ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Suryanarayana: వాణిజ్యశాఖలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నిస్తే వేధిస్తున్నారు: సూర్యనారాయణ

By

Published : Apr 21, 2023, 3:54 PM IST

Suryanarayana Fires on YCP Govt: వాణిజ్య శాఖలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకు వేధిస్తున్నారని.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మండిపడ్డారు. సంఘాన్ని రద్దు చేస్తామని నోటీసులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా నియామకాలు చేస్తున్నారని ఆరోపించారు.

Surya Narayana Fires on Govt
Surya Narayana Fires on Govt

Suryanarayana Fires on Govt: ప్రభుత్వం, వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ పలు ఆరోపణలు చేశారు. అవినీతి అధికారులను ప్రభుత్వం వెనకేసుకొస్తున్నట్టుగా కన్పిస్తోందని.. ఉన్నతాధికారులను ప్రశ్నిస్తోన్న ఎస్సీ ఉద్యోగులను లక్ష్యంగా చేస్తున్నారని విమర్శించారు. ఇబ్బందులు చెప్పుకుందామంటే ఆర్థిక మంత్రి బుగ్గన అందుబాటులో లేరన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ

వాణిజ్య పన్నుల శాఖలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నియామకాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. విశాఖ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు వాణిజ్య పన్నుల శాఖ బడ్జెట్ ఇవ్వలేదని.. బడ్జెట్ లేకున్నా కార్పొరేట్ ఆఫీస్ హంగులతో కార్యలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. బడ్జెట్ కేటాయింపు లేకుండా ఏర్పాటు చేసిన ఆ కార్యాలయం ప్రారంభోత్సవానికి మంత్రి బుగ్గన, ఉన్నతాధికారులు వెళ్లారని విమర్శించారు.

కార్యాలయం ఏర్పాటుకు వసూళ్లు చేశారంటూ పలు ఆరోపణలు వచ్చాయన్నారు. దీనిపై ఉన్నతాధికారి సుధాకర్ సహా ఐదుగురుపై ఆరోపణలున్నాయని.. కానీ కింది స్థాయిలో ఉన్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ-1గా ఉన్న విశాఖ వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ సుధాకర్​పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దొంగతనం చేసిన అధికారులను వదిలి ఉద్యోగులపై అకారణంగా చర్యలు తీసుకున్నారని ధ్వజమెత్తారు.

వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు తప్పు చేసిన వాళ్లను వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. మంత్రి బుగ్గన కార్యాలయంలో కూడా బాధ్యాయుతమైన వ్యక్తులు లేరని.. తాము ఎవ్వరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. వాణిజ్య పన్నుల శాఖ జోన్-1 పరిధిలోని బదిలీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఇదే విషయాన్ని విజయనగరం జిల్లాలో పని చేసే ఎస్సీ వర్గానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ సీఎస్​కు లేఖ రాశారని.. ఆ లేఖ రాసినందుకే సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వరీని సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్సీ వర్గానికి చెందిన సీనియర్ అసిస్టెంటును సస్పెండ్ చేయడం ఎస్సీ అట్రాసిటీ పరిధిలోకి వస్తుందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనరు నాగార్జునపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతామని వెల్లడించారు. వాణిజ్య పన్నుల శాఖలో కేడర్ పోస్టులో ఐఏఎస్‌లు ఉండాలనే నిబంధనలు ఉన్నాయని.. కానీ నాన్ కేడర్ అధికారులతో నియామకాలు చేస్తున్నారన్నారు.

గ్రూప్-1 అధికారి డి. రమేష్‌ను వాణిజ్య పన్నుల శాఖ కమిషనరుగా నియమించారని.. ఆయన్ను కమిషనర్ పోస్టు నుంచి తప్పించాలని.. లేకుంటే డీఓపీటీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రశ్నించిన సంఘాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి.. తమకు వచ్చిన విభేదాలను ఆసరా చేసుకుని కొందరు అధికారులు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఆదాయాన్ని పెంచేలా వాణిజ్య పన్నుల శాఖను పునఃవ్యవస్థీకరించాలని సీఎం జగన్ సూచించారని.. వికేంద్రీకరణ చేయమంటే.. కేంద్రీకృతం చేస్తున్నారని ఆక్షేపించారు.

రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖను మూడు ప్రాంతాలుగా చేసి పంచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అనేక విమర్శలు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు ఆ ప్రాంతాలను కట్టబెట్టారని.. ఈ మేరకు అడ్డగోలు బదిలీలు చేశారని మండిపడ్డారు. దీన్ని తప్పుపడుతూ తాము ధర్నా చేశామన్నారు. అయితేే రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా బదిలీలు జరిగాయన్నారు. బదిలీల్లో అక్రమాలపై విచారణ చేసినా.. నివేదిక ఇచ్చే విషయంలో చాలా జాప్యం చేశారన్నారు.

కాండక్ట్ రూల్స్ ప్రకారం ఉద్యోగుల ధర్నాలు చేయకూడదనేం లేదని.. ప్రవర్తనా నియామవళికి లోబడే తాము ధర్నా చేపట్టామని వివరించారు. బదిలీల్లోని అక్రమాలపై చర్యలు తీసుకోమంటే.. మా సంఘంపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తప్పు చేసిన అధికారులకు సన్మానం చేయాలా అని నిలదీశారు. తాము ఎవ్వరి విధులకు ఆటంకం కలిగించలేదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details