ఆంధ్రప్రదేశ్

andhra pradesh

''దిశ'తో న్యాయం జరుగుతుందో.. లేదో... 'దశ'తో ఖచ్చితంగా పరిష్కారం'

By

Published : Mar 8, 2023, 5:50 PM IST

jada sravan

March 11 Dasha app launch in Andhra Pradesh: దిశ యాప్ ద్వారా న్యాయం జరుగుతుందో? లేదో? తెలియదు కానీ.. తమ దశ యాప్ ద్వారా మాత్రం బాధితులకు, ముఖ్యంగా మహిళల సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం చూపుతుందని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. 11వ తేదీన జై భీమ్ భారత్ పార్టీ తరుపున 'దశ' యాప్‌ను లాంచ్ చేయబోతున్నామని తెలిపారు. దశ యాప్ ద్వారా రాష్ట్రంలోని పేద, ధనిక, కుల, మత అనే తేడాలు లేకుండా ఎటువంటి సమస్య ఉన్నా గంటల వ్యవధిలోనే దశ యాప్ ద్వారా న్యాయాన్ని బాధితుల ఇంటిముందుకే తీసుకెళ్తామన్నారు. దశ యాప్‌నకు సంబంధించిన పోస్టర్‌ను విజయడలోని తన పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించి పలు కీలక విషయాలను వెల్లడించారు.

March 11 Dasha app launch in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 11వ తేదీన జై భీమ్ భారత్ పార్టీ తరుపున 'దశ' యాప్‌ను లాంచ్ చేయబోతున్నామని.. జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. దశ యాప్ ద్వారా రాష్ట్రంలోని పేద, ధనిక, కుల, మత అనే తేడాలు లేకుండా ఎటువంటి సమస్యలు ఉన్నా గంటల వ్యవధిలోనే దశ యాప్ ద్వారా న్యాయాన్ని వారి ఇంటిముందుకే తీసుకెళ్తామన్నారు. విజయవాడలోని తన పార్టీ కార్యాలయంలో ఈ యాప్‌నకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి పలు కీలక విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత నాలుగేళ్లలో సాధించని ప్రగతిని ఒక్క ఏడాదిలో ఏమి సాధిస్తారు? అని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో సీఎం జగన్.. మరో కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. అమరావతిలో రూ.5 కోట్ల లక్షల భూగర్భ సంపదను కాలగర్భంలో కలిపేసిన ఘనత సీఎం జగన్‌ది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి మీద ఉన్న ద్వేషంతోనే అమరావతిపై విషం చిమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిలో అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన వారిలో 50శాతం బడుగు, బలహీన వర్గాలవారే ఉన్నారని జడ శ్రావణ్ కుమార్ గుర్తు చేశారు.

అనంతరం విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి సీఎం జగన్‌పై జడ శ్రావణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమ్మిట్‌కు వచ్చి వెళ్లినా వ్యాపారవేత్తల కాళ్లు పట్టుకున్న ఖర్మ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ది అని వ్యాఖ్యానించారు. విశాఖ సమ్మిట్‌లో రూ.13 లక్షల కోట్ల రూపాయలు కాదు కదా.. కనీసం రూ.13 వందల కోట్ల రూపాయలు పారిశ్రామిక పెట్టుబడులైనా తీసుకురాగలరా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఏమి సాధించారని '175/175 వై నాట్' అని సందేశాలు ఇస్తారన్నారని ఆయన మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌కు పారిశ్రామికవేత్తలు రావాలంటేనే భయపడిపోతున్నారని, అందుకు కారణం.. జగన్ రాజకీయ వేధింపులు, అరాచక, అసమర్ధ పాలనను చూసేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కంపెనీలు పెట్టాలంటే వైసీపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా ముడుపులు ఇవ్వాల్సిందేనని ఆయన ఆరోపించారు. ఏపీని జగన్ మరో బిహార్‌గా మార్చేశారని.. ఏపీలో అప్పులు ఫుల్.. అభివృద్ధి నిల్ అని జడ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.

ఈనెల 11వ తేదీన జింఖానా గ్రౌండ్‌లో జై భీమ్ భారత్ పార్టీ తరుపున 'దశ' యాప్ లాంచ్ చేయబోతున్నామని ఆయన వెల్లడించారు. మొబైల్‌లో 'DASHA' అని టైప్ చేస్తే మీ సమస్య తమకు అందుతుందని, 50మంది న్యాయవాదులతో కూడిన లీగల్ టీమ్ ద్వారా ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దశ యాప్ ద్వారా బాధితులకు న్యాయం చేసేందుకు జై భీమ్ భారత్ పార్టీ ముందుంటుందన్నారు. దిశ యాప్ ద్వారా న్యాయం జరుగుతుందో? లేదో? తెలియదు కానీ.. ఈ దశ యాప్ ద్వారా మాత్రం బాధితులకు, ముఖ్యంగా మహిళల సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం చూపుతుందని ఆయన తేల్చి చెప్పారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details