ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'నీట్​' రాసేందుకు కనీస వయసు నిబంధన.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

By

Published : Mar 26, 2023, 1:10 PM IST

High Court Comments on Minimum Age Limit in NEET: నీట్ రాసేవారికి కనీసం 17 ఏళ్లు ఉండాలనే నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. గతంలోనే ఉమ్మడి హైకోర్టు ఈ వ్యవహారాన్ని తేల్చిందని పేర్కొంది. పిటిషన్​ను కొట్టివేసింది.

High Court Comments on Minimum Age Limit in NEET
హైకోర్టు

High Court Dismisses Plea Against Minimum Age Condition In NEET: జాతీయ అర్హత - ప్రవేశ పరీక్ష (నీట్) రాసేవారికి 'ప్రవేశ ఏడాది డిసెంబర్ 31' నాటికి కనీసం 17 ఏళ్లు ఉండాలనే నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. అదే విధంగా దీనిపై దాఖలైన పిటిషన్​ను ధర్మాసనం కొట్టేసింది. దీనికి సంబంధించిన వ్యవహారాన్ని ఉమ్మడి హైకోర్టు 2013, 2017లోనే తేల్చిందని గుర్తు చేసింది.

కనీస వయసు 17 సంవత్సరాలుగా నిర్ణయించడం ఒక వ్యక్తి సమానత్వపు హక్కును నిరాకరించినట్లు కాదని గతంలోనే ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిందని తెలిపింది. న్యాయస్థానం ఓ సారి నిర్ణయించిన వ్యవహారంపై మరోసారి దాఖలు చేసిన ఈ పిటిషన్​కి విచారణ అర్హత ఉండదని తేల్చి చెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా, జస్టిస్ ఆర్.రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

నీట్ రాసేందుకు 'అడ్మిషన్ ఏడాది 2023 డిసెంబర్ 31' నాటికి కనీస వయసు 17 సంవత్సరాలు ఉండాలంటున్న భారత వైద్య మండలి నిబంధన 4(1)ని కొట్టేయాలంటూ కడపకు చెందిన 16 ఏళ్ల ఓ మైనర్ బాలిక తండ్రి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. 17 ఏళ్ల నిబంధన రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛలను ఉల్లంఘించడమేనని.. న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ నిబంధన ఆర్టికల్ 14, 19, 21లను ఉల్లంఘిస్తోందని బాలిక తండ్రి పిటిషన్​లో పేర్కొన్నారు.

మైనర్ బాలికకు 17 సంవత్సరాల నిబంధనకు కేవలం నాలుగు రోజులు మాత్రమే తగ్గుతున్నాయని అన్నారు. కాబట్టి నీట్ రాసేందుకు బాలికను అనుమతించాలని ధర్మాసనాన్ని కోరారు. జాతీయ వైద్య కమిషన్ తరఫున న్యాయవాది వివేక్ చంద్రశేఖర్, కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హరినాథ్.. తమ వాదనలు వినిపించారు. దీనికి సంబంధించిన వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు గతంలోనే కొట్టేసిందన్నారు.

దానికి సంబంధిత తీర్పుల వివరాలను కోర్టుకు అందజేశారు. ఆ వివరాలను పరిశీలించి.. ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. గతంలో దాఖలైన పిటిషన్లను ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది కాబట్టి.. ప్రస్తుత వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కనీస వయసు నిబంధన కంటే.. నాలుగు రోజులు తగ్గాయా? లేదంటే కేవలం ఒక రోజు తగ్గిందా అనేది అప్రస్తుతం అని పేర్కొంది. ఒక్క రోజు తగ్గినా సరే మేమేం చేయలేం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓ సారి నిర్ణయించిన వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details