ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'జగన్​ మామయ్యా మాకు వద్దు ఈ ఉడకని, రుచిలేని భోజనం' - మధ్యాహ్న భోజనం అమలు దారుణం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 6:37 PM IST

Low Quality Midday Meals in Andhra Pradesh: బడి పిల్లలకు మేనమామనంటూ ఊదరగొడతారు. ఒకే తిండితో బోర్‌ కొట్టిన వాళ్ల కోసం రోజుకో మెనూ తెచ్చామని డప్పు కొట్టుకుంటారు. ఇంటి భోజనం ఎంత శుచిగా ఉంటుందో స్కూళ్లలోనూ అంతే నాణ్యంగా ఉండాలని లెక్చర్లు దంచుతూనే ఉంటారు. గుడ్డు, రాగిజావ, చిక్కీలతో పోషక విలువలు పెంచేస్తున్నామంటూ ఇచ్చే బిల్డప్‌ మామూలుగా ఉండదు.

low_quality_midday_meals
low_quality_midday_meals

జగన్​ మామయ్య వద్దు మాకీ ఉడకని రుచిలేని భోజనం

Low Quality Midday Meals in Andhra Pradesh: ముఖ్యమంత్రి జగన్​ మాటలకు వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం. మేనమామలా చూసుకోవడం సంగతి దేవుడెరుగు, రుచిగా పిడికెడు మెతుకులు పెడితే చాలని పిల్లలు అంటున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు ఎంత దారుణంగా ఉందో ఈటీవీ భారత్​ - ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలో బట్టబయలైంది.

సీఎం జగన్‌ మాటలు కోటలు దాటినా.. చేతలు మాత్రం గడప దాటని పరిస్థితి. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన భోజనం పెడుతున్నట్లు ప్రతి సభ, సమీక్షలోనూ సీఎం ఊదరగొడుతున్నా, క్షేత్రస్థాయి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటోంది. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని మధ్యాహ్న భోజనంపై గతేడాది స్థానిక కోర్టులో ఫిర్యాదు చేసింది.

జావలా అన్నం.. నీళ్లలా సాంబారు

జగన్​ మామ ఉడకని అన్నం, కూరగాయలు తినెదేలా: నాసిరకమైన భోజనం తినలేకపోతున్నామని ఆ చిన్నారి వాపోయిందంటే, పరిస్థితి ఎంత తీసికట్టుగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. మధ్యాహ్న భోజనం రుచిశుచి లేకుండా చేస్తున్నరడానికి అచ్చమైన ఉదాహరణ ఈ నెల 14న జరిగిన శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం మణూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ఘటన. ఉడకని అన్నం, కుళ్ళిన కాయలతో కూరలు వడ్డిస్తే తినేది ఎలాగంటూ, పెట్టిన భోజనం పెట్టినట్లే పిల్లలంతా పారబోశారు.

మధ్యహ్న భోజనం తిని ఆసుపత్రుల పాలు: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కోన ప్రాథమిక పాఠశాలలో ఫిబ్రవరి 8న మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పలావు, కుర్మా, గుడ్లు తిన్న కాసేపటికే కడుపునొప్పితో విద్యార్థులు బెంచీలపై పడిపోయారు. గతేడాది నవంబర్‌ 26న ఏలూరు జిల్లా పెదవేగి మండలం కూచింపూడి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలు.

విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించడం ఎలా ?

ఇంటి నుంచి బాక్సులు: స్కూల్లో పెట్టే మధ్యాహ్న భోజనం తినేందుకు చాలామంది ఇష్టపడటం లేదు. మెనూలో మార్పులు చేశామని సీఎం గొప్పలు చెబుతున్నా, పిల్లలు మాత్రం ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకుంటున్నారు. మొత్తంగా 30శాతానికిపైగా విద్యార్థులు సొంత భోజనం వైపే మొగ్గు చూపుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఉన్నత పాఠశాల, కాకినాడ సాలిపేట బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నారు.

పిల్లల హాజరుతోపాటే భోజనం తినేవారి సంఖ్యనూ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. అయితే ఈ లెక్కలన్నీ బోగస్‌ అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే భోజనం చేసేవారి సంఖ్య తగ్గితే వివరణ కోరతారనే భయంతో కచ్చితమైన సమాచారం నమోదు చేయడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 90శాతం మంది విద్యార్థులు భోంచేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నా క్షేత్రస్థాయిలో 75 శాతం లోపే ఉంటోంది.

