ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఓట్లేసి గెలిపిస్తే నట్టేట ముంచారు.. వేతనాలు ఇవ్వకుండా మోసం చేశారు'

By

Published : Feb 20, 2023, 8:48 AM IST

K.G.B.V. teachers fire on AP Govt: రాష్ట్ర ప్రభుత్వంపై K.G.B.V ఉపాధ్యాయులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర స్కూళ్లలో టైం స్కేల్‌ ప్రకారం వేతనాలు ఇస్తున్న ప్రభుత్వం.. అందరి కంటే ఎక్కువ కష్టపడుతున్న K.G.B.V ఉపాధ్యాయులను చిన్నచూపు చూస్తోందని ఆవేదన చెందుతున్నారు. K.G.B.V ఉపాధ్యాయులకు వేతనాలు పెంచాలంటూ ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేస్తే.. సుమారు ఆరేళ్ల తర్వాత 23 శాతం వేతనాలను పెంచటం వల్ల తమకు ఏమాత్రం సంతృప్తిలేదంటూ ఆరోపిస్తున్నారు.

Teachers
Teachers

ఓట్లేసి గెలిపిస్తే నట్టేట ముంచారు..K.G.B.V ఉపాధ్యాయులు

K.G.B.V. teachers fire on AP Govt:: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉపాధ్యాయులగా విధులు నిర్వర్తిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఆరేళ్ల తర్వాత 23శాతం వేతనాలను పెంచింది. దీంతో ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర స్కూళ్లలో టైం స్కేల్‌ ప్రకారం వేతనాలు ఇస్తున్న ప్రభుత్వం.. అందరి కంటే ఎక్కువ కష్టపడుతున్న తమను చిన్నచూపు చూస్తోందని మండిపడుతున్నారు. రేయింబవుళ్లు కుటుంబాలను విడిచి పాఠశాలల్లోనే ఉంటూ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న తమను.. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. పాఠశాలల్లో సరైన సౌకర్యాలను కూడా కల్పించడం లేదని వాపోతున్నారు.

కనీస వేతనం పెంపుతో పాటు ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని పాదయాత్ర సమయంలో మాటిచ్చిన జగన్.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని K.G.B.V ఉపాధ్యాయులు ఆగ్రహంతో ఉన్నారు. జీవో నెంబర్ 40 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వకుండా మోసం చేశారని ఆక్షేపించారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన K.G.B.V రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొన్న ఉపాధ్యాయులు.. ఎన్నో ఆశలతో జగన్‌కు ఓట్లేసి గెలిపిస్తే నట్టేట ముంచారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో 66 శాతం వేతనాలు పెంచితే.. ఆరేళ్ల తర్వాత ఇప్పుడు కేవలం 23 శాతం మాత్రమే పెంపు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో తమకు అందిస్తున్న సంక్షేమ పథకాలకూ కోత విధించారని.. K.G.B.V టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న 21 వేల 755 రూపాయల వేతనంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. జీతాలు తప్ప ఇతర ఏ సౌకర్యాలు కల్పించడం లేదని.. ఇతర పాఠశాలల్లో ఉపాధ్యాయులకు వేతనాలు పెంచి తమకు మాత్రం అన్యాయం చేశారని వాపోతున్నారు. కుటుంబాలను విడిచి రేయింబవుళ్లు పాఠశాలల్లో ఉంటూ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జగన్ ప్రభుత్వం చేసినటువంటి తీరని అన్యాయన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిత్యావసరాల ధరలు పెంచారు, పెట్రోలు ధరలు పెంచారు, ఛార్జీలు పెంచారు, ప్రతిదీ పెంచుకుంటూపోతారు. కానీ..మా జీతాల విషయానికి రాగానే నట్టేనడి కోత కోస్తారు. గత ప్రభుత్వంలో రూ.7వేలు పంచితే..ఈ ప్రభుత్వంలో రూ. 5వేలు పెంచింది. మమ్మల్ని ఈ ప్రభుత్వం పిల్లలకు చకిరీ చేసే పని మనుషులుగా మాత్రమే పెట్టింది. - K.G.B.V ఉపాధ్యాయురాలు

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని.. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details