ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్త్రీ సాధికారికత దిశగా అడుగులు...

By

Published : Mar 25, 2021, 2:17 PM IST

పురుషులతో సరిసమానంగా ప్రతీరంగంలోనూ ముందడుగు వేస్తున్న మహిళలు.. అన్నింటా జయకేతనాన్ని ఎగురవేస్తున్నారు. ప్రత్యేకించి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే విద్యారంగంలో ఇటీవల కాలంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు తీసుకువస్తున్న విద్యా సంస్కరణలు కావచ్చు.. మనుషుల ఆలోచనా తీరులో వస్తున్న మార్పులు కావచ్చు.. పాఠశాల, కళాశాల స్థాయి దాటుకుని ఉన్నతవిద్యాభ్యాసం వైపు మహిళలు ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు.

Women goto higher education
ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మహిళలు

ఒకటి రెండు దశాబ్దాల క్రితం వరకూ ఆడపిల్లకు చదువనే అంశం ఓ మిథ్య. మహా అయితే పదో, ఇంటర్​.. అంతే అంతటితో చదువుకు స్వస్తి చెప్పాల్సిందే. వివాహం పేరుతోనో.. మరేదో కారణంతోనో మహిళలు ఇంటికి పరిమితం కావాల్సిన పరిస్థితులుండేవి. కంప్యూటర్ యుగం ప్రారంభమైనప్పటి నుంచి పరిస్థితుల్లో మార్పులు రావటం ప్రారంభమయ్యాయి. అత్యాధునిక సాంకేతికత మనిషి జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపించింది. మార్కెట్ లో అవసరాలకు సరిపడా మానవవనరులు లేకపోవటం.. యంత్రాలపై ఆధారపడటానికి కారణమైంది. ఫలితం స్త్రీపురుష బేధం లేకుండా అందరికీ సమాన అవకాశాలు.. జీతభత్యాలు కల్పించాల్సి రావటం అనివార్యమైంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైపోయిన స్త్రీ.. నేడు పురుషుడితో సమానంగా ఉన్నత విద్యలను అభ్యసిస్తూ అన్ని రంగాల్లోనూ పైచేయి సాధిస్తోంది. ఇటీవలి కాలంలో దేశంలో విద్యారంగంలో నమోదైన గణంకాలు ఈ పరిస్థితులన్నింటినీ కళ్లకు కడుతున్నాయి.

మహిళలు కనబరుస్తున్న ఆసక్తే కొత్త కోర్సుల రూపకల్పనకు నాంది..

నేషనల్ సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్.. దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి గణాంకాలను అందించే బాధ్యత.. ఈ విభాగానిదే. గడచిన ఏడేళ్ల కాలంలో ఈ సర్వేలో నమోదైన గణాంకాలు.. ఉన్నత విద్యార్హతలు సాధించే దిశగా మహిళల్లో వచ్చిన చైతన్యాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయిని దాటుకొని.. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆపై చదువుల్లో మహిళల చూపిస్తున్న జోరును స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్రంలో చూసుకుంటే..

రాష్ట్రంలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్నే ఉదాహరణగా తీసుకుంటే.. గడచిన ఏడేళ్లలో ఇక్కడ నూతనంగా ప్రారంభించిన కోర్సులు అనేకం. అండర్ గ్రాడ్యుయేట్ దశను దాటుకొని పీజీ విద్యను అభ్యసించేందుకు మహిళలు కనబరుస్తున్న ఆసక్తే.. కొత్త కోర్సుల రూపకల్పనకు కారణమవుతోందని అధ్యాపకులు పేర్కొంటున్నారు. బాహ్య ప్రపంచపు అవసరాలకు తగినట్లుగా సరికొత్త కోర్సులను అందుబాటులో ఉంచటం, అత్యాధునిక మౌలిక వసతులను, సదుపాయాలను ఏర్పాటు చేయటం, మహిళ విశ్వవిద్యాలయం కావటంతో.. భద్రత ఉంటుందని భావించటం ఈ మార్పునకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. వీటితోపాటుగా కోర్సులకు అనుగుణంగా క్యాంపస్ సెలక్షన్ లను నిర్వహించేలా.. ఎంప్లాయిమెంట్ సెల్ ఏర్పాటు.. ఇలా విభిన్న కారణాలతో ఇటీవల కాలంలో పీజీ కోర్సులకు ఆదరణ పెరుగుతోందని వర్సిటీ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.

బయట పోటీ ప్రపంచానికి అనుగుణంగా తమను తీర్చిదిద్దుకుంటున్న మహిళలు.. ఉన్నత విద్యలను అభ్యసిస్తూ స్త్రీ సాధికారికత దిశగా అడుగులేస్తున్నారు. ప్రతీరంగంలోనూ పురుషుడితో సమానంగా పోటీ పడుతూ మహిళా శక్తికి నిర్వచనమిస్తున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సుస్థిరమైన జీవితానికి బాటలు పరుచుకుంటున్నారు.

ఇవీ చూడండి...:తిరుపతి ఉప ఎన్నికల్లో కుడి చేతికి సిరా

TAGGED:

ABOUT THE AUTHOR

...view details