ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలి: ఆర్​.నారాయణ మూర్తి

By

Published : Jan 27, 2021, 10:54 AM IST

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు అథోగతి పడుతుందని ప్రముఖ నటుడు ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఒక దేశం ఒకే చట్టంతో దళారీ వ్యవస్థ మరింత పెరుగుతుందని చెప్పారు. వీటిని రద్దు చేసి పంటకు కనీస మద్దతు ధర కల్పించే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

r narayana murthy
r narayana murthy

మీడియాతో ఆర్​.నారాయణ మూర్తి

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి స్వామినాథన్‌ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలని ప్రముఖ నటుడు ఆర్‌.నారాయణమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా వినుకొండలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇప్పటికే దేశంలో వ్యవసాయం తగ్గిపోయిందని, కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలతో.. సాగు అథోగతి పడుతుందని నారాయణ మూర్తి అన్నారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న మార్కెట్‌ యార్డులు సహా అన్నింటినీ తొలగించడం భావ్యం కాదని చెప్పారు. ఒక దేశం ఒకే చట్టంతో దళారీ వ్యవస్థ మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విధానం వల్ల ఆహార భద్రతను కోల్పోయే ప్రమాదం ఉందని, కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే ప్రమాదం సైతం ఉందని అంచనా వేశారు. వ్యవసాయ రంగాన్ని కేంద్రం గుప్పిట్లో ఉంచుకుంటే రైతు జీవితాలకు భద్రత ఉండదన్నారు. వాటిని వ్యతిరేకించాల్సిన రాష్ట్రాలు కేంద్రానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. భావితరాల కోసం ప్రస్తుత పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి పంటకు కనీస మద్దతు ధర కల్పించే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని నారాయణ మూర్తి డిమాండ్‌ చేశారు. అన్ని పార్టీలు కలిసి మెలిసి ఉద్యమాన్ని ముందుకు నడపాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details