ఆంధ్రప్రదేశ్

andhra pradesh

No Roads in Agency Areas: రోడ్డు లేక కాలినడకన ఆస్పత్రికి.. సకాలంలో వైద్యం అందక చిన్నారి మృతి

By

Published : Jul 2, 2023, 1:29 PM IST

Updated : Jul 2, 2023, 2:02 PM IST

Baby Died Due to Lack of Road Facilities: అదో మారుమూల గ్రామం. ఆ ప్రాంతంలో సరైన మౌలిక సదుపాయాలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో రహదారి సౌకర్యం లేదు. ఇదే ఓ పసికందుకు శాపంగా మారింది. సకాలంలో వైద్యం అందకపోవటంతో బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది.

Boy Died Due to Lack of Road Facilities
రహదారి సౌకర్యంలేక బాలుడు మృతి

రహదారి సౌకర్యంలేక బాలుడు మృతి

Child Died Due to Lack of Road Facilities: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల మరణ మృదంగం మార్మోగుతోంది. ఏళ్లు గడిచినా, పాలకులు మారినా ఆ ప్రాంతవాసుల దుస్థితి మాత్రం మారడం లేదు. కనీసం రహదారి సౌకర్యం కూడా లేని.. గిరిజన బతుకులకు ఇదే ఒక శాపంగా మారింది. గతవారం కొయ్యూరు మండలంలో ఆసుపత్రికి తరలిస్తుండగా ఓ గర్భిణి మృతి చెందిన ఘటన మరవక ముందే.. ఇదే తరహాలో మూడు నెలల వయసున్న ఓ పసికందు మృతి చెందాడు. కన్నబిడ్డ మృతి చెందిన కొండంత దుఃఖాన్ని దిగమింగుతున్న ఆ తల్లిదండ్రులకు.. రహదారుల సౌకర్యలేమితో బాలుడి మృతదేహాన్ని భుజంపై వేసుకుని ఇంటికి తీసుకుని వెళ్లే దుస్థితి ఎదురైంది.

వివరాల్లోకి వెళ్తే.. కొయ్యూరు మండలం మారుమూల మర్రిపాకలో ఓ వాలంటీర్ కుమారుడు సాయి(3 నెలలు) అనారోగ్యం బారిన పడ్డాడు. అయితే పసికందును ఆస్పత్రికి తరలించేందుకు ఆ ప్రాంతంలో రహదారి సౌకర్యం లేదు. దీంతో బాలుడిని ఎత్తుకుంటూ.. నానా అవస్థలు పడి కాలినడక మల్లికార్జుల గ్రామం వరకు తీసుకుని వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి వాహనంలో చింతపల్లి ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి చేరటం ఆలస్యం కావటంతో.. బాలుడి ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆ పసికందును నర్సీపట్నం హాస్పిటల్​కు తరలించారు. అయితే అక్కడ వైద్యులు పరిస్థితి చేయిదాటి పోయిందని, మెరుగైన చికిత్స మేరకు కేజీహెచ్​కు తరలించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ క్రమంలో బాలుడిని కేజీహెచ్​కు తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతిచెందాడు. బాలుడి మృతదేహాన్ని తీసుకుని ఇంటికి వెళ్లేందుకు వాహనం లేకపోవటంతో.. చూసి చలించిపోయిన ఓ బీజేపీ నాయకుడు ఐటీడీఏ పీఓకు సమాచారం ఇవ్వగా.. వారు 108 అంబులెన్స్​ను ఏర్పాటు చేశారు.

అయితే ఆ వాహనం గూడేంకొత్తవీధి మండలంలోని మల్లికార్జుల గ్రామం వరకు వెళ్లింది. అక్కడి నుంచి రహదారి సౌకర్యం లేకపోవటంతో వాహనం మార్గమధ్యలోనే నిలిచిపోయింది. అనంతరం అక్కడి నుంచి మరో 18 కిలోమీటర్లు ఓ ద్విచక్ర వాహనంపై.. మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు. తర్వాత అక్కడి నుంచి ద్విచక్ర వాహనం కూడా ముందుకు ప్రయాణించేందుకు మార్గం లేకపోవటంతో.. చేసేదేంలేక మరో 5 కిలోమీటర్ల మేర కాలినడకన మృతదేహాన్ని భుజాన వేసుకుని బాలుడి తండ్రి ఇంటికి చేరుకున్నాడు. సకాలంలో ఆస్పత్రికి తీసుకుని వెళ్లి ఉంటే తమ కుమారుడు దక్కేవాడని, రహదారి మార్గాలు సక్రమంగా లేకపోవటం వల్లే మరణించాడని బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి తమ ప్రాంతంలో రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.

Deadbody in Rickshaw: 'అమ్మ'కెంత కష్టమొచ్చింది.. రిక్షాలో కుమారుడి మృతదేహం తరలింపు

Last Updated : Jul 2, 2023, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details