ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు.. పాత పనులకు కొత్త బోర్డులు

By

Published : Mar 14, 2023, 8:53 PM IST

Irregularities in MGNREGA Works: ఉపాధి హామీ పథకంలో భాగంగా ఎప్పుడో చేసిన పాత పనులకు ఉమ్మడి జిల్లాల పేరుతో ఇప్పుడు బోర్డులను ఏర్పాటు చేసి ప్రభుత్వ నిధులను స్వాహా చేస్తున్న ఘటన అల్లూరి జిల్లాలో వెలుగుచూశాయి. పనులపై పర్యవేక్షణ లోపం, సోషల్‌ ఆడిట్‌ అంతంత మాత్రం జరుగుతుండటంతో అక్రమార్కులు అడ్డగోలుగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.

Irregularities in MGNREGA Works
ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు

పాత పనులకు.. కొత్త బోర్డులు.. ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు..!

Irregularities in MGNREGA Works: జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా.. పనులు పూర్తైన ప్రదేశంలో బోర్డులు ఏర్పాటు చేస్తారు. అల్లూరి జిల్లాలో మాత్రం బోర్డులు ఏర్పాటు చేయకుండానే పనులను ముగించేశారు. ఇదివరకు పూర్తైన పనులకు.. పాత జిల్లాల పేర్లతో నూతన బోర్డులు ఏర్పాటు చేశారు. విశాఖ ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో హుకుంపేట మండల పరిధిలో చేపట్టిన పనుల ప్రదేశంలో వారం కిందట నూతన బోర్డులు ఏర్పాటు చేశారు. వాటిలో పనులకు సంబంధించిన నిధుల వివరాలు పొందుపరచలేదు. కొన్ని బోర్డులైతే నాసిరకం కారణంగా అప్పుడే పడిపోయాయని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు.

ప్రస్తుతం ఏర్పాటు చేసిన బోర్డులు 2020-2021 లో చేపట్టిన పనులవిగా గ్రామస్థులు భావిస్తున్నారు. పాడేరు, పెదబయలు మండలాల్లో పనులు జరిగిన ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయకుండా వాటిని గ్రామ పంచాయతీల్లో, ఇళ్లల్లో పడేశారు. కొన్ని పంచాయతీ కేంద్రాల వద్ద ఈ బోర్డులను ఏకంగా సిమెంట్ పోతలతో తయారు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

గ్రామాల్లో సోషల్‌ ఆడిట్‌ జరుగుతున్న నేపథ్యంలో.. వారికి అవసరమైన ప్రాంతాల్లో అప్పటికప్పుడు వాటిని ఏర్పాటు చేసి బిల్లులు పొందవచ్చనే ఆలోచన చేసినట్లుగా స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఒక ప్రాంతంలో సోషల్‌ ఆడిట్‌ జరగని పరిస్థితుల్లో మిగిలిన ఖాళీ ఫలకాల్ని మరొక ప్రాంతానికి తరలించేందుకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాలకు అవసరమైన పనులను కానీ.. పని దినాలు కానీ అమలు జరపడం లేదని గిరిజన సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా.. పనుల వివరాల గురించి గుత్తేదారులను అడుగుతున్నారే తప్ప.. క్షేత్రస్థాయిలో పరిశీలించటం లేదని స్థానికులు అంటున్నారు.

"ప్రస్తుతానికి ఆడిట్ అవుతుందని అక్కడక్కడా బోర్డుల పెట్టడం జరుగుతుంది. కానీ అవి కూడా నాసిరకంగా ఉన్నాయి. ఈ ఆడిట్ కూడా సరిగ్గా జరగడం లేదు. ఏ రకం పనులు అవసరమో.. అవి సరిగ్గా గుర్తించడం లేదు. రైతు కోరుకునే పనులు చేపట్టడం లేదు. 2019, 2020, 2021లో పెట్టాల్సిన పాత బోర్డులను.. ఇప్పుడు ఆడిట్ జరుగుతుందని పెడుతున్నారు. ఆ ప్రజా ధనాన్ని నిర్వీర్యం చేసి.. ఆ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు". -పాలికి లక్కు, గిరిజన సంఘం, జిల్లా అధ్యక్షుడు

"ఉపాధి హామీ పనులపై జరుగుతున్న ఆడిట్ సరిగ్గా జరగడం లేదు. ఏదైతే బోర్డులు అక్కడ అమర్చారో వాటికీ.. ఆ పనులకూ ఏం విధమైన సంబంధం లేదు. పూర్తి అయిన పనులకు సంబంధించిన వివరాలు అక్కడ తెలియజేయాల్సి ఉన్నా.. అక్కడ ఖాళీగా బోర్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఆడిట్ అయిపోతే ఇవే బోర్డులను వేరే ప్రాంతానికి కూడా తరలించే అవకాశం ఉంది". - కృష్ణారావు, గిరిజన సంఘం నాయకులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details