వంద రూపాయల కోసం ఓ వ్యక్తి సొంత అన్ననే చంపాడు. తల్లికి వృద్ధాప్య పింఛను రాగా.. పెద్ద కుమారుడికి రూ. 300, చిన్న కుమారుడికి రూ. 200 ఇచ్చింది. వంద రూపాయలు అన్నకి ఎందుకు ఎక్కువ ఇచ్చావని.. మద్యం మత్తులో చిన్న కొడుకు తల్లితండ్రిని కొట్టాడు. దాడిని ఆపేందుకు వచ్చిన అన్నను కూడా... కర్రతో బలంగా కొట్టగా అతను మరణించాడు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం హేమావతిలో వృద్ధ దంపతులకు పెద్ద కుమారుడు లక్ష్మన్న, చిన్న కుమారుడు రంగన్న సంతానం. వీరికి పెళ్లిళ్లై వేరువేరుగా నివసిస్తున్నారు.
నిన్న తల్లికి వృద్ధాప్య పింఛను రాగా పెద్ద కుమారుడు లక్ష్మన్నకు రూ. 300, చిన్న కుమారుడు రంగన్నకు రూ. 200 ఇచ్చింది. రంగన్న ఆ డబ్బుతో మద్యం సేవించి తనకు వంద రూపాయలు తక్కువ ఎందుకు ఇచ్చావని ప్రశ్నిస్తూ... వృద్ధ తల్లిదండ్రులను కొడుతుండగా... అన్న లక్ష్మన్న జోక్యం చేసుకొని తమ్ముడిని వారించాడు. రంగన్న ఆవేశ భరితుడై మద్యం మత్తులో... కట్టెతో అన్నను బలంగా కొట్టాడు. ఆ దెబ్బలకు లక్ష్మన్న అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడని... మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న రంగన్నను పట్టుకునేందుకు... పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. మృతుడికి ఇద్దరు సంతానం.