ఆంధ్రప్రదేశ్

andhra pradesh

HC on PD Act: సాధారణ నేరాలకు ఆ చట్టం వర్తించదు.. హైకోర్టు ధర్మాసనం తీర్పు

By

Published : Jun 2, 2023, 11:26 AM IST

High Court On PD Act: సాధారణ చట్టాల పరిధిలోకి వచ్చే నేరాలకు పాల్పడ్డప్పుడు ముందస్తు నిర్బంధ(పీడీ) చట్టాన్ని ప్రయోగించడం సరికాదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు నిందితుల చర్యలు ‘పబ్లిక్‌ ఆర్డర్‌’కు విఘాతం కలిగేలా లేనప్పుడు ఆ చట్టాన్ని వినియోగించకూడదని తేల్చిచెప్పింది.

HC on PD Act
HC on PD Act

High Court on Preventive Detention Act: సాధారణ చట్టాల పరిధిలోకి వచ్చే నేరాలకు పాల్పడ్డప్పుడు ముందస్తు నిర్బంధ(పీడీ) చట్టాన్ని ప్రయోగించడం సరికాదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు నిందితుల చర్యలు ‘పబ్లిక్‌ ఆర్డర్‌’కు విఘాతం కలిగేలా లేనప్పుడు ఆ చట్టాన్ని వినియోగించకూడదని తేల్చిచెప్పింది. ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ చట్టం కింద నేరాలకు పాల్పడిన ఓ యువకుడిపై అధికారులు పీడీ చట్టాన్ని ప్రయోగించి ముందస్తు నిర్బంధ ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. అనంతరం ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

తన కుమారుడు బి.సురేశ్‌పై అధికారులు ముందస్తు నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ తూర్పు గోదావరి జిల్లా జగన్నాథపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాది టి.బుజ్జి వాదనలు వినిపించారు. సురేశ్‌పై నమోదు అయిన కేసులు ఎక్సైజ్‌ చట్టానికి సంబంధించినవి అని కోర్టుకు తెలిపారు. ఆ చట్ట పరిధిలోకి వచ్చే నేరాలకు పాల్పడ్డప్పుడు పీడీ చట్టం వినియోగించడం చెల్లదని వాదనలు వినిపించారు. పబ్లిక్‌ ఆర్డర్‌కు విఘాతం లేనప్పుడు ముందస్తు నిర్బంధ ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదన్నారు. హైకోర్టు గతంలో ఈ వ్యవహారమై పలు తీర్పులిచ్చిందని న్యాయవాది గుర్తు చేశారు.

ప్రభుత్వ న్యాయవాది ఖాదర్‌ మస్తాన్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ కుమారుడు కల్తీ మద్యం విక్రయిస్తున్నారని న్యాయస్థానానికి తెలిపారు. ఆ మద్యం ప్రజల ప్రాణాలకు హానికరమన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ముందస్తు నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశామని స్పష్టం చేశారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది.

‘పిటిషనర్‌ కుమారుడిపై ఎక్సైజ్‌ చట్టం కింద మాత్రమే కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల్లో బెయిలు పొందారు. అతని చర్యల వల్ల ‘పబ్లిక్‌ ఆర్డర్‌’కు విఘాతం కలుగుతుందనేందుకు ఆధారాలు లేవు. అధికారులు జారీ చేసిన ముందస్తు నిర్బంధ ఉత్తర్వుల్లో కారణాలు పేర్కొనలేదు. సాధారణ చట్టాల పరిధిలోని నేరాలకు పీడీ చట్టం ప్రయోగించడం సరికాదు. పిటిషనర్‌ కుమారుడి చర్యలు ముందస్తు నిర్బంధ చట్టం పరిధిలోకిరావు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన ముందస్తు నిర్బంధ ఉత్తర్వులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 21న జారీ చేసిన జీవోను రద్దు చేస్తున్నాం. సురేశ్‌ను తక్షణం విడుదల చేయాలని ఆదేశిస్తున్నాం’ అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details