎటువంటి స్పందనా లేదు. తమ వాటా నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి కేంద్రానికి లేఖ పంపితేనే ఈ ప్రాజెక్టు ముందుకెళ్లే అవకాశం ఉంది. కానీ, ఆ దిశగా పాలకులు ప్రయత్నాలు సాగించిన దాఖలాలు కనిపించడం లేదు.

ప్రాజెక్టు పనుల కోసం 2021 మార్చిలో గుత్తేదారులు ఒప్పందం చేసుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో, అంచనాలు సవరించాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు. దాంతో రాష్ట్ర ఖజానాపై సుమారు 100 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది. ప్రాజెక్టు మొదటి దశలోనే ఇంత ఘోర వైఫల్యం చెందడంతో ఇక రెండో దశ కింద 12 వందల 68 కిలోమీటర్ల మేర జరగాల్సిన విస్తరణ పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఎన్టీఆర్​ జిల్లాలో ప్రమాదకరంగా కాజ్​వే - ఎప్పుడు, ఏం జరుగుతుందోనని ప్రయాణికుల ఆందోళన

పెండింగ్​ బకాయలు:జగన్‌ సర్కారు తీరుతో అన్ని జిల్లాల్లో గుత్తేదారులు పనులను ఆపేశారు. ఇప్పటివరకు చేసిన పనులకు సంబంధించిన 80 కోట్ల మేర బిల్లులను సీఎఫ్​ఎంఎస్​లో అప్‌లోడ్‌ చేసి, చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నారు. మరో 130 కోట్ల రూపాయల మేర బిల్లులు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది.

  • అనంతపురం జిల్లాలో అయిదు రోడ్లు విస్తరించాల్సి ఉండగా కనీసం ఒక కిలోమీటర్‌ పని కూడా జరగలేదు.
  • కర్నూలు జిల్లాలో 12 రోడ్లకుగాను ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహించే డోన్‌ నియోజకవర్గ పరిధిలోని ఒక రోడ్డు పని మాత్రమే కొంత మేరకు చేశారు.
  • ప్రకాశం జిల్లాకు సంబంధించిన పనులను చిత్తూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే దక్కించుకున్నారు. బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో విసుగుచెందిన ఆయన ఒప్పందం నుంచి వైదొలుగుతానంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇతర నేతలు పార్టీ పెద్దలతో మాట్లాడించి, ఎలాగోలా శాంతింపజేశారు.
Last Updated : Dec 23, 2023, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details