ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రుణయాప్​ల వేధింపులతో ఇద్దరు యువకులు మృతి

By

Published : Jul 21, 2022, 4:20 PM IST

Suicide: ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌లు ప్రాణాలు బలిగొంటున్నాయి. ఆన్​లైన్ ద్వారా డబ్బులు ఇస్తున్న యాప్‌ల నిర్వాహకులు.. ఆ డబ్బు రాబట్టేందుకు వేధింపులకు పాల్పడుతున్నారు. కొందరు రుణం తీర్చినా.. ఇంకా కట్టాలంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ పరిస్థితులనే ఎదుర్కొన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన యువకులిద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

two youngsters died with harassment of loan apps in east and west godavari districts
రుణయాప్​ల వేధింపులతో ఇద్దరు యువకులు మృతి

Suicide: ఓ యువకుడు బ్యాంకులో రుణం తీసుకున్నారు. అది తీర్చకపోవడంతో సిబ్బంది వచ్చి అడిగారు. తర్వాత ఏమైందో ఏమో.. తాను గోదావరిలో దూకి, చనిపోతున్నట్లు తండ్రికి ఫోన్‌ చేసి చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవానికి చెందిన కొడమంచిలి శివకుమార్‌(30) 2021లో రామచంద్రపురంలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేసేవారు. ఆ తర్వాత గ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకునేవారు. కుటుంబ అవసరాల కోసం క్రెడిట్‌ కార్డు ద్వారా రుణం తీసుకున్నారు. అది తీర్చకపోవడంతో ఈనెల 19న బ్యాంకు సిబ్బంది వచ్చి అడిగారు.

ఆ తర్వాత ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మంగళవారం అర్ధరాత్రి రోడ్‌కం రైలు వంతెనపైకి వచ్చారు. 12.30కు తండ్రి కొండయ్యకు ఫోన్‌ చేసి గోదావరిలోకి దూకేస్తున్నట్లు చెప్పారు. వంతెన 115వ స్తంభం వద్ద శివకుమార్‌ ద్విచక్రవాహనం, చరవాణి, చెప్పులను గుర్తించారు. ఈ ఘటనపై భార్య తులసి బుధవారం ఫిర్యాదు చేశారు. ఆ మేరకు గల్లంతైనట్లు కేసు నమోదు చేశామని హెడ్‌కానిస్టేబుల్‌ పి.రామకృష్ణ తెలిపారు.

పశ్చిమగోదావరిలో..ఆన్​లైన్ యాప్ లో రుణం తీసుకుని చెల్లించినా.. ఆ సంస్థ నిర్వాహకులు ఫోన్లో వేధించడంతో తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో చోటు చేసుకుంది. లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన భోగిరెడ్డి గిరిప్రసాద్(26) ఎంబీఏ చదివి హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఉద్యోగి. ఈ యువకుడు కొన్ని రోజుల క్రితం ఆన్​లైన్ ద్వారా ఓ యాప్ లో కొంత నగదు రుణం తీసుకున్నాడు.

పలు పర్యాయలుగా అధిక మొత్తం చెల్లించి అప్పు తీర్చినా.. యాప్ నిర్వాహకులు వేదించటం ప్రారంభించారు. ఆ యువకుడు ఉద్యోగం చేస్తున్న కంపెనీకి విషయం తెలియడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఇటీవల ఇంటికి చేరుకున్న యువకుడికి వేధింపులు ఎక్కువవ్వటంతో.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబానికి ఆధారమైన ఒకగానొక కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయారు.

ఇవీ చూడండి:పోలవరాన్ని రివర్స్‌గేర్‌లో వెనక్కి తీసుకెళ్తున్నారు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details