ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలీసులు బెదిరిస్తున్నారని.. కుటుంబం బలవన్మరణం

By

Published : May 26, 2020, 7:14 AM IST

చేయని నేరాన్ని ఒప్పుకోవాలని పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ రైతు కూలీ భార్యా బిడ్డకు విషమిచ్చి తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెంలో సోమవారం చోటుచేసుకొంది.

A family committed suicide by fear of police threats in baptla
బాపట్ల మండలంలో కుటుంబం బలవన్మరణం

మోటార్ల చోరీ కేసులో తనను ఇరికించారని.. పోలీసులతోపాటు అధికార పార్టీ మండల నాయకుడు, మరికొందరు వ్యక్తులు బెదిరించడంతో మనస్తాపం చెందిన మరుప్రోలు వీరాస్వామిరెడ్డి (37), భార్య వెంకటరమణ (34), కుమార్తె పోలేరమ్మ (10)తో కలిసి విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. బసివిరెడ్డిపాలేనికి చెందిన రైతు శివనాగిరెడ్డి తన పొలంలో మోటార్లు పోయాయని బాపట్ల గ్రామీణ పోలీసులకు ఈ నెల 16న ఫిర్యాదు చేశాడు. గ్రామానికి చెందిన వీరాస్వామిరెడ్డి, అతని బంధువు దొడ్ల అంకిరెడ్డిపై అనుమానంతో ఎస్సై కిరణ్‌ వారిని పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించారు. వారిద్దర్నీ తొమ్మిది రోజులుగా ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకూ స్టేషన్‌లోనే ఉంచి పంపిస్తున్నారు. పోలీసులు ఆదివారం మరుప్రోలువారిపాలెం వెళ్లి పెద్దల సమక్షంలో వారిని విచారించారు. ఆ సమయంలో అధికార పార్టీ మండల నాయకుడొకరు కలగజేసుకున్నారు. అనుమానితులను పోలీసులు దుస్తులు విప్పదీసి కొడితేనే నిజం చెబుతారని, జైల్లో వేసినా విడిపించటానికి ఎవరూ రారంటూ బెదిరింపులకు దిగారు. సోమవారం మరోసారి స్టేషన్‌కు వెళ్లాల్సి ఉండగా ఉదయం వీరాస్వామి భార్య, కుమార్తెతో కలిసి విషం తాగాడు. బంధువులు ఆసుపత్రికి తరలిస్తుండగా ముగ్గురూ చనిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. తప్పుడు కేసు పెట్టి తన కుమారుడి కుటుంబాన్ని బలి తీసుకొన్నారని వీరాస్వామిరెడ్డి తండ్రి శేషిరెడ్డి కన్నీరుమున్నీరయ్యారు.

లేఖలో ఏముందంటే..

‘గ్రామంలో అపహరణకు గురైన మోటార్లన్నీ నేనే దొంగిలించానంటున్నారు. నేనే తప్పూ చేయలేదు. కొంతమంది పోలీసుల ద్వారా వేధిస్తూ బలవంతంగా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 17వ తేదీ నుంచి స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నాం. మా కుటుంబానికి, మాతో ఉన్నవారికి న్యాయం చేయాలని వేడుకొంటున్నా’ అని వీరాస్వామిరెడ్డి ఆత్మహత్యకు ముందు లేఖ రాశాడని బంధువులు మీడియాకు అందజేశారు.

ఆత్మహత్యకు ముందు వీరాస్వామిరెడ్డి రాశారంటూ మీడియాకు అందిన లేఖ

నేరం ఒప్పుకోవాలని బెదిరించారు: అంకిరెడ్డి

మోటార్లు అపహరించారంటూ వీరాస్వామిరెడ్డి, నాతోపాటు మరో వ్యక్తిని విచారణ పేరుతో 9రోజులుగా ఎస్సై స్టేషన్‌కు పిలిపించి విచారించారు. చోరీతో మాకు సంబంధం లేకపోయినా నేరం ఒప్పుకోవాలని బెదిరించారు. ఆదివారం రాత్రి ఓ నాయకుడు మరింత భయపెట్టారు.

ఇవీ చదవండి:

గొడవ చిన్నది.. శిక్ష పెద్దది!

ABOUT THE AUTHOR

...view details