ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అకాల వర్షం... రైతన్నకు అపార నష్టం

By

Published : May 23, 2021, 7:41 AM IST

పంట పండాలంటే వర్షం చాలా ముఖ్యం. మరి అదే వర్షం అకాలంలో పడితే..? పొలంలో ఉన్న పంటతో పాటు కళ్లాల్లోని పంట పోతుంది. అనంతపురం జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు పొలాల్లోని వరి పంట నేలకొరిగింది. మరికొన్ని చోట్ల ధాన్యం రాశులు తడిచి మొలకెత్తే స్థితికి చేరుకున్నాయి.

Crop damage due to heavy rains
అకాల వర్షం...రైతన్నకు నష్టం

అకాల వర్షం.. అపార నష్టం

అనంతపురం జిల్లా రైతులను అకాల వర్షాలు మరోసారి దెబ్బతీశాయి. కనేకల్‌, బొమ్మనహాల్‌ మండలాల్లో దాదాపు అన్ని గ్రామాల రైతులూ తీవ్రంగా నష్టపోయారు. కొందరు రైతులు వరి కోసి కుప్పగా వేసుకోగా..మరికొందరు నూర్పిడి చేసుకొని ధాన్యం రాశులుగా పోశారు. ఆ సమయంలోనే వర్షం రావడంతో కొంత ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. మరికొంత ధాన్యం తడిచి మొలకలు వస్తున్నాయి.

నల్లచెర్వు మండలంలోని రెండు గ్రామాల్లో 27 హెక్టార్లలో వరిపంట పూర్తిగా వాలిపోయింది. 33 శాతం కన్నా తక్కువ పంట నష్టం జరిగితే... ఆ రైతుల పేర్లు పరిహారం జాబితాలో అధికారులు నమోదు చేయడం లేదు. పంట దశలో ఉన్నది మాత్రమే లెక్కలోకి తీసుకుంటామని.. తడిసిన ధాన్యం కుప్పలు, మొలకొస్తున్న ధాన్యాన్ని లెక్కలోకి తీసుకోబోమని అధికారులు చెప్తున్నారు.

ధాన్యం ముందుగానే విక్రయించేందుకు రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయించుకున్నామని సంచులు లేవన్న నెపంతో అధికారులు కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ముందే కొనుగోలు చేసుంటే ఇంత నష్టం జరిగేది కాదని... ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. జిల్లా మొత్తానికి 27 హెక్టార్లలోనే పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారుల నివేదిక సిద్ధం చేశారు. పంట మొత్తం కోల్పోయామని... పరిహారం ఇచ్చే రైతుల జాబితాలో మాత్రం తమ పేర్లు నమోదు చేయలేదంటూ కొంత మంది అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

బంగాళాఖాతంలో వాయుగుండం.. రానున్న 3 రోజుల్లో రాష్ట్రానికి వర్ష సూచన

ABOUT THE AUTHOR

...view details