ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పొగాకు ఉత్పత్తులు 'ఆహారం' కిందకి రావు.. స్పష్టం చేసిన హైకోర్టు

By

Published : Mar 25, 2023, 8:37 AM IST

High Court Comments in Gutka Case: ఆహార భద్రతా ప్రమాణాల చట్టం - 2006 ప్రకారం గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులు.. 'ఆహారం' అనే నిర్వచనం కిందకి రావని హైకోర్టు తేల్చిచెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఆహార భద్రత కమిషనర్‌కు పొగాకు ఉత్పత్తుల విషయంలో జోక్యం చేసుకునే అధికారం ఉండదని స్పష్టం చేసింది.

హైకోర్టు
High Court

High Court Comments in Gutka Case: గుట్కా, పాన్ మసాలా లాంటి పొగాకు ఉత్పత్తుల తయారీ, విక్రయదారులకు హైకోర్టులో ఊరట లభించింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ చట్టం - 2006 ప్రకారం గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులు 'ఆహారం' అనే నిర్వచనం కిందికి రావని తేల్చిచెప్పింది.

ఈ నేపథ్యంలో ఏపీ ఆహార భద్రత కమిషనర్​కు గుట్కా, పాన్ మసాలా పొగాకు ఉత్పత్తుల విషయంలో జోక్యం చేసుకునే అధికారం ఉండదని స్పష్టం చేసింది. ఆ వ్యాపారాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్ ఇచ్చే అధికారం కమిషనర్లకు ఉండదని తేల్చిచెప్పింది. పొగాకు ఉత్పత్తుల విషయంలో పిటిషనర్లు చట్టబద్ధంగా నిర్వహిస్తున్న రోజువారీ వ్యాపార కార్యకలాపాల్లో అధికారుల జోక్యం చేసుకోవడానికి వీల్లేదంది.

ఏపీ ఆహార భద్రత కమిషనర్.. 2021 డిసెంబర్ 6న జారీచేసిన నోటిఫికేషన్ ఆధారంగా పొగాకు ఉత్పత్తులను సీజ్ చేసి ఉంటే వాటిని తక్షణం విడుదల చేయాలని పేర్కొంది. లైసెన్సు తీసుకొని వ్యాపారం నిర్వహిస్తున్న పిటిషనర్ల వ్యవహారంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఈమేరకు తీర్పు ఇచ్చింది. గుట్కా, పాన్ మసాలా, ఖైనీ తదితర సాగాకు ఉత్పత్తుల తయారీ, రవాణా, విక్రయాలను నిలువరిస్తూ ఆహార భద్రత రాష్ట్ర కమిషనర్ 2020 జనవరి 8, 2021 డిసెంబర్ 6న జారీచేసిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ వ్యాపార సంస్థల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు.

పొగాకు ఉత్పత్తులను నిలువరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. సిగరెట్, పొగాకు ఇతర ఉత్పత్తుల చట్టం - 2003 ప్రకారం పర్యవేక్షణ వ్యవహారం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదన్నారు. ఆహార భద్రత కమిషనర్ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున.. అడ్వొకేట్ జనరల్ ఎన్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. సురక్షితం కాని ఆహార ఉత్పత్తులను నిషేధించే అధికారం ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్ చట్టం నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు.

'ఆహారం' నిర్వచనం కిందకు వచ్చే ఉత్పత్తులను పర్యవేక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనన్నారు. ఏజీ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం.. పొగాకు ఉత్పత్తుల విషయంలో జోక్యం చేసుకునే అధికారం ఏపీ ఆహార భద్రత కమిషనర్ కు లేదని స్పష్టంచేసింది. పొగాకు ఉత్పత్తులు విషయంలో కేంద్ర ప్రభుత్వం 2003 లో ప్రత్యేకంగా సీఓటీపీఏ చట్టం తీసుకొచ్చిందని గుర్తుచేసింది. గోదావత్ పాన్ మసాలా కేసులో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టంచేసిందని తెలిపింది. అదే కేసులో పాన్ మసాలా, గుట్కాలు 'ఆహారం' అనే నిర్వచనం కిందికి రాదని చెప్పినట్లు గుర్తుచేసింది. పొగాకు ఉత్పత్తుల వ్యాపారులు దాఖలు చేసిన వ్యాజ్యాలను అనుమతించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details