ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Job Frauds in Hyderabad : 'కాసులు కురిపిస్తే.. కోరిన కొలువు ఇప్పిస్తాం'

By

Published : Jul 4, 2022, 9:49 AM IST

Job Frauds in Hyderabad : ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలతో దళారులు భాగ్యనగరంలో పాగా వేశారు. డబ్బును బట్టి మంచి అవకాశాలంటూ యువతకు వల వేస్తున్నారు. పలుకుబడితో కోరిన కొలువు ఇప్పిస్తామంటూ బేరసారాలు ఆడి వారిని నట్టేట మోసం చేస్తున్నారు. నకిలీ వెబ్​సైట్​లు సృష్టించి మరీ.. వారి కష్టార్జితాన్ని కాజేస్తున్నారు. అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ మార్గాల్లో డబ్బులకు ఉద్యోగాలిస్తామంటే నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Job Frauds in Hyderabad
Job Frauds in Hyderabad

Job Frauds in Hyderabad :తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో ఉండే యువతికి వనస్థలిపురంలోని ఓ శిక్షణ కేంద్రంలో ఏపీలోని కోనసీమజిల్లా వాసి పరిచయమయ్యాడు. ఆమె ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఇక్రిశాట్‌లో తనకున్న పరిచయాలతో కొలువు ఇప్పిస్తానని నమ్మబలికాడు. రూ.2.40 లక్షలు తీసుకున్నాడు. డబ్బు చేతికి రాగానే నకిలీ ఆఫర్‌ లెటర్‌ చేతికిచ్చాడు. మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరించాడు.

హైదరాబాద్‌ కొండాపూర్‌ ప్రాంత యువకుడు(25) బీటెక్‌ పూర్తిచేశాడు. ఐదు నెలలుగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. మే 24న అతడి మొబైల్‌ నంబరుకు ఫేస్‌బుక్‌ ఐడీ ‘జాబ్స్‌ పవర్‌’ పేరుతో సందేశం వచ్చింది. ఐటీ కంపెనీల్లో అవకాశం ఇప్పిస్తామంటూ ధ్రువపత్రాల పరిశీలనకు రూ.25,000 పంపమనగా రూ.15,000 చెల్లించాడు. వాట్సప్‌ ద్వారా కొద్దిరోజులు స్పందించిన నిందితుడు నంబరు బ్లాక్‌ చేసి ముఖం చాటేశాడు.

సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ల పరిధిలో నమోదైన మోసం కేసుల్లో ఇవి కొన్నే. అయిదు నెలల వ్యవధిలోనే ఈ రెండు కమిషనరేట్లలో సుమారు 40-50 మంది వరకూ బాధితులు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదుకానివి ఇంకెన్నో ఉన్నాయి. డిగ్రీలు, పీజీలు చేసిన లక్షల మంది యువతను ప్రస్తుతం జారీ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ ప్రకటనలు ఊరిస్తున్నాయి. ఐటీ కంపెనీల్లో అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కొందరు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతిభావంతులు స్వయం కృషితో కొలువులు సాధించేందుకు శ్రమిస్తుండగా, కష్టపడినా ప్రయోజనం ఉండదనే అభిప్రాయంతో ఉన్నవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. స్నేహితులు, బంధువులు, పరిచయస్తుల మాటలు నమ్మి దళారులను ఆశ్రయిస్తున్నారు.

సామాజిక మాధ్యమాల నుంచి సమాచారం సేకరించి..ఉద్యోగ సమాచారం పొందుపరిచే వెబ్‌సైట్ల నుంచి యువతీ, యువకుల విద్యార్హత సమాచారాన్ని(సీవీ) సేకరిస్తూ కొందరు ఐటీ, కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాల పేరిట మోసాలకు తెగబడుతున్నారు. నిరుద్యోగులను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం చేసుకుంటున్నారు. అవతలి వారి బలహీనతల ఆధారంగా వీలైనంత సొమ్ము దోచేస్తున్నారు.

‘‘ఓ అక్షరం మార్పుతో ప్రముఖ ఉద్యోగ వెబ్‌సైట్లను పోలిన వాటిని రూపొందిస్తున్న సైబర్‌ మోసగాళ్లు కొలువుల అన్వేషణలో ఉన్న వారి ఫోన్‌లకు సందేశం పంపుతున్నారు. ప్రతిష్ఠాత్మక కంపెనీల్లో పరీక్ష, ఇంటర్వూలు లేకుండానే ఉద్యోగాలిప్పిస్తామంటూ నమ్మిస్తున్నారు. కమీషన్‌, యూజర్‌ ఛార్జీల పేరుతో ముందుగానే రూ.లక్షలు కొట్టేస్తున్నారని’’ రాచకొండ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ హరినాథ్‌ తెలిపారు.

ఇటీవల మాదాపూర్‌లో ఓ ఐటీ కంపెనీ ఉద్యోగాలిస్తామంటూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2 లక్షల చొప్పున 800 మంది వద్ద ఇలాగే వసూలు చేసి బోర్డు తిప్పేసిందని గుర్తుచేశారు. అలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ మార్గాల్లో డబ్బులకు ఉద్యోగాలిస్తామంటే నమ్మొద్దని సూచించారు.

నగరంలో మోసగాళ్ల పాగా..ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలతో దళారులు నగరంలో పాగా వేశారు. తమకున్న రాజకీయ పలుకుబడితో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పోస్టును బట్టి రూ.3 లక్షలతో బేరసారాలు ప్రారంభిస్తున్నారు. ఇలాగే ఎల్బీనగర్‌కు చెందిన ఓ యువకుడి తల్లిదండ్రులను కలిసిన కొందరు రూ.25 లక్షలిస్తే ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మబలికారు.

వరంగల్‌కు చెందిన మోసగాడు పొన్నాల భాస్కర్‌.. భారతీయ రైల్వే, మెట్రోరైళ్లలో ఉద్యోగాలిప్పిస్తానంటూ సుమారు 100 మంది నుంచి రూ.10 కోట్లు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడిని ఇటీవల పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ముఠాలోని కొందరు ప్రస్తుతం రాజధానిలో పాగా వేసి నిరుద్యోగులను మాయమాటలతో మోసగించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details