ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MEALS: స్పందన సంస్థ అదుర్స్.. పేదవాడి ఆకలి తీర్చేందుకు 5రూపాయలకే భోజనం

By

Published : Jan 22, 2022, 7:15 PM IST

MEALS: పెరిగిన ధరలతో.. బయట ఏం తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. కనీసం 50 రూపాయలు పెట్టనదే భోజనం రావట్లేదు. ఈ పరిస్థితుల్లోనూ.. పేదవాడి ఆకలి తీర్చేందుకు 5 రూపాయలకే ఆహారం అందిస్తున్నాడు.. అనంతపురం యువకుడు. రోజూ ఓ రకం వంటకంతో నాణ్యమైన భోజనం కడుపునిండా పెడుతున్నారు. స్పందన క్యాంటీన్‌ ఏర్పాటు చేసి.. రోజూ 300 మంది ఆకలి తీరుస్తున్నారు.. చరణ్‌ నంద మిత్రబృందం.

చరణ్ నంద
చరణ్ నంద

MEALS: కరోనా పరిస్థితులు చాలా మందిని ఇంటికే పరిమితం చేయగా.. కొందరిలో మాత్రం సేవా దృక్పథాన్ని తట్టిలేపింది. కష్టకాలంలో ఆదుకోవాల్సిన బాధ్యతలు గుర్తు చేసింది. అలా... కరోనా కష్టకాలంలో సేవా కార్యక్రమాలు చేపట్టాడు.. చరణ్‌ నంద. అనాథశవాలకు ఉచిత అంత్యక్రియలు నిర్వహించారు. చాలా కుటుంబాల్లో అందరూ కరోనాకు గురైన సందర్భంలో వారికి 3 పూటలా ఆహారం ఉచితంగా అందించారు.

లాక్‌డౌన్ వేళల్లో మాత్రమే కాదు.. నిత్యం పేదలకు ఆహారం అందుబాటులో ఉంచాలనే తపనతో.. 5 రూపాయలకే భోజనం అందించాలనుకున్నాడు. అందుకోసం... అనంతపురం అంతటా అధ్యయనం చేసి.. పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు గుర్తించాడు. అలా.. మెుదటగా మెుదటగా బస్టాండు సమీపంలో స్పందన క్యాంటీన్ ఏర్పాటు చేశాడు.

చరణ్ మిత్రబృందం అనంతపురంలో స్పందన సంస్థ ద్వారా 12 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీరి సేవా కార్యక్రమాలు నచ్చి...అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందిస్తున్నారు.

స్పందన క్యాంటీన్‌లో రోజూ ఓ వంటకాన్ని పేదలకు రుచిగా, నాణ్యతగా అందిస్తున్నారు. సాంబార్ అన్నం, ఊరగాయ పచ్చడి, వేరుసెనగపొడి, అన్నం,పప్పు, పలావ్ ఇలా అనేక రకాల వంటకాలు స్పందన క్యాంటీన్ లో వితరణ చేస్తున్నారు. నాణ్యమైన భోజనం... 5 రూపాయలే కావడంతో తాము ఇక్కడే ఆకలి తీర్చుకుంటున్నట్లు వివిధ వృత్తుల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కొన్నాళ్లుగా చరణ్‌ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఇతరులకు సేవ చేయడంలో ఇష్టాన్ని వెతుక్కుంటున్న అతడికి తమ వంతు సహకారం అందిస్తున్నామంటున్నారు... చరణ్‌ తల్లి, సోదరి.

నిత్యావసర ధరలు పెరిగిపోతున్న తరుణంలో.. చరణ్‌ అనంతపురానికి సమీపంలోని బుక్కరాయసముద్రం, కూడేరు, నార్పుల మండలాల్లో రైతుల నుంచి నేరుగా కూరగాయలు, బియ్యం, కందిపప్పు మార్కెట్ ధర కంటే తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ సేవల్ని మరింత మందికి విస్తరింపజేయాలంటే దాతల సహకారం కావాలని కోరుతున్నాడు...చరణ్‌ నంద.


స్పందన సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ..చరణ్‌ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. స్పందన క్యాంటీన్లలో 5 రూపాయలకు భోజనంతో పాటు త్వరలోనే 2 రూపాయలకే ఇడ్లిలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు.

స్పందన సంస్థ

ఇదీ చదవండి:AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 12,926 కరోనా కేసులు, 6 మరణాలు

ABOUT THE AUTHOR

...view details