ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎస్పీ ఫక్కీరప్ప సహా మరో ముగ్గురు ఉన్నతాధికారులపై ఏఆర్​ కానిస్టేబుల్ భానుప్రకాశ్ ఫిర్యాదు

By

Published : Aug 30, 2022, 2:31 PM IST

Updated : Aug 31, 2022, 7:12 AM IST

AR CONSTABLE BHANU PRAKASH COMPLAINT
AR CONSTABLE BHANU PRAKASH COMPLAINT

14:25 August 30

కేసు నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తానన్న భానుప్రకాశ్‌

ఎస్పీ ఫక్కీరప్ప సహా మరో ముగ్గురు ఉన్నతాధికారులపై ఏఆర్​ కానిస్టేబుల్ భానుప్రకాశ్ ఫిర్యాదు

AR CONSTABLE BHANU PRAKASH COMPLAINT:‘దళితుడిననే చిన్నచూపుతో కుట్రపూరితంగా నాపై తప్పుడు విచారణ వాంగ్మూలం రికార్డు చేశారు. ఇందుకు బాధ్యులైన పోలీసు అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయండి’ అని డిస్మిస్‌కు గురైన ఏఆర్‌ కానిస్టేబుల్‌ కె.ప్రకాశ్‌ మంగళవారం అనంతపురం టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై రాంప్రసాద్‌కు అందించిన ఫిర్యాదు మేరకు.. ‘గార్లదిన్నె పోలీస్‌స్టేషన్‌లో 2019లో నాపై నమోదైన ఓ కేసు కోర్టులో నడుస్తుండగానే.. పోలీసు శాఖ విచారణ చేపట్టింది. ప్రస్తుత సీసీఎస్‌ డీఎస్పీ మహబూబ్‌ బాషా, ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌, సీఐలు కృష్ణారెడ్డి, విజయభాస్కర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. బాధితురాలు బి.లక్ష్మి.. కానిస్టేబుల్‌ ప్రకాశ్‌కు రూ.10 లక్షల నగదు, 30 తులాల బంగారు ఆభరణాలు ఇవ్వలేదని చెప్పినా విచారణాధికారులు ఆమె వాంగ్మూలాన్ని మార్చేశారు. నేరం రుజువైందని వారే నిర్ణయించుకుని నన్ను ఉద్యోగం నుంచి తొలగించార’ని పేర్కొన్నారు. విచారణ జరిపిన పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. కుట్రతో కూడుకున్న ఆలోచనతో, తాను దళితుడిననే కారణంతో ఉద్యోగం నుంచి తొలగించారన్నారు. తనపై రిపోర్టు రాసిన ఏఆర్‌ అదనపు ఎస్పీ హనుమంతు, విచారణ జరిపిన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, డిస్మిస్‌కు ఆదేశాలిచ్చిన ఎస్పీ ఫక్కీరప్పపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి న్యాయం చేయాలని కోరారు. అనంతరం డిస్మిస్‌ అయిన కానిస్టేబుల్‌ప్రకాశ్‌ మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ ఫక్కీరప్పపై తీవ్ర ఆరోపణలు చేశారు.

పోలీస్‌ క్వార్టర్‌ ఖాళీ చేయాలని నోటీసు
ప్రకాశ్‌ పోలీస్‌ క్వార్టర్‌ ఖాళీ చేయాలంటూ మంగళవారం ఏఆర్‌ అదనపు ఎస్పీ హనుమంతు నోటీసు ఇచ్చారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు సర్వీసు నుంచి తొలగించినందున నివాసముంటున్న ప్రభుత్వ క్వార్టర్‌ను నోటీసు అందిన మూడు రోజుల్లోపు ఖాళీ చేయాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ తాఖీదును ఏఆర్‌ పోలీసులు ప్రకాశ్‌ కుటుంబసభ్యులకు అందజేశారు.

అసలేం జరిగిందంటే:తనను బూచిగా చూపి అనంతపురం ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ను విధుల నుంచి తొలగించారని ఆ కేసులో పోలీసులు ‘బాధితురాలు’గా పేర్కొన్న బి.లక్ష్మి తెలిపారు. ‘నా భర్త, అతని కుటుంబసభ్యులు నన్ను వేధిస్తున్నారని నాలుగేళ్ల కిందట గార్లదిన్నె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. అక్కడ న్యాయం జరగకపోవడంతో 2019లో ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వెళ్లాను అక్కడున్న సీఎం వలీ అనే కానిస్టేబుల్‌ నా ఫిర్యాదు రాస్తానని చెప్పి, నేను నా భర్త వేధింపుల గురించి చెప్తే ఆయన మరోలా రాశారు. కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ నన్ను వేధిస్తున్నట్లు, అత్యాచారం చేసినట్లు, నా నుంచి డబ్బు, బంగారం తీసుకుని మోసం చేసినట్లుగా రాశారు. ఎస్పీ వెళ్లిపోతున్నారని తొందరపెట్టి స్టేట్‌మెంట్‌ చదివే అవకాశం ఇవ్వకుండానే నాతో సంతకం చేయించుకున్నారు. దాని ఆధారంగానే కేసు నమోదుచేసి, అప్పటి డీఎస్పీ వీరరాఘవరెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టారు.

కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ నాపై అత్యాచారం చేసినట్లు మీడియాతో చెప్పారు. డీఎస్పీ ప్రెస్‌మీట్‌లో చెప్పింది తప్పు అని అప్పట్లోనే నేను టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు చేశాను. సీఐ జాకీర్‌ ఫిర్యాదు తీసుకోకుండా, విషయాన్ని కోర్టులో తేల్చుకోవాలన్నారు. నేను కోర్టును ఆశ్రయించి డీఎస్పీకి లీగల్‌ నోటీసులు ఇప్పించాను. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఇవేమీ పట్టించుకోకుండా నన్ను బూచిగా చూపించి ప్రకాశ్‌ను డిస్మిస్‌ చేయడం అన్యాయం. డీఎస్పీ మా కుటుంబ పరువుకు భంగం కలిగేలా ప్రవర్తించారు. ఇప్పుడు నా భర్త, పోలీసుల నుంచి మాకు ప్రాణహాని ఉంది. ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత’ అని లక్ష్మి ఆవేదన చెందారు.

‘నా భర్త వేధింపులు తాళలేక ఎన్నోసార్లు గార్లదిన్నె పోలీసులు, జిల్లా ఎస్పీని ఆశ్రయించాను. స్పందనకు హాజరైనప్పుడు ప్రకాశ్‌ పరిచయమయ్యారు. కేసులో నాకు సహకరించారు. అప్పటికే అతనిపై కక్ష పెంచుకున్న ఉన్నతాధికారులు మా మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు చిత్రీకరించారు. కానిస్టేబుల్‌ సీఎం వలీ, డీఎస్పీ వీరరాఘవరెడ్డి ఈ దుష్ప్రచారం చేశారని’ ఆమె ఆరోపించారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 31, 2022, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details