Rohit arrested for attacking young woman with knife: నిన్న నల్గొండలో ఫారెస్ట్ పార్క్‌లో అమ్మాయిపై హత్యాయత్నం కేసులో ప్రేమోన్మాది మీసాల రోహిత్‌ను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. గతంలోనూ నిందితుడు బాధితురాలిని సీసాతో బెదిరించాడని చెప్పారు. ఈ కేసును వ్యక్తిగతంగా తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు. మహిళల రక్షణ కోసం పోలీస్‌శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. తెలంగాణలోని షీ టీంలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. నిందితుడు స్నేహితుడికి, బాధితురాలి స్నేహితురాలికి దాడి చేస్తారని తెలియదని ఎస్పీ రెమా రాజేశ్వరి చెప్పారు.
అసలేం జరిగిదంటే:నల్గొండలో డిగ్రీ కళాశాల విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రేమపేరుతో కొంతకాలంగా వేధిస్తున్న విద్యార్థి రోహిత్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ దాడిలో విద్యార్థినికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం విద్యార్థినికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
విద్యార్థిని తన స్నేహితురాలితో కలిసి ఫారెస్ట్ పార్క్‌కు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినిని పార్క్ నుంచి పక్కకు తీసుకెళ్లిన రోహిత్ కత్తితో మెడ, కడుపుభాగం, ముఖం, కాళ్లపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కొంతకాలంగా రోహిత్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని బాధితురాలి తండ్రి వెల్లడించారు. అతని ప్రేమను నిరాకరించడం వల్లే రోహిత్ దాడి చేశాడని ఆయన తెలిపారు. విద్యార్థిని తండ్రి.. నిందితుడు రోహిత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.