Mid day meal workers protest at collectorate: భవన నిర్మాణ, మధ్యాహ్న భోజన కార్మికుల నిరసనలతో దద్దరిల్లిన కలెక్టరేట్​

రాగి జావ మాకు నచ్చడం లేదు మామయ్య: చిత్తూరు సంతపేట నగరపాలక ఉన్నత పాఠశాలలో 585మంది విద్యార్థులు ఉండగా ప్రతిరోజూ సరాసరిన 400 మందికి మాత్రమే వంట చేస్తున్నారు. తినేవారి సంఖ్య అంతకంటే తక్కువే ఉంటోంది. ఉదయం స్కూలుకు రాగానే అందిస్తున్న రాగిజావ కూడా అత్యధికులు తాగడం లేదు. రుచిగా లేకపోవడం, ఉండలు వస్తుండటంతో కొంచెం తాగి, మిగతాది ఒలకబోస్తున్నారు.

బోరు నీళ్లు ఇస్తున్నారు మామయ్య : విద్యార్థులకు శుద్ధజలం అందించేందుకు అంటూ ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్లు చాలాచోట్ల పనిచేయడం లేదు. కొన్ని నెలలకే చెడిపోయినా మరమ్మతులు చేయించే దిక్కులేక ఎక్కడిక్కడ మూలన పడ్డాయి. కొన్నిచోట్ల మినరల్‌ వాటర్‌ తెప్పించి, క్యాన్లలో పోసి విద్యార్థులకు అందిస్తుండగా మరికొన్నిచోట్ల బోరు నీళ్లను ట్యాంకుల్లో పట్టి పిల్లలకు ఇస్తున్నారు.

పాఠశాలల్లో బోరు నీళ్లు తాగలేక విద్యార్థులు ఇళ్ల నుంచే వాటర్‌ బాటిళ్లు తెచ్చుకుంటున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఉన్నత పాఠశాల, చిత్తూరు సంతపేట నగరపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ట్యాంకుల్లో నీటిని నేరుగా పట్టుకుని తాగుతున్నారు.

అరకొరగా వసతులు - మధ్యాహ్న భోజనం చేయడానికి చోటు లేక ఇక్కట్లు

మధ్యాహ్న భోజన ఛార్జీలను పెంచాలని డిమాండ్​: నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. అందుకు అనుగుణంగా మధ్యాహ్న భోజన ఛార్జీలను ప్రభుత్వం పెంచడం లేదు. ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 5.88 రూపాయల చొప్పున, ఆరు నుంచి పదో తరగతి పిల్లలకు 8.57 రూపాయల చొప్పున ఇస్తున్నాయి. ప్రస్తుత మెనూ ప్రకారం ఒక్కో విద్యార్థి భోజనానికి 10 రూపాయలు ఇవ్వాలన్న వంట ఏజెన్సీల డిమాండ్‌ పాలకుల చెవికెక్కడం లేదు.

కేవలం గ్లాసులతోనే పూర్తి రాగి జావ ఇస్తున్నామని ప్రచారం : రాగిజావ కాసి ఇచ్చేందుకైతే కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఉచితంగా చేసివ్వాలని వంట కార్మికులపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. సత్యసాయి ట్రస్టు బెల్లం, రాగిపిండి ఉచితంగా ఇస్తుంటే ప్రభుత్వం కేవలం గ్లాసులు ఇస్తూ భారీ ప్రచారం చేసుకుంటోంది. విశాఖతోపాటు కొన్ని గ్రామాలకు అక్షయపాత్ర సంస్థ మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్న భోజనం రుచి, నిర్వహణ అంతంతమాత్రమే అన్నది జాతీయ పోషణ్‌ అభియాన్‌ సలహాదారు భూపేంద్ర మాట. ఆహార పదార్థాలు బాగోలేక పిల్లలు తినడానికి ఇష్టపడటం లేదని ఆయన అన్నారు. 100శాతం పిల్లలు రోజూ భోజనం తినేలా చర్యలు చేపట్టాలని విశాఖలోని మింది స్కూల్లో గతేడాది అక్టోబర్ 28న తనిఖీలు చేసినప్పుడు చెప్పారు.

భోజనంలో పురుగులు, మూడురోజులుగా తాగునీరు లేదు - విద్యార్థినుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details