ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మలక్ పేటలో బాలింతల మృతికి కారణమదే.. ఆపరేషన్ థియేటర్ మూసివేత

By

Published : Jan 17, 2023, 4:46 PM IST

తెలంగాణలోని హైదరాబాద్ మలక్​పేట ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు బాలింతల మృతిపై వైద్యశాఖ ఉన్నతాధికారులు విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో అపరిశుభ్రత వల్ల వచ్చిన బ్యాక్టీరియల్ ఇన్​ఫెక్షన్​ బాలింతల మృతికి కారణమని తేలింది.

Malakpet area hospital incident
ఆస్పత్రిలో అపరిశుభ్రత వల్ల ఇద్దరు బాలింతలు మృతి... ఆపరేషన్ థియేటర్ మూసివేత

తెలంగాణలోని హైదరాబాద్ మలక్​పేట ఏరియా ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ మూసివేశారు. ఈ దవాఖానాలో ప్రసవాలు, ఆపరేషన్లు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ హాస్పిటల్​కు వచ్చే గర్భిణీలను కోఠి, పేట్లబుర్జు ఆస్పత్రులకు తరలించారు. ఇటీవల ప్రసవం కోసం వచ్చిన ఇద్దరు బాలింతలు మరణించిన ఘటన తెలిసిందే. వైద్యుల నిర్లక్ష్యం వల్లే వారు మరణించారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. ఈ ఘటనపై వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదికలో.. ఆస్పత్రిలో అపరిశుభ్రత వల్ల వచ్చిన బ్యాక్టీరియల్ ఇన్​ఫెక్షన్​ వల్లే ఇద్దరు బాలింతలు మృతి చెందారని తేలింది. ఈ క్రమంలోనే వైద్యశాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

ఇదీ జరిగింది..:తెలంగాణలోనిమలక్‌పేట ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన ఇద్దరు బాలింతలు ఇటీవల మృత్యువాత పడటం.. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే వారు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ నిరసనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లికి చెందిన సిరివెన్నెలను ఇటీవల కాన్పు కోసం మలక్‌పేట ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి కాన్పు చేశారు.

Malakpet area hospital incident :ప్రసవం తర్వాత సిరివెన్నెల తీవ్ర అస్వస్థతకు గురైంది. గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జగదీశ్‌.. తన భార్య శివానిని కాన్పు కోసం మలక్‌పేట ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాబుకు జన్మనిచ్చిన తర్వాత శివాని ఆరోగ్య పరిస్థితి విషమించింది. గాంధీకి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఒకేసారి ఇద్దరు బాలింతలు మృతిచెందడంతో.. మలక్‌పేట ఆసుపత్రి వద్ద రోదనలు మిన్నంటాయి.

ఆస్పత్రి వద్ద రోదనలు.. ఒక్కరోజు వ్యవధిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడంతో.. కుటుంబీకులు, బాధితుల కోపం కట్టలు తెంచుకుంది. వైద్యులు సకాలంలో సేవలందించడంలో నిర్లక్ష్యం చూపడం వల్లే మృతి చెందారంటూ మలక్‌పేట ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. పేదలకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన సర్కార్‌ దవాఖానాల్లో.. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు.

విచారణకు కమిటీ.. ఈ ఘటనపై వైద్యశాఖ ఉన్నతాధికారులు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ గత కొన్నిరోజులుగా ఈ కమిటీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే బాలింతలిద్దరు.. ఆస్పత్రిలోని అపరిశుభ్రత వల్ల కలిగిన బ్యాక్టీరియల్ ఇన్​ఫెక్షన్ వల్ల చనిపోయారని తేలడంతో అధికారులు ఆ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లు మూసివేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details