ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఈ పీఆర్సీ అసలే వద్దు.. పాత వేతనాలు, డీఏ ఇవ్వండి'

By

Published : Jan 19, 2022, 4:55 AM IST

EMPLOYEES UNIONS REACTION ON PRC: ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమను సంప్రదించకుండా పీఆర్సీపై విడుదల చేసిన జీవోలు వ్యతిరేకిస్తున్నట్లు ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు. సంక్రాంతి తర్వాత సానుకూల నిర్ణయం వెలువడుతుందని చెప్పి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు.

EMPLOYEES UNIONS REACTION ON PRC
EMPLOYEES UNIONS REACTION ON PRC

EMPLOYEES UNIONS REACTION ON PRC: పీఆర్సీ అమలుపై ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టేందుకు ఉద్యోగులు, పింఛనుదారులు సిద్ధమవుతున్నారు. అవసరమైతే సమ్మె చేయాలనీ భావిస్తున్నారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల మార్పు, సీసీఏ రద్దు, అదనపు పింఛనులో మార్పుపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఐక్యవేదిక గురువారం రోజు నిర్వహించే సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యాచరణను విజయవంతం చేయాలని ఐకాసల ఛైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు విలేకర్ల సమావేశంలో కోరారు. ‘ఈ పీఆర్సీ మాకొద్దు.. ఐఆర్‌తో పాటు డీఏలు ఇవ్వండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే పీఆర్సీ ఇవ్వండి’ అని ప్రకటించారు.

సమ్మెకూ వెనుకాడం..

‘ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా అవసరమైతే సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ పీఆర్సీ మాకొద్దు. 27% ఐఆర్‌తో పాటు డీఏలు ఇస్తూ పాత వేతనాలను కొనసాగించండి. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే పీఆర్సీ ఇవ్వండి. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చిన దాఖలాల్లేవు. వేతనాల్లో పడిన కోతను భర్తీ చేసేందుకే డీఏల విడుదల విషయంలో ప్రేమ ఒలకబోశారు. గత ప్రభుత్వాల హయాంలో సాధించుకున్న హెచ్‌ఆర్‌ఏ, అదనపు పింఛన్లను తీసేసే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. పదేళ్లకోసారి పీఆర్సీ విధానం మాకొద్దు. అన్నింటినీ ప్రభుత్వం వెనక్కి తీసుకునేవరకూ పోరాటం ఆగదు. బుధవారం ఏపీ ఎన్‌జీవో ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహిస్తున్నాం. ఐకాసల ఐక్యవేదిక సమావేశాన్ని గురువారం నిర్వహించి, కార్యాచరణ ప్రకటిస్తాం. అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదిక బయట పెట్టేవరకూ పోరాడతాం. తదుపరి కార్యాచరణ ప్రకటించేవరకూ ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతారు. సీసీఏ, హెచ్‌ఆర్‌ఏ పెంచకపోగా పాతదైనా ఇస్తారని ఇప్పటివరకు ఆశతో ఉన్నాం. అధికారులతో ప్రభుత్వం కుమ్మక్కైనట్లు ఉత్తర్వుల ద్వారా తెలుస్తోంది. అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదికపై మాతో చర్చించి, అధికారుల కమిటీ నివేదికను అమల్లోకి తెచ్చారు.’- బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస ఛైర్మన్‌

ఉత్తర్వులు రద్దు చేసేవరకూ ఉద్యమం..

‘పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేసేవరకూ ఉద్యమం చేస్తాం. ప్రభుత్వం కుట్రతో ఉద్యోగుల జీతభత్యాల్లో కోత వేసింది. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా.. ఇస్తున్న ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌తో, గత ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీలను రద్దుచేసింది. ప్రభుత్వం అన్యాయం చేసినందున ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. కలిసొచ్చే సంఘాలతో ముందుకు వెళ్తాం. చరిత్రలో ఇలాంటి దుర్మార్గమైన ఫిట్‌మెంట్‌ను చూడలేదు. ఉద్యోగులకు వ్యతిరేకంగా పీఆర్సీ ఉత్తర్వులు ఇచ్చినందున ఉద్యోగులందరూ ఏకతాటిపైకి రావాలి. ఐకాసల తరఫున 20న ప్రకటించే కార్యాచరణను ఉద్యోగులు విజయవంతం చేయాలి. సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాం. జీతాలు పెంచకపోగా ఉన్నవాటినీ హరించింది. గతంలో వచ్చే రాయితీలను తగ్గించింది. సూపరింటెండెంట్‌ కేడర్‌కు రూ.49 వేల వేతనం వస్తుంటే.. కొత్త పీఆర్సీ ప్రకారం రూ.47 వేలే వస్తుంది. ప్రతి కేడర్‌లోనూ నష్టపోతున్నాం. డీఏలతో వేతనాలు పెరుగుతాయని చెబుతున్నారు. పీఆర్సీ వల్ల అదనంగా రావడం లేదు. డీఏలతో సర్దుబాటు చేస్తున్నారు. మా హక్కులను హరించేలా ఉత్తర్వులు ఉన్నాయి. అన్ని చేస్తామని చెబుతూనే ఉత్తర్వులు మోసపూరితంగా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ పీఆర్సీని అమలు చేస్తామని చెబుతూనే ఆ నిబంధనలను ఇప్పుడే అమలు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులపై ప్రభుత్వానికి ప్రేమ లేదు. ఇచ్చే వాటిల్లో కోత వేస్తూ డబ్బులు మిగుల్చుకుంటుంది.’ - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఐకాస అమరావతి ఛైర్మన్‌

దశలవారీ పోరుకు సిద్ధం..

‘రాష్ట్రప్రభుత్వం జారీచేసిన కొత్త పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేయాలి. సీఎస్‌ కమిటీ సిఫార్సులను నిలుపుదల చేసి, అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదికను బయటపెట్టాలి. తాజా ఉత్తర్వుల వల్ల హెచ్‌ఆర్‌ఏ విషయంలోనూ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. కనీసం 30% ఫిట్‌మెంట్‌, పాత విధానంలో హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలి. లేకుంటే దశలవారీ ఉద్యమం చేపడతాం. కొత్త జీవోల ఉపసంహరణ జరిగే వరకూ పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలి. సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దుచేయాలి.’ - భూపతిరాజు రవీంద్రరాజు, అప్పలనాయుడు, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం

ఇదీ చదవండి:EMPLOYEES UNIONS REACTION: పీఆర్సీ ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details