ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే: దిగ్విజయ్‌ సింగ్

By

Published : Dec 23, 2022, 2:49 PM IST

Updated : Dec 23, 2022, 3:07 PM IST

Digvijay Singh Comments: బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని దిగ్విజయ్‌ సింగ్ ఆరోపించారు. మోదీ విధానాలు పేద మధ్యతరగతి ప్రజలను దెబ్బతీశాయని విమర్శించారు. ప్రతిపక్షాలపై ఈడీ, ఐటీ, సీబీఐ కేసులంటూ వేధిస్తున్నారని మండిపడ్డారు.

Digvijay fires on central and state governments
బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే: దిగ్విజయ్‌ సింగ్

Digvijay Singh Comments: అటు కేంద్రం, ఇటు తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలనలో పేదరికం పెరుగుతుందని ఆరోపించారు. మోదీ విధానాలతో సంపన్నులకే ప్రయోజనం జరుగుతోందని విమర్శించారు. ఇంతలా ధరల పెరుగుదల, నిరుద్యోగం ఎప్పుడూ లేదని మండిపడ్డారు. నిర్దోషుల్ని కూడా దోషులుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పుతున్నారని దుయ్యబట్టారు. హింసను, ద్వేషాన్ని ప్రజల్లో నింపుతున్నారని పేర్కొన్నారు. తప్పుడు కేసుల్లో ఇరికించి బెయిల్‌ రాకుండా అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. అంతకు ముందు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన నివాళులర్పించారు.

కాంగ్రెస్‌ లేకుండా తెలంగాణ లేదు: ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీలే తెలంగాణను సాధించారా అని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్‌ విస్మరించారని ఆరోపించారు. ప్రజలకు హామీ ఇచ్చాం.. కాబట్టే తెలంగాణ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ లేకుండా తెలంగాణ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ కొన్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో కుటుంబపాలన కొనసాగుతోందని.. అవినీతిలో రికార్డులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీకి పరోక్షంగా ఎంఐఎం మద్దతు:బీజేపీకి పరోక్షంగా ఎంఐఎం మద్దతు ఇస్తోందని ఆరోపించారు. దేశంలో కొన్ని ఘటనలు జరుగుతున్నా ఎంఐఎం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీజేపీని గెలిపించేందుకే ఎంఐఎం ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌కు ఓవైసీ ఎందుకు మద్దతిస్తున్నారని నిలదీశారు. తెలంగాణలో మైనార్టీల రిజర్వేషన్లపై ఓవైసీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్‌ కృషి చేసిందని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు.

కాంగ్రెస్ నేతలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను: తెలంగాణలో సీనియర్ నాయకులు సంయమనం పాటించాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు. ఒకరిపై ఒకరు బహిరంగా విమర్శలు చేసుకోవద్దని తెలిపారు. ఎదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకుందామని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. బీఆర్ఎస్​పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. దానిని మనం ఉపయోగించుకోవాలని అన్నారు. పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని.. కలిసిపనిచేస్తేనే ప్రత్యర్థులను ఓడించగలమని స్పష్టం చేశారు.

పాదయాత్రను అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు: ఇదివరకే రేవంత్‌రెడ్డి తనను కలిశారని దిగ్విజయ్ సింగ్ వివరించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై చర్చించామని వెల్లడించారు. కొత్తవారికీ పీసీసీ చీఫ్‌ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. దేశంలో ఏమైనా మెడికల్‌ ఎమర్జెన్సీ పెట్టారా అని ప్రశ్నించారు. రాహుల్‌ పాదయాత్రను అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. దేశంలో కరోనా విపత్తు లేదని వైద్య నిపుణులు చెబుతున్నారని తెలిపారు. కరోనాపై మొదటిసారి ప్రధాని మాట్లాడారని.. అంతకుముందే కేంద్రమంత్రికి రాహుల్‌ లేఖ రాశారని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 23, 2022, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details