ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నేల మీదే పడక, కనీసం దుప్పట్లు లేని పరిస్థితి - సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో దయనీయ స్థితిపై హైకోర్టు విస్మయం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2023, 7:12 AM IST

AP High Court on Social Welfare Hostels Worst Situation: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల అధ్వానస్థితిపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. విద్యార్థులు నేలమీద నిద్రించడం, టాయిలెట్లు సరిగా లేకపోవడంపై విచారం వెలిబుచ్చింది. తప్పుడు నిర్వహణ వల్ల గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో దయనీయ స్థితి ఉందని ఆక్షేపించింది. పాఠశాలలు, సొసైటీలపై సాంఘిక సంక్షేమశాఖకు నియంత్రణ లేకపోవడం ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొంది. సొసైటీ సభ్యులపై చర్యలు ప్రారంభించాలని.. ఆడిట్‌ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

AP_High_Court_on_Social_Welfare_Hostels_Worst_Situation
AP_High_Court_on_Social_Welfare_Hostels_Worst_Situation

నేల మీదే పడక, కనీసం దుప్పట్లు లేని పరిస్థితి - సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో దయనీయ స్థితిపై హైకోర్టు విస్మయం

AP High Court on Social Welfare Hostels Worst Situation :డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా అధికారులను ఆదేశించాలంటూ సామాజిక కార్యకర్త, న్యాయవాది పి. బాబ్జీ హైకోర్టు (AP High Court)లో పిల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ. సత్యప్రసాద్‌, న్యాయవాది జై భీమారావు వాదనలు వినిపించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై తూర్పుగోదావరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి సమగ్ర నివేదిక తెప్పించుకుంది.

Social Welfare Hostels Problems: నీళ్ల పప్పు.. పురుగుల అన్నం.. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల అవస్థలు

Two Toilets for 400 Students in AP Government Hostels :తూర్పుగోదావరి జిల్లా జడ్జి ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ (Justice Dhiraj Singh Thakur), జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు (Justice R. Raghunandan Rao)తో కూడిన ధర్మాసనం.. ఇటీవల కీలక ఉత్తర్వులిచ్చింది. ఆ సందర్భంలో నివేదికలోని అంశాలపై విస్మయం వ్యక్తం చేసింది. 400 మంది విద్యార్థులకు రెండే టాయిలెట్లు ఉన్నాయని, బెడ్లు లేక విద్యార్థులు నేల మీదే పడుకుంటున్నారని నివేదికలో ప్రస్తావించినట్లు తెలిపింది. వారికి దుప్పట్లూ ఇవ్వలేదని, గదుల్లో తగినన్ని ఫ్యాన్లు, లైట్లు, తలుపులు, కిటికీలు సక్రమంగా లేవని, వంటగది వ్యర్థాలను సమీపంలో కుమ్మరించడం వల్ల దోమలు కుడుతున్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఒక్క గదిలోనైనా టేబుల్‌ లేదని, వస్తువులు, పుస్తకాలు దాచుకునేందుకు విద్యార్థులకు ట్రంకు పెట్టెలూ ఇవ్వలేదంది. సీఎస్‌ఆర్‌ నిధులు, ప్రభుత్వ పథకాల ద్వారా ఇచ్చే నిధులపై ఆధారపడి ఆ పాఠశాలను నిర్వహిస్తున్న విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది.

Government Hostel Problems: శిథిలావస్థకు హాస్టళ్లు​.. ప్రాణభయంతో విద్యార్థులు

Social Welfare Hostels Worst Situation in Andhra Pradesh :పాఠశాల నిర్వహణ, విద్యార్థుల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉపయోగించాల్సిన నిధులను బహుశా దుర్వినియోగం చేయడం, అసలే వినియోగించకపోవడం జరిగి ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. పరిస్థితులను చక్కదిద్దేందుకు సాంఘిక సంక్షేమశాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారిని పంపాలని ఆ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. గోడి గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో వెంటనే సౌకర్యాలు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. విద్యార్థులకు మంచాలు, నాణ్యమైన బెడ్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. తాగునీటి కోసం నీటిశుద్ధి యంత్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది.

Government Hostels Conditions in AP:పాఠశాల వసతి గృహంలోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగినన్ని మరుగు దొడ్లు ఏర్పాటు చేసి.. నీటి వసతి కల్పించాలని నిర్దేశించింది. లైట్ల ఏర్పాటుకు సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విద్యార్థులకు అందజేస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించేందుకు వారానికోసారి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి వసతి గృహానికి వెళ్లాలని స్పష్టం చేసింది. సాంఘిక సంక్షేమశాఖ కమిషనర్‌ పూర్తి వివరాలు సమర్పించేందుకు విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.

Minister Meruga on hostels: "అవును.. వాటి పరిస్థితి బాగా లేదు".. మంత్రి మేరుగ కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details