ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అడక్కుండానే మన ఖాతాల్లో డబ్బు వేస్తున్న చైనా గ్యాంగ్.. ఎందుకో తెలుసా?

By

Published : Apr 30, 2022, 9:35 AM IST

Loan App Frauds : లోన్ యాప్ నిర్వహిస్తున్న చైనీయులు తమ మకాం మార్చేశారు. పోలీసులకు చిక్కకుండా పొరుగు దేశాలకు వెళ్లి అక్కణ్నుంచి అమాయకులకు వల వేస్తున్నారు. గతంలో రుణాలు తీసుకున్న వారి వివరాలు సేకరించి వారిని బుట్టలో వేసుకునేెందుకు ప్రయత్నిస్తున్నారు. వారి ఖాతాల్లోకి రూ.50వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వారి అంగీకారం లేకుండా నగదు పంపి బురిడీ కొట్టించాలని చూస్తున్నారు.

Loan App Frauds
చైనీయుల కొత్త ట్రిక్.. అడక్కుండానే ఖాతాల్లోకి నగదు

Loan App Frauds : రుణయాప్‌లను నిర్వహిస్తున్న చైనీయులు ఈసారి పోలీసులకు దొరక్కుండా రెండు పొరుగు దేశాలకు మకాం మార్చేశారు. అక్కడ నుంచే గతంలో రుణాలు తీసుకున్నవారి వివరాలను సేకరించారు. ఇలా 4.5 లక్షల మంది వివరాలు తీసుకుని మా యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోండి అంటూ రోజూ ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు.

Online Loan App Frauds : అప్పు తీసుకుని చెల్లించిన వారికి మాత్రం వాట్సాప్‌ సందేశాలు పంపుతున్నారు. వాటికి స్పందించిన వారికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు నగదు బదిలీ చేస్తున్నారు. స్పందించని వారికి కూడా రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వారి అంగీకారం లేకుండానే వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇందుకోసం ఒక కార్పొరేట్‌ బ్యాంక్‌లో వర్చువల్‌ ఖాతాలను తెరిచారని, రెండు నెలల్లో వీరు కనీసం 75 వేల మందికైనా రుణాలిచ్చుంటారని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.

యాప్‌ల నిర్వహణ, నగదు బదిలీ కోసం చైనీయులు ఎంచుకున్న పంథాపై కీలక ఆధారాలు లభించాయి. 3 నెలల క్రితం ఆ రెండు దేశాలకు చైనీయులు వెళ్లినట్టు సాంకేతిక ఆధారాలు లభించగా మరిన్ని సాక్ష్యాల కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నిందితుల ఆచూకీ లభిస్తే ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీచేయాలని నిర్ణయించారు.

మూడురోజులకే వేధింపులు షురూ..తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని ముషీరాబాద్‌లో ఉంటున్న నర్సింగ్‌ విద్యార్థిని ఖాతాలో కొద్దిరోజుల క్రితం రుణయాప్‌ సంస్థలు రూ.50 వేలు నగదు బదిలీ చేశాయి. అవసరం లేకుండానే డబ్బు పంపారని, తిరిగి ఎలా పంపాలా అని అనుకుంటుండగా.. మూడోరోజు ఓ వ్యక్తి ఫోన్‌ చేసి.. అసలు, వడ్డీ రూ.80 వేలు వారంరోజుల్లోపు చెల్లించాలని గట్టిగా హెచ్చరించారు. తనకు సంబంధం లేదని చెప్పగా ఆమె ఫోటోలు నగ్నంగా మార్చి స్నేహితులకు పంపించారు.

జియాగూడ గంగానగర్‌లో ఉంటున్న రాజుకుమార్‌ యాదవ్‌ (22) రుణయాప్‌ల నుంచి రూ.12 వేలు అప్పు తీసుకున్నాడు. సకాలంలో వడ్డీ చెల్లించడం లేదంటూ రుణయాప్‌ సంస్థల ప్రతినిధులు ఫోన్లు చేస్తుండడం, అతడి స్నేహితులకు ఎస్‌ఎంఎస్‌లు పంపడంతో మనస్తాపంతో 11 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details