ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సాహస వీరుల కోసం సన్నద్ధమవుతున్న సాగర తీరం

By

Published : Oct 3, 2020, 5:24 PM IST

సాహస వీరుల కోసం సాగర తీరం స్వాగతం పలకనుంది. "గాలిలో పక్షయినట్టుందే... నీటిలో చేపయినట్టుందే" అంటూ... మళ్లీ ఉత్సహంగా గడిపే రోజులు రానే వస్తున్నాయి. కొద్ది నెలలుగా పర్యాటకులు ఎప్పుడెప్పుడా... అని ఎదురు చూస్తున్న సాహస క్రీడలు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. సందర్శకులను ఆనందంలో ముంచెత్తేందుకు విశాఖ సాగర తీరం సర్వ సన్నద్ధమవుతోంది.

సాహస వీరుల కోసం సన్నద్ధమవుతున్న సాగర తీరం
సాహస వీరుల కోసం సన్నద్ధమవుతున్న సాగర తీరం

విశాఖ అంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది.... నీలి సముద్రాన్ని పలకరిస్తూ విశాలంగా పరుచుకున్న ఇసుక తిన్నెలే. సాగర తీరంలో ప్రకృతి రమణీయతో పాటు.. అబ్బురపరిచే సాహస క్రీడలకు రుషికొండ బీచ్ పెట్టింది పేరు. ఎంతో మంది పర్యటకులు, సాహస వీరులు రుషికొండ బీచ్​కు చేరుకొని ఉల్లాసంగా ఉత్సహంగా గడుపుతారు. అయితే... గత ఏడాది గోదావరి బోటుప్రమాదం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జల క్రీడలపై ప్రభుత్వం నిషేధం విధించింది. కొత్త పాలసీతో సురక్షిత విధానంలో తిరిగి జలక్రీడలను ప్రారంభించే సమయం వచ్చిందనుకుంటున్న సమయంలో కరోనా లాక్​డౌన్ ప్రారంభమైంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పర్యటక ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్​లను సైతం ఏర్పాటు చేసింది.

ఇందులో భాగంగా సాహస క్రీడలన్నింటినీ కమాండ్ కంట్రోల్ రూమ్​ నుంచే ఆపరేట్ చేసే విధానాన్ని అమలుచేస్తోంది. ఆయా క్రీడలకు సంబంధించి టికెట్ రుసుము సైతం.. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచే వసూలు చేస్తారు. పర్యటక అభివృద్ధి సంస్థకు రావాల్సిన మొత్తాన్ని తీసుకుని మిగిలిన సొమ్మును నిర్వాహకులకు అందిస్తారు.

రుషికొండ తీరంలోను కంట్రోల్ రూమ్​ను ఏర్పాటు చేసి...వివిధ సాహస క్రీడలను సందర్శకుల కోసం మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందులో ప్రధానంగా పారాగ్లైడింగ్, పారామోటరింగ్, బోటింగ్, స్కూబా డైవింగ్, ఇసుక తిన్నెల నుంచి సముద్రంలోకి అలలను చీల్చుకుంటు దూసుకుపోయే హోవర్ క్రాఫ్ట్ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం రుషికొండ తీరంలో రోజుకు 5 వేల మంది సందర్శకులు వస్తున్నారు. వారాంతాల్లో అయితే 10 వేల మంది వరకు వస్తున్నారు. జల క్రీడలు అందుబాటులోకి వస్తే పర్యటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి:

శ్రీకాకుళం, తిరుపతిలలో శిల్పారామాల నిర్మాణానికి నిధులు జారీ

ABOUT THE AUTHOR

...view details