ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హాజరుకావాలని ఆదేశాలు ఇస్తేనే అమలు చేస్తారా?.. అధికారులపై హైకోర్టు కన్నెర్ర

By

Published : Apr 1, 2023, 7:23 AM IST

High Court Fires On Officers : ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య విద్య పూర్వ డైరెక్టర్ బాబ్జీ, విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాల పూర్వ ప్రిన్సిపల్ మురళీమోహన్‌పై హైకోర్టు మండిపడింది. కోర్టు ధిక్కరణ కేసుల్లో తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలిస్తేనే ఉత్తర్వులను అమలు చేస్తున్నారని మండిపడింది.

High Court Fires On Officers
High Court Fires On Officers

హాజరు కావాలని ఆదేశాలు ఇస్తేనే అమలు చేస్తారా?

High Court Fires On Officers : న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతే ఏమౌతుందిలే అనే నిర్లక్ష్య ధోరణి అధికారుల్లో కనిపిస్తోందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ కేసుల్లో తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలిస్తేనే ఉత్తర్వులను అమలు చేస్తున్నారని మండిపడింది. హైకోర్టులో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి కోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులను జైలుకు పంపాల్సిన అవసరం ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

విజయవాడ దంత వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్​గా ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న తనకు.. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కొన్నేళ్లుగా జీతం చెల్లించకపోవడంపై సుజాత అనే మహిళ 2018లో హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య విద్య పూర్వ డైరెక్టర్ కె.బాబ్జీ, విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాల పూర్వ ప్రిన్సిపల్ టి.మురళీమోహన్ విచారణకు హాజరయ్యారు.

న్యాయస్థానం ఆదేశించినప్పటికీ.. 2018 నుంచి ఓ మహిళకు జీతం చెల్లించకపోవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జీతం చెల్లించకపోతే ఆ మహిళ జీవనాధారం ఏవిధంగా సాగిస్తుందని అధికారులను ప్రశ్నించింది. ఆమె తనకు తానుగా ఉద్యోగం విడిచివెళ్లేలా అధికారుల తీరు ఉందని ఆగ్రహించింది. హెచ్ఆర్​ఏ, డీఏతో కలిపి చెల్లించేదాన్నే జీతం అంటారని, వాటిని మినహాయించి చెల్లించడం ఏమిటని ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కేసుల్లో తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలిస్తేనే తమ ఉత్తర్వులను అమలు చేస్తున్నారని ఆక్షేపించింది. హైకోర్టులో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి కోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులను జైలుకు పంపాల్సిన అవసరం ఉందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆమె దాఖలు చేసిన అఫిడవిట్​పై తిరుగు సమాధానం వేయాలని అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిన్ ఎం.గంగారావు, జస్టిస్ దుప్పల వెంకటరమణతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

పెండింగ్​లో ఉన్న జీతం బకాయిలు రూ.14లక్షలు ఇటీవల పిటిషనర్​కు చెల్లించామని వైద్యారోగ్యశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య విద్య పూర్వ డైరెక్టర్ కె.బాబ్జీ, విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాల పూర్వ ప్రిన్సిపల్ టి.మురళీమోహన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కేవలం జీతం మాత్రమే చెల్లించారని, డీఏ, హెచ్ఆర్​ఏ కింద రూ.8లక్షలు చెల్లించాల్సి ఉందని పిటిషనర్​ తరఫు న్యాయవాది ముదిరాజ్​ శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. జీతం అంటే హెచ్​ఆర్​ఏ, డీఏతో కలిపి అని గుర్తు చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details