ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వ నిబంధనలతో అన్నదాతలకు ఇబ్బందులు

By

Published : Nov 24, 2022, 11:52 AM IST

Updated : Nov 24, 2022, 12:53 PM IST

Problems of farmers: ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిబంధనలు.. రైతులకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ఈ-క్రాప్‌ నమోదు, తేమ శాతం, గోనె సంచుల కొరత, బ్యాంకు గ్యారెంటీల జాప్యం, రవాణా భారం, హమాలీ ఖర్చులు వంటి ఆంక్షల చట్రంలో చిక్కి అన్నదాతలు విలవిలలాడుతున్నారు. సాంకేతిక సహాయకులు, వాలంటీర్లు, వ్యవసాయ సహాయకులు.. ఇలా సిబ్బందిని ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం భాగస్వాముల్లి చేసినా... ఆ ప్రక్రియలో తీవ్ర జాప్యం రైతులకు వేదననే మిగుల్చుతోంది.

ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు

Problems of farmers: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. వరి రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక అష్టకష్టాలు పడుతున్నారు. ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలకే విక్రయించాలన్న నిబంధనలు వారిపాలిట శాపంగా మారాయి. ఓ పక్క వర్షాలతో ధాన్యం తడిసి చెడిపోతుంటే... కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్‌లో 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వారం క్రితం నుంచి ముమ్మరంగా వరి కోతలు చేపట్టగా... అల్పపీడన ప్రభావంతో మాసూళ్లు మందగించాయి.

తూర్పు, మధ్య డెల్టాలో జల్లులతో కూడిన వర్షం కురవడంతో.. ధాన్యం రాశుల్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధాన్యం తేమ శాతం 17కు మించితే కొర్రీలు వేస్తున్నారు. ఈ నిబంధన రైతులకు అంతులేని వేదన మిగుల్చుతోంది. ధాన్యం ఆరబెట్టే స్థలం లేక... రోజుల తరబడి ఆరబెట్టలేక రైతులు నలిగిపోతున్నారు. ప్రభుత్వ సిబ్బంది పొలాల్లో పరిశీలించి ఆమోదించిన తర్వాత.. కొనుగోలు కేంద్రాలకు వెళ్లినా... మళ్లీ కొర్రీలు వేస్తున్నారు. ఏం చేయాలో తెలియక అన్నదాత సతమతమవుతున్నాడు.

గోనె సంచులు, హమాలీలు, రవాణా ఏర్పాట్లు వంటివి.. ప్రభుత్వ సిబ్బంది పర్యవేక్షణలో జరగాల్సి ఉన్నా.. ఆ భారాలూ రైతలపైనే పడుతున్నాయి.

గోనె సంచులు, హమాలీలు, రవాణా ఏర్పాట్లు ప్రభుత్వ సిబ్బంది పర్యవేక్షణలో జరగాల్సి ఉంది. దీనికి ధాన్యం సేకరణ సపోర్టింగ్ ఏజెన్సీలను ఏర్పాటు చేశారు. అయితే ధాన్యం రవాణా మిల్లుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడింది. దళారుల ముసుగులో ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరలో రవాణా ఛార్జీలను రైతుల నుంచే వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న కోట్ల రూపాయల రవాణా ఛార్జీలు మిల్లర్లకే చేరుతోంది. పొలాలకు వెళ్లే రహదారులు ధ్వంసం కావడంతో అక్కడి నుంచి ధాన్యం బయటకు తరలించడానికి రైతులపై అదనపు భారం పడుతోంది.

ప్రభుత్వ నిబంధనలతో అన్నదాతలకు ఇబ్బందులు

ప్రభుత్వ నిబంధన ప్రకారం ధాన్యం కొనుగోలులో ఈ క్రాప్ నమోదు కీలకంగా మారింది. ఈ క్రాప్ నమోదు చేసుకొని...ఈ కేవైసీ పూర్తైన రైతుల నుంచి మాత్రమే ధాన్యం విక్రయం జరుగుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 80 నుంచి 90 శాతం కౌలు రైతులే. నాలుగున్న లక్షల మంది కౌలుదారులు ఉండగా....లక్షా అరవై వేల మందికి మాత్రమే సీసీఆర్ సీ కార్డులు ఇచ్చారు. వీరికి మాత్రమే ఈ క్రాప్ నమోదుకు అవకాశం ఉంది. సీసీఆర్ సీ కార్డులు పొందని వారు నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే బ్యాంకు గ్యారెంటీల్లో తీవ్ర జాప్యం విక్రయించిన ధాన్యం 21 రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అవ్వడం లేదు. అలాగే తేమను తొలగించే యంత్రాలు రైతు భరోసా కేంద్రాల వద్ద కాకుండా మిల్లర్ల వద్ద ఉండటంతో వాటి ద్వారా మిల్లర్లే లబ్ది పొందుతున్నారు.

ఇలా వాతావరణ ప్రతికూలతలు, నిబంధనల ప్రతిబంధకాలు వరి రైతుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి కష్టనష్టాలకోర్చి పంట పండించినా... గిట్టుబాటు ధర దక్కపోగా.. ఏటా నష్టాలు మూటగట్టుకోవాల్సి రావడం సాగుదారుల్ని కోలుకోలేని దెబ్బతీస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 24, 2022, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details