ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజ్​భవన్​లో ఘనంగా ఉగాది వేడుకలు.. జాతీయ అవార్డు గ్రహీతలకు గవర్నర్ సత్కారం

By

Published : Apr 2, 2022, 7:12 PM IST

రాజ్​భవన్​లో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ అవార్డులు పొందిన పలువురు తెలుగువారిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సత్కరించారు.

రాజ్​భవన్​లో ఉగాది వేడుకలు
రాజ్​భవన్​లో ఉగాది వేడుకలు

గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్​భవన్​లో శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఘనంగా సత్కరించారు. అవార్డు గ్రహీతలు మరెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకోవాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. వైద్యం, సాహిత్యం, సంగీతం, కళలు, క్రీడలు వంటి రంగాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా పలువురు తెలుగు వారు ప్రతిష్టాత్మక అవార్డులు పొందగలిగారన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ ఘనత సాధించినందుకు తాను గర్విస్తున్నానన్నారు.

గవర్నర్​ సత్కారం పొందిన వారిలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు అన్నవరపు రామస్వామి, డాక్టర్ సుంకర వెంకట ఆది నారాయణరావు, గరికిపాటి నరసింహారావు, దండమూడి సుమతీ రామ్మోహన్​రావు, యడ్ల గోపాలరావు, దళవాయి చలపతిరావు తదితరులు ఉన్నారు. మరణానంతరం పద్మశ్రీ అవార్డు పొందిన గోసవీడు షేక్ హసన్, ఇటీవల మరణించిన పద్మశ్రీ పురస్కార గ్రహిత డాక్టర్ అసదవాడి ప్రకాశరావు కుటుంబ సభ్యులను కూడా గవర్నర్ సత్కరించారు. నారీ శక్తి పురస్కార గ్రహీత సత్తుపాటి ప్రసన్న, వికలాంగుల జాతీయ అవార్డు విజేత షేక్ జాఫ్రీన్, ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత ఎన్. ఉషను గవర్నర్ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.

తిరుమల తిరుపతి దేవస్ధానం పండితులు, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్దానం పండితులు గవర్నర్ దంపతులకు వేద ఆశీర్వచనం చేసి ప్రసాదం అందించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తొలుత గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ రాజ్‌భవన్‌లోని అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, సంయుక్త కార్యదర్శి ఎ. శ్యామ్‌ ప్రసాద్‌, ఉప కార్యదర్శి డి.సన్యాసిరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Ugadi celebrations: సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు.. పాల్గొన్న జగన్ దంపతులు

ABOUT THE AUTHOR

...view